నకిలీ డాక్యుమెంట్లతో బిల్డర్లకు టోకరా


హైదరాబాద్‌: ఇళ్ల ప్లాట్ల డెవలప్‌మెంట్‌ అంటూ నకిలీ డాక్యుమెంట్లు చూపించి లక్షలాది రూపాయలు దండుకున్న ఆసిఫాబాద్‌ కొమరం భీం జిల్లా రూరల్‌ వాటర్‌ సప్లయ్‌(ఆర్‌డబ్ల్యూఎస్‌) శానిటేషన్‌ ఇంజనీర్‌ బండారు లక్ష్మణ్‌రావును చీటింగ్‌ కేసు కింద పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలివీ.. ఆసిఫాబాద్‌ కొమరం భీం జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్న బండారు లక్ష్మణ్‌రావు అలియాస్‌ నర్సింహారెడ్డి(54)ది కృష్ణా జిల్లా నూజివీడు. ప్రస్తుతం ఈయన ఖమ్మం మమత ఆస్పత్రి రోడ్డులో ఉన్న దేవీ రెసిడెన్సిలో నివాసం ఉంటున్నాడు. ఈయన హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఖాళీ ఫ్లాట్ల వివరాలు తెలుసుకొని నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి ఉంచుకున్నాడు.



తన చెల్లెలు అమెరికాలో ఉంటుందని వీటిని డెవలప్‌మెంట్‌కు ఇస్తున్నామంటూ తన బావమరిది వి.రామకృష్ణతో కలిసి బిల్డర్లను ఆకర్షించాడు. వారాసిగూడ బౌద్దనగర్‌కు చెందిన పి. మహేష్‌నారాయణ, బాగ్‌ అంబర్‌పేట్‌ జీడీ కాలనీకి చెందిన ఎంఆర్‌.రెడ్డి అనే వారు వలలో పడ్డారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ -10లోని ప్లాట్‌ నంబర్‌ 134, జర్నలిస్టు కాలనీలోని ప్లాట్‌నంబర్‌ 74, నవనిర్మాణ్‌నగర్‌లోని ప్లాట్‌ నంబర్‌ 73, జర్నలిస్టు కాలనీలోనే ఉన్న ప్లాట్‌ నంబర్‌ 68లను చూపించి వీటి డెవలప్‌మెంట్‌కు ఇస్తానంటూ బురిడీ కొట్టించాడు. అమెరికాలో తన చెల్లెలితో మాట్లాడాలంటూ ఫోన్‌ కలిపి తన భార్య నాగమణితో మాట్లాడించేవాడు.



ఇలా ఎంఆర్‌.రెడ్డి దగ్గర రూ.40 లక్షలు, మహేష్‌ నారాయణ నుంచి రూ.20 లక్షలు, మరో ఇద్దరు బిల్డర్ల నుంచి రూ. 50 లక్షలు వసూలు చేశాడు. ఈ ప్లాట్ల గురించి ఆరా తీయగా నకిలీ డాక్యుమెంట్లతో తమను మోసం చేశాడని తెలుసుకున్న బాధితులు జూబ్లీహిల్స్‌పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన పోలీసులు లక్ష్మణ్‌రావుతో పాటు నాగమణి అలియాస్‌ ఊర్మిల, బావమరిది వి. రామకృష్ణ, చెల్లెలు శ్యామల, కూతురు లక్ష్మి సరోజిని అలియాస్‌ రోజ తదితరులపై సెక్షన్‌ 420, 406, 468, 471ల కింద కేసు నమోదు చేశారు. లక్ష్మణ్‌రావును రిమాండ్‌కు తరలించారు. నిందితుడు లక్ష్మణ్‌రావుపై అంబర్‌పేట, సరూర్‌నగర్, పేట్‌బషీరాబాద్, ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్లలో కూడా చీటింగ్‌ కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top