వ్యాపారులకు ‘పన్ను’పోటు!


–  29 శాతం అదనపు వసూళ్లకు ప్రణాళికలు


– ప్రతీ నెలా లక్ష్యాలు నిర్ణయం


వ్యాపారులపై భారీగా భారం వేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం మేరకు ‘పన్ను’ పోటు పొడిచేందుకు ప్రణాళిక రచించింది. వాణిజ్య, వ్యాపారస్తుల నుంచి వివిధ చట్టాల కింద పన్నులు వసూలు చేసి ఖజానా నింపుకునేలా పావులు కదుపుతోంది.  

 

శ్రీకాకుళం: వ్యాపారస్తులకు పన్ను భయం వెంటాడుతోంది. గత ఏడాదిలో వసూలు చేసిన పన్నులపై 14 నుంచి 29 శాతం వరకు అదనంగా భారం వేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. విజయవాడలో ఇటీవల రెండు రోజులపాటు జరిగిన సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ శ్యామలరావు అన్ని జిల్లాలకు లక్ష్యాలను ఖరారు చేసినట్లు తెలిసింది. ఆ మేరకు స్థానిక అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళ్తున్నారు. దీంతో జిల్లా వ్యాపారులపై కోట్ల రూపాయల భారం పడనుంది. గత ఏడాది రూ. 125 కోట్లు వరకు వసూలు చేయగా ఈసారి మరో 29 శాతం పన్నులు అదనంగా వసూలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లక్ష్యాలను ఏ నెలకు ఆ నెల నిర్దేశిస్తున్నారు. గత ఏడాది ఆయా నెలల్లో సాధించిన లక్ష్యంపై అదనపు శాతాన్ని కలిపి తాజా లక్ష్యంగా నిర్దేశిస్తున్నారు.

 

 ఎవరి నుంచి పన్నులు వసూలు చేస్తారంటే..

జిల్లా ప్రజలను కరువు పీడిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భారీగా పన్నులు వసూలు చేసేందుకు సిద్ధమైంది. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఏడు రకాల ట్యాక్స్‌లు వసూలు చేస్తోంది. ఏపీ వ్యాట్, సీఎటీ , ఏపీ జీఎస్‌టీ కింద విలువ ఆధారిత పన్నుల కాగా వినోదపు పన్ను, విలాసపు పన్ను, వృత్తిపరమైన పన్ను, ప్రవేశ పన్ను, టర్నోవర్‌ పన్ను వసూలు చేస్తోంది. ముఖ్యంగా వ్యాపార సంస్థలతోపాటు సిమెంట్‌ పరిశ్రమలు, మోటారు వాహన, వంట నూనె (ఆయిల్స్‌), ఫ్యాక్టరీలు, డీలర్లు, ట్రేడర్స్, వివిధ దుకాణాల నుంచి వారి లావాదేవీలపై 14.5 శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు. అంతర్‌ రాష్ట్రాలకు చెందిన వాహనాలు, సరుకులపైన ప్రవేశపన్ను వేస్తున్నారు. తయారీ, ఆయిల్స్‌ కొనుగోళ్ల ద్వారా కూడా ట్యాక్స్‌ వేస్తున్నారు. ఇలా అన్ని మార్గాల నుంచి పన్నును రాబడుతున్నారు.

 

జిల్లాలో పరిస్థితి ఇలా..

 శ్రీకాకుళం జిల్లాలో నాలుగు వాణిజ్య శాఖ డివిజన్లు ఉన్నాయి. శ్రీకాకుళం, రాజాం, కాశీబుగ్గ కేంద్రాలుగా ఇవి పనిచేస్తున్నాయి. గతేడాది శ్రీకాకుళం డివిజన్‌లో రూ. 53.38 కోట్లు, రాజాంలో రూ. 24.64 కోట్లు, కాశీబుగ్గలో రూ. 30 కోట్లు, నరన్నపేటలో 19.60 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేశారు.ఈ ఏడాది వీటికి అదనంగా 29 శాతం వరకు వసూలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం వాణిజ్యపన్నుల శాఖ అధికారులు పెరిగిన లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. వీటికి అనుగుణంగా వ్యాపారులు ప్రజలపై భారాన్ని మోపుతున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top