సాక్షి భవిత ఆవిష్కరణ

సాక్షి భవిత ఆవిష్కరణ - Sakshi


కరీంనగర్: విద్యార్థులకు, ఉద్యోగార్థులకు ఉపయోగపడేలా సాక్షి దినపత్రికలో నిత్యం భవిత పేజీలు ప్రారంభించటం అభినందనీయమని విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. బుధవారం కరీంనగర్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన భవిత ప్రారంభ సంచికను ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా చుక్కా రామయ్య  మాట్లాడుతూ 'విద్యలో డిజిటల్ విప్లవం వచ్చింది.  దేశం భవిష్యత్తు యువత చేతిలో ఉంది. యువత, విద్యార్థుల సమస్యలను ఏ పత్రికలు ఉపేక్షిస్తాయో ఆ పత్రికలు  ఎక్కువ కాలం నిలుస్తాయి. సాక్షి యాజమాన్యం చేసేది దీక్ష లాంటిది. ప్రతిరోజు కొత్త ఐడియాను సాక్షి ఆవిష్కరిస్తుంది. ప్రజలను భవిత వైపు మరల్చడానికి సాక్షి చేస్తున్న కృషి అభినందనీయం. ఒక ప్రశ్నకు ఒక సమాధానం అనే కాలం పోయింది నేడు ఏడు సమాధానాల కాలం వచ్చింది. మారిన పరిస్థితులకు అనుకూలంగా విద్యారంగంలో మార్పు చేయకుంటే విద్యార్థులు వెనకబడతారు. సమస్యలకు హైదరాబాద్ లో పరిష్కారాలు దొరకవు పల్లెటూరులో దొరుకుతాయి. పత్రికలు వర్తమానం వార్తలే కాదు రేపటి వార్తలకు భూమికను పోషించాలి. సాక్షి భవితను చదువుతూ భవిష్యత్తును చక్కదిద్దుకోవాలి' అన్నారు.


సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ ఈశ్వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు మేలు చేయడానికే భవితను ప్రతిరోజు తీసుకు వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటర్ వి.మురళి, కరీంనగర్ ఎస్పీ జోయెల్ డేవిస్ తదితరులు ఉన్నారు. అదే విధంగా గుంటూరు లో జరిగిన కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి భవిత సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  రెసిడెంట్ ఎడిటర్ ఆర్.ధనుంజయ్ రెడ్డి, విజ్ఞాన్ రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక నుంచి సాక్షి భవిత మెయిన్ ఎడిషన్ లో రెండు పేజీల్లో  వెలువడనుంది.





Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top