ఇసుక దోపిడీ

ఇసుక దోపిడీ


పెన్‌గంగ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుక తరలింపు

జిల్లాలో నదులు, వాగుల ప్రాంతాల్లో 20కి పైగా నిల్వలు

ఫిబ్రవరిలో సర్వే చేసినా ఇవ్వని రీచ్‌ అనుమతులు

అక్రమార్కుల ఆగడాలతో ప్రభుత్వాదాయానికి భారీ గండి




ఆదిలాబాద్‌: జిల్లాలో ఇసుక హారతిలా కరిగిపోతూనే ఉంది. వాగులు, వంకలు, ఒర్రెలు, నదుల నుంచి అక్రమార్కులు ఇసుకను నిత్యం తోడేçస్తూనే ఉన్నారు. ఇసుక నిల్వలను గుర్తించిన ప్రభుత్వం ఇప్పటివరకు రీచ్‌లకు అనుమతివ్వలేదు. దీంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుండగా.. ప్రభుత్వానికి భారీగా గండిపడుతోంది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఇసుకాసురుల అక్రమ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది.   



రీచ్‌ అనుమతుల్లో జాప్యం..

జిల్లా స్థాయి ఇసుక కమిటీ చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌ చైర్మన్‌గా జాయింట్‌ కలెక్టర్, మెంబర్‌ కన్వీనర్‌గా భూగర్భ గనుల శాఖ ఏడీ ఉన్నారు. ఐటీడీఏ పీవో, జిల్లా పంచాయతీ అధికారి, భూగర్భ జలాల శాఖ డీడీ, నీటిపారుదల శాఖ ఈఈ, గ్రామీణ నీటి సరఫరా ఈఈ, పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డ్‌ పర్యావరణ ఇంజనీర్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ నుంచి ప్రతిపాదిత సభ్యుడు మెంబర్లుగా ఉన్నారు. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం జాయింట్‌ కమిటీ (భూగర్భ గనులు, రెవెన్యూ, భూగర్భ జలాలు, నీటిపారుదల శాఖ) ఇసుక రీచ్‌లను గుర్తించేందుకు సర్వే నిర్వహించింది. భీంపూర్, ఉట్నూర్, జైనథ్, తలమడుగు, సిరికొండ, ఆదిలాబాద్‌రూరల్‌ మండలాల్లో నది, వాగులు, వంకలు, ఒర్రెల సమీపంలో ఇసుక నిల్వలను గుర్తించారు.



ఇప్పటివరకు ఇసుక నిల్వలున్న వాటికి రీచ్‌లుగా అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ప్రధానంగా ఇసుకకు ఒక ధర నిర్ణయించి దాని ఆధారంగా ప్రభుత్వానికి సీనరేజ్‌ చార్జీల రూపంలో ప్రతీ క్యూబిక్‌ మీటర్‌కు రూ.40 చొప్పున చెల్లించాలి. మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు ఇసుక మేటలను తీసే, సరఫరా చేసే ప్రక్రియను పరిశీలించి వేబిల్లు ఆధారంగా ప్రక్రియ కొనసాగించాలి. కాగా జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు.



ప్రభుత్వాదాయానికి గండి.

జిల్లాలో ప్రధానంగా భూగర్భ గనుల శాఖకు పెద్ద తరహా ఖనిజం మాంగనీస్, చిన్న తరహా ఖనిజాలు స్టోన్‌ క్రషర్‌ల ద్వారా ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది రూ7.21 కోట్లు లక్ష్యం నిర్ణయించగా, జూన్‌ వరకు రూ.4.16 కోట్ల ఆదాయం లభించింది. ఇసుక ద్వారా ఆదాయం లభించే మార్గం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో నష్టం జరుగుతోంది. ఇసుకాసురులు ఎలాంటి అనుమతి లేకుండానే నది పరీవాహక ప్రాంతాలు, వాగుల్లో వేలాది క్యూబిక్‌ మీటర్ల ఇసుకను యథేచ్ఛగా దోపిడీ చేసేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ట్రాక్టర్‌ (రెండున్నర క్యూబిక్‌ మీటర్లు) ఇసకకు రూ.2వేల నుంచి రూ.రెండున్నర వేలు, టిప్పర్‌ (8 క్యూబిక్‌ మీటర్లు) ఇసుకకు రూ.8వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు.



పెన్‌గంగా నుంచి దోపిడీ..

పెన్‌గంగా నది నుంచి ఇసుక దోపిడీ అడ్డగోలుగా కొనసాగుతోంది. ప్రస్తుతం వర్షాలు లేకపోవడంతో పెన్‌గంగాలో నీటి ప్రవాహం అంతగా లేదు. ఇసుక మేటలు బయట పడ్డాయి. దీంతో అక్రమార్కుల చూపు దీనిపై పడింది. పెన్‌గంగా పరీవాహక ప్రాంతాల్లో సుమారు 10వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మేటలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇటీవల జైనథ్‌ మండలంలో పెన్‌గంగా పరీవాహక ప్రాంతాల్లో ఇసుకను తోడేందుకు లారీలు, టిప్పర్లు సులువుగా వచ్చేలా నది గచ్చు బండరాళ్లను జిలిటెన్‌ స్టిక్‌లతో పేల్చివేయడం సంచలనం కలిగిస్తోంది.



వీడీసీలకు ఆదాయం..

కొన్ని గ్రామాల్లో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అనధికారికంగా టెండర్లు నిర్వహించి ఇసుకను వాగుల్లో నుంచి దగ్గరుండి తరలిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో అనధికారికంగా టెండర్‌ అప్పగిస్తున్నారు. ఇలా గ్రామ అభివృద్ధి కమిటీలు, కొంతమంది కాంట్రాక్టర్లు ఇసుక ద్వారా లక్షల ఆదాయం పొందుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. వాల్టా చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఇసుకను తోడడం చట్టరీత్యా నేరం. అయితే ప్రభుత్వ పనులకు ఇసుకను ఉపయోగించేందుకు వాగుల నుంచి ఇసుకను తీసుకువస్తున్నట్లు చెబుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక టెండర్లు తీసుకున్న వ్యక్తులు లక్షల్లో సంపాదిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top