ఇసుక దందా.. కనిపించదా!

ఇసుక దందా.. కనిపించదా! - Sakshi


తాండవ గర్భంలో  జేసీబీలతో తవ్వకాలు

విలువ రూ.6 కోట్లకు పైమాటే

జలాశయానికి పొంచి ఉన్న ముప్పు

పట్టించుకోని అధికారులు




గొలుగొండ(నర్సీపట్నం): తాండవ జలాశయం జిల్లాలో పెద్దది..ఈ జలాశయం ద్వారా రెండు జిల్లాలకు సుమారుగా 55 వేల ఎకరాలకు పుష్కలంగా సాగునీరు అందుతోంది.  అలాంటి జలాశయానికి ప్రస్తుతం ప్రమాదం పొంచి ఉంది. గతంలో నీలం తుపాను వల్ల  బొడ్డేరు గెడ్డ ప్రవాహా నికి జలాశయానికి కిలోమీటరు దూరంలో సుమారు 50 ఎకరాలకు పైగా ఇసుక మేటలు పేరుకుపోయాయి. ఇసుక మేటలు తరలించేం దుకు గతంలో అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇది ఇసుక అక్రమ వ్యాపారులకు కలిసొచ్చింది. యథేచ్ఛగా ఇసుకను తరలించుకుపోతున్నారు.  ప్రభుత్వ ఆదా యానికి కోట్లాది రూపాయల గండి పడుతోం ది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం గమనార్హం.



గత ఏడాది అంచనా

నీలం తుపాను సందర్భంగా జలాశయాం  గర్భంలోకి చేరిన ఇసుక మేటలు తొలగించేందుకు అధికారులు  అంచనా వేశారు.  కాంట్రాక్టర్లు  గాదపాలెం నుంచి నర్సీపట్నం, విశాఖపట్నం తరలించేందుకు ప్రయత్నించారు. కానీ వేలం నిర్వహించే సమయంలో ఏకధాటిగా వర్షాలు కురిసాయి. ఫలితంగా వేలంపాట నిలిచిపోయింది. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్న ఇసుక తరలింపుపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది ఇసుక తరలింపు నిలిచిపోయింది.



యథేచ్ఛగా తరలింపు

గతంలో నిలిచిన టెండర్ల ప్రక్రియ అక్రమార్కులకు వరంగా మారింది. దీన్ని అదునుగా చేసుకున్నారు. ప్రస్తుతం జలాశయం గర్భంలో నీరు లేకపోవడంతో ఇసుక తరలింపు జోరుగా సాగుతోంది. చోద్యం, గాదంపాలెం, ఎ.ఎల్‌.పురం, కేడిపేట, జోగుంపేట, నర్సీపట్నం, కొత్తమల్లంపేట, చిన్నయ్యపాలెంకు చెందిన వందలాది ట్రాక్టర్లతో రోజూ ఇసుకను తరలిస్తున్నారు. కూలీల ద్వారా అయితే పనులు ఆలస్యంగా జరుగుతాయనే ఉద్దేశంతో జేసీబీతో నాలుగురోజులుగా పగలు, రాత్రిళ్లు ఇసుక తవ్వకాలు జోరుగా సాగిస్తున్నారు. ఇంత జరగుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.



కొరవడిన పర్యవేక్షణ

జలాశయం గర్భం నుంచి రోజూ వందలాది ట్రాక్టర్ల నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్క ఇసుక ట్రాక్టర్‌ను కూడా అధికారులు పట్టుకున్న  దాఖలాలు లేవంటున్నారు. ఇసుక అక్రమ తరలింపు చేస్తున్న వ్యాపారులతో అధికారులకు కుమ్మక్కై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాండవ జలాశయానికి ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇసుక తరలింపు అడ్డుకోవడంలో అధికారులు విఫలం చెందారని వైఎస్సార్‌సీసీకి చెందని చోద్యం ఎంపీటీసీ సభ్యుడు నాతిరెడ్డి అప్పలనాయుడు ఆరోపించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే కలెక్టర్‌కు ఫిర్యాదులు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇసుక తరలింపు సమయంలో గాదంపాలెంకు చెందని ఓ వ్యక్తి ట్రాక్టర్‌ నుంచి వంద రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నాడని, ఇలా రోజుకు రూ.50వేల వరకు ఆదాయం పొందుతు న్నాడని స్థానికులు చెబుతున్నారు.



జలాశయానికి ముప్పే

ఇసుక నిల్వలు లేకపోతే వరదలు వస్తే బొడ్డేరు గెడ్డ నీటి ఉధృతికి కిలోమీటరు దూరంలో ఉన్న తాండవ జలాశయానికి ప్రమాదం పొంచి ఉందని మేధావులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేలాది ఎకరాలకు సాగునీరందించే జలాశయానికి ఊహించని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మేటలు ఉండడంతో నీటి ఉధృతిని అడ్డుకుంటాయని, ఫలితంగా రిజర్వాయర్‌కు నష్టం జరగదంటున్నారు. దీంతో పాటు ఇసుక తవ్వకాల వల్ల సమీప గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతాయని చెబుతున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top