పచ్చగా... ఇసుక దందా!


  • నారాయణపట్నం కేంద్రంగా ఇసుక అక్రమరవాణా

  • రాత్రివేళలో వందలాది ట్రాక్టర్లు, లారీలతో తరలింపు

  • ఇప్పటికే కొల్లగొట్టిన రూ కోటిన్నర విలువైన ఇసుక

  • ఉచితం ముసుగులో అక్రమాల దందా...

  • కనీసం స్పందించని అధికారులు

  •  

     

     

     చీకటిపడితే చాలు అక్కడ వందలాది వాహనాలు సిద్ధమైపోతాయి. ఇసుకను నింపుకుని యథేచ్ఛగా తరలిపోతుంటాయి. అధికారులంటే భయం లేదు... తనిఖీలంటే బెదురు లేదు. ఉచితం అనేసరికి అక్రమానికి లెసైన్స్ ఇచ్చినట్టయింది. తమ్ముళ్ల దందాకు అడ్డూ అదుపు లేకపోతోంది. తాగునీటి పథకాలకు ముప్పువాటిల్లుతున్నా... మనకెందుకులే అనే ధోరణి. నీటి ఊటలకు విఘాతం కలుగుతున్నా... ఏమవుతుందిలే అనే నిర్లక్ష్య వైఖరి. ఇదీ నెల్లిమర్ల మండలం నారాయణ పట్నంలో సాగుతున్న ఇసుక దందా తీరు... తెన్ను.

     

    నెల్లిమర్ల: ‘ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రిస్తాం... ప్రభుత్వం గుర్తించిన రీచ్‌లనుంచే ఇసుక రవాణాకు అనుమతిస్తాం. తాగునీటి పథకాలున్న ప్రాంతాల్లో ఇసుకను అస్సలు తవ్వనివ్వం. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటాం.’ ఇదీ ఇసుక తవ్వకాలపై ప్రభుత్వం చెబుతున్న మాటలు.


    ఇవేవీ అధికార పార్టీ నేతలకు వర్తించడంలేదు. దీనికి ఉదాహరణ నెల్లిమర్ల మండలంలోని నారాయణపట్నం పరిధిలో సాగుతున్న ఇసుక దందానే. చీకటిపడితే చాలు ఇక్కడ ఇసుక అక్రమరవాణా మొదలవుతుంది. రాత్రివేళల్లో వందలాది ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను రవాణా చేస్తున్నారు.

     

    రెండు నెలలుగా సాగుతున్న దందా...

    నారాయణపట్నం గ్రామపరిధిలోని చంపావతి నదినుంచి రోజూ రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. శ్మశానంలోని ఇసుకను పెద్ద ఎత్తున తవ్వుతున్నారు. ముందుగా తమ ట్రాక్లర్లతో గ్రామంలో పోగులు వేస్తున్నారు. అక్కడినుంచి రాత్రివేళల్లో లారీలు, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు.


    విశాఖపట్నంనుంచి కూడా పెద్ద ఎత్తున లారీలు ఇక్కడికి ఇసుక కోసం వస్తున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో రాత్రికి సుమారు వంద వాహనాల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మొత్తమ్మీద రోజుకు రూ. 2లక్షల విలువ చేసే ఇసుక ఇక్కడి నుంచి తరలిపోతోంది. రెండు నెలలుగానే ఈ దందా సాగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

     

    తాగునీటి పథకాలకు ముప్పు

    ప్రస్తుతం ఇసుక అక్రమంగా తవ్వుతున్న ప్రాంతంలోనే రామతీర్ధం మెగా మంచినీటి పథకముంది. ఈ పథకంనుంచే నెల్లిమర్ల, గుర్ల మండలాలతో పాటు గరివిడి మండలానికీ తాగునీరు సరఫరా అవుతోంది. ఇసుక తవ్వకాలు ఇలాగే కొనసాగితే ఈ పథకాలు పూర్తిగా పడకేసే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో అధికారులు కల్పించుకుని నారాయణపట్నం ప్రాంతంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా నిరోధించాలని పలువురు కోరుతున్నారు.

     

    అధికారం అండగా...

     గ్రామానికి చెందిన అధికారపార్టీ నేతలే ఈ దందాకు పాల్పడుతున్నారు. గతంలోనూ వీరు ఇసుక రవాణాతో కోట్లు గడించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఎవరైనా ఫిర్యాదుచేస్తే వారికి వార్నింగ్ ఇస్తారు. ట్రాక్టరుతో గుద్దేస్తామని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం తమదని, ఎవరైనా ఎదురు తిరిగితే తిప్పలు తప్పవని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు తెలిసింది. ఒకరిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫిర్యాదు చేసినవారి పేర్లు బయటకు లీకవ్వడంతో వారు కూడా వెనక్కుతగ్గారు.

     

     వేరే వాళ్ళకు నో ఛాన్స్

     ఇక్కడ ఇసుక తవ్వుకునేందుకు వేరే వాళ్లకు అక్కడి అక్రమార్కులు అనుమతివ్వట్లేదు. తాము మాత్రమే రాత్రివేళల్లో రవాణా చేసుకుంటారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లిమర్ల, గుర్ల మండలాల సరిహద్దుల్లో ఈ ప్రాంతం ఉండటంతో పోలీసులు పట్టించుకోవడం లేదు. చివరికి విజిలెన్స్ అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూడటంలేదని స్థానికులు వాపోతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top