ఇసుక మస్కా!

ఇసుక మస్కా! - Sakshi

ఇసుక ధరల నిర్ణయంలో 

ఇసుక అక్రమాల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోందని గ్రహించిన సర్కారు.. ఆత్మరక్షణలో పడింది. ఉచిత ఇసుక ఇస్తున్నా.. రవాణా, కూలీల పేరుతో దోపిడీ జరుగుతుందని గుర్తించి కొత్త ధరలు నిర్ణయించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇటీవలే సమావేశమైన జిల్లా శాండ్‌ మైనింగ్‌ కమిటీ కొత్త ధరల్లోనూ తిరకాసుపెట్టింది. రవాణాచార్జీలను భారీగా పెంచింది. ఫలితంగా వినియోగదారునిపై భారం పడనుంది. అదే సమయంలో కూలీల రేట్లలో కోత విధించింది. ఈ ధరలూ లోపభూయిష్టంగా ఉన్నాయనే వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. 

 

 

కొవ్వూరు/ఏలూరు మెట్రో :

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన ఇన్నాళ్లూ అధికారపార్టీ నేతలే గోదావరిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగించినా పట్టించుకోని సర్కారు ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. అప్రతిష్టను తొలగించుకునేందుకు నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన జిల్లా శాండ్‌ మైనింగ్‌ కమిటీ ఇటీవలే  ఇసుక లోడింగ్, రవాణాల ధరలను నిర్ణయించింది. ఈ ధరల కంటే అధికంగా వసూలు చేసినా.. ఇసుకను నిల్వ చేసినా.. క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపాలని మండల అధికారులకు ఆదేశాలిచ్చింది. 

 

ఇప్పటివరకూ ఇలా.. 

ప్రభుత్వం ఇసుక ఉచితమంటూ ప్రకటించినా.. కొందరు ఇష్టానుసారంగా రీచ్‌ల్లో వ్యాపారం చేస్తున్నారు. అధికారపార్టీ నేతలే రూ.కోట్లు కొల్లగొట్టారు. నాయకులు వారి అనుచరులు ఇసుక రీచ్‌లను కబ్జా చేశారు. ట్రాక్టర్‌ లోడుకు రూ.500ల నుంచి 800ల వరకు చెల్లించాలంటూ అనధికార ధరలను నిర్ణయించారు. కొన్ని చోట్ల అక్రమ వసూళ్లకు దిగారు. నదీగర్భాలను ఇష్టారీతిన తవ్వేశారు.  గూటాల, పోలవరం, నర్సాపురం, కొవ్వూరు, కుకునూరు, నిడదవోలు, వాడపల్లి, తాళ్ళపూడి, విజయరాయి, పెదవేగి ఇసుక ర్యాంపుల్లో టీడీపీ నేతలు తవ్వకాలకు బరి తెగించారు. ఒకానొక దశలో వారి ఆగడాలకు అడ్డువెళ్లేందుకు అధికారులూ వెనుకడుగు వేశారు. . కనీసం ప్రభుత్వ పనులకూ ఇసుక లభించని దుస్థితి కూడా నెలకొందంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను పెంచింది. దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించిన సర్కారు అప్రమత్తమైంది.  

కొత్త ధరలివీ.. 

ప్రభుత్వ పథకాలకు వెయ్యి క్యూబిక్‌మీటర్ల ఇసుక అవసరమైనప్పుడు మండల స్థాయిలో ఉన్న కమిటీకి (తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్‌హెచ్‌ఓ) సంబంధిత శాఖ ఇంజినీరు దరఖాస్తు చేస్తే తేదీ, సమయం, ఎంత మేర తీసుకోవచ్చు, ఏ రీచ్‌కి వెళ్లాలి అనే వివరాలతో అనుమతి పత్రం ఇస్తారు. దీని ద్వారా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఇసుక తీసుకెళ్లవచ్చు. సామాన్యులైతే రీచ్‌కి రానుపోను  వాహనాల రవాణా చార్జీ మొదటి 5 కిలోమీటర్లు రూ. 400, తరువాత 10 కిలోమీటర్లు దాటిన ప్రతి ఒక కిలోమీటరుకు రూ.28 చెల్లించాలి. జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా సరే ట్రాక్టర్‌ లోడింగ్‌ చేసిన దానికి రూ.300ల చొప్పున చెల్లించాలి. రానుపోను 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రీచ్‌ నుంచి ఎవరైనా ఇసుక తీసుకువచ్చి ఇస్తే వినియోగదారుడు రూ.900లు చెల్లించాలి. దీనికి పడవ, కూలీల ఖర్చులు అదనం  అంతకుమించి నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదు.  జిల్లాలో పారిశ్రామికవేత్తలు, బడా బిల్డర్లు, ఎక్కువ మొత్తంలో ఇసుక అవసరమైతే నేరుగా జిల్లా గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో ఏ రీచ్‌లోనైనా ట్రాక్టర్‌తో తప్ప ఇతర పెద్ద వాహనాలతో రవాణా చేయడానికి వీల్లేదు. 

రీచ్‌లలో ఇలా.. 

పడవల ద్వారా ఇసుక సేకరించే ర్యాంపుల్లో  పడవలు, కూలీల నిమిత్తం యూనిట్‌కి రూ.800, పడవల ద్వారా నిడదవోలు వరకు  తరలిస్తే యూనిట్‌కు రూ.1,000, ఓపెన్‌ రీచ్‌ల్లో మనుషుల ద్వారా రూ.500 చొప్పున ధర నిర్ణయించారు. ర్యాంపుల్లో మాత్రం ఈ ధరలు ఎక్కడా అమలు కావడం లేదు.యూనిట్‌ ఇసుక రూ.1,200 నుంచి రూ.1,500 వరకు విక్రయాలు చేస్తున్నారు. దీంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు.

 

నిర్వాహకులు అఫిడవిట్‌ ఇవ్వాలి 

ధరలతోపాటు కొన్ని నిబంధనలూ విధించారు. ర్యాంపులో నిర్వాహకులు అఫిడవిట్‌ ఇవ్వాలని జిల్లా కమిటీ ఆదేశించింది. ఈ విషయాన్ని శుక్రవారం కొవ్వూరు ఆర్డీఓ అధికారులతో జరిగిన సమావేశంలో వెల్లడించారు. నిబంధలు కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. జిల్లా కమిటీ సూచన మేరకు స్ధానిక పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, కానిస్టేబుల్‌ పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేసి ర్యాంపులపై నిఘా ఉంచాలని చెప్పారు. రోజువారీగా ఎంత ఇసుక తవ్వుతున్నారు? ఎవరికి ఎంత విక్రయిస్తున్నారు? వారి ఆధార్‌ నంబర్లతో సహా నమోదు చేయాలని నిబంధన విధించినట్టు వెల్లడించారు. దీనిలోభాగంగా ఓ కమిటీ ఏర్పాటు చేసుకునే వరకూ  శుక్రవారం నుంచి మండలంలోని ర్యాంపులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు వెల్లడించారు.  

 

ఒక్కొక్కటిగా మూతపడిన ర్యాంపులు

నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని, అనుమతు లేవన్న కారణంతో ఇరవై రోజుల క్రితం వాడపల్లి ర్యాంపును మూసివే శారు. వారం క్రితం అధిక ధరలకు ఇసుక అమ్మకాలు చేస్తున్నారని ఔరంగాబాద్‌ ర్యాంపుని మూసివేశారు. వారం క్రితం తాడిపూడి ర్యాంపులో ఇసుక నిల్వ చేసే ప్రాంతంలో వరద నీరు చేరడంతో తవ్వకాలు తాత్కలికంగా నిలిచిపోయాయి. జిల్లాలో అధికారిక ర్యాంపులు పది ఉన్నాయి. వీటిలో తాడిపూడి, ప్రక్కిలంక, కొవ్వూరు, ఔరంగబాద్‌ ర్యాంపుల్లో మాత్రమే పడవల సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. తాడిపూడి, ఔరంగబాద్‌ ర్యాంపులు గతంలోనే మూతపడగా ప్రక్కిలంక కొవ్వూరు ర్యాంపుల్లో శుక్రవారం సాయంత్రం నుంచి తాత్క లికంగా మూతపడ్డాయి. ప్రస్తుతం గోదావరికి వరదలు రావడంతో ఇసుక తవ్వకాలకు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఇప్పుడు ఉన్న ర్యాంపులు మూసివేయడంతో ఇసుక కష్టాలు మళ్లీ మొదటివచ్చే అవకాశాలున్నాయి.

 

పడవల నిర్వాహకులు గగ్గోలు 

ప్రస్తుతం పడవల ద్వారా ఇసుక సేకరణకు కార్మికులకు యూనిట్‌కి  రూ.700, లోడింగ్‌ నిమిత్తం రూ.60 చెల్లిస్తున్నారు.ఇసుక సేకరణ æకు పడవకు ఆయిల్‌ ఖర్చు రూ.50 చొప్పున ఖర్చువుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. ఈలెక్కన రూ.810 అవుతుంటే రూ.800 ధర నిర్ణయిస్తే ఎలా గిట్టుబాటు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశిస్తున్నారు. లేదంటే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లు ఓపెన్‌ ర్యాంపుల్లో పొక్లెయినర్‌ల సాయంతో నదిలో రోడ్లు వేసి తవ్వకాలు సాగించిన పట్టించుకోని ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝళిపించడం విమర్శలకు తావిస్తోంది. అవసరమైతే కార్మికులకు ఇచ్చే వేతనంలో రూ.100 తగ్గించుకుంటే గిట్టుబాటు అవుతుందని ఆర్డీవో శ్రీనివాసరావు పడవల నిర్వహకులకు సూచించడం కోసమెరుపు.

 

రవాణా మోత 

వాస్తవం ఐదు యూనిట్ల ఇసుక కొవ్వూరు నుంచి ఏలూరుకు సరఫరా చేయడానికి కిరాయి రూ.8వేల నుంచి రూ.8,500 తీసుకుంటున్నారు. జిల్లా కమిటీ మాత్రం యూనిట్‌కి రూ.2,100 చొప్పున ధర నిర్ణయించింది. అంటే ఐదు యూనిట్‌లకు రూ.10,500 చెల్లించాల్సి వస్తుంది. కొవ్వూరు నుంచి జంగారెడ్డిగూడెం 54 కిలోమీటర్లు వస్తుంది. గరిష్టంగా కిరాయి రూ.5,500 నుంచి రూ.6వేలు లోపు కిరాయి తీసుకుంటున్నారు. అటువంటిది జిల్లా కమిటీ మాత్రం కిరాయి యూనిట్‌ ఇసుక రవాణాకు రూ.1,700 నిర్ణయించారు.అంటే ఐదు యూనిట్లకు రూ.8,500 అవుతుంది. అంటే లబ్ధిదారుడిపై సుమారు రూ.2వేలు కిరాయి భారం పడుతుంది. సుమారు 80 కిలోమీటర్లు దూరంలో ఉన్న భీమవరానికి ఇదే కిరాయి నిర్ణయించారు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తణుకు, తాడేపల్లిగూడెం, 40 కిలోమీటర్లు దూరంలో ఉన్న నల్లజర్లకు యూనిట్‌ రవాణాకు రూ.1,000 చొప్పున నిర్ణయించారు. అంటే మూడు చోట్ల ఎక్కడికి వెళ్లినా అదే కిరాయి చెల్లించాల్సి ఉంటుంది. ఐదుయూనిట్లకు రూ.5 వేలు కిరాయి నిర్ణయిస్తే లారీ కిరాయి మాత్రం రూ.3,500 నుంచి రూ.4వేలు తీసుకుంటున్నారు. రెండు యూనిట్‌ల లారీలకు గతంలో ప్రభుత్వం నిర్ణయించిన కిరాయి కిలోమీటరుకు రూ.65లు, ఐదు యూనిట్ల లారీకి రూ.120 చొప్పున నిర్ణయించింది.ఈలెక్కన చూసినా జిల్లా కమిటీ నిర్ణయించిన ప్రస్తుతం మార్కెట్‌లో తీసుకుంటున్న కిరాయిల కంటే అ«ధికంగానే ఉంది. కిరాయిలు బాదుడు అధికారికం కానుండడంతో ఇసుక ధర లబ్ధిదారులకు మరింత భారంగా మారే అవకాశం ఉంది. 

 

 

 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top