రూటు మారింది!

రూటు మారింది!

  • జేగురుపాడువద్ద భారీగా పట్టుబడిన గంజాయి విలువ రూ.2 కోట్లు

  • ఐదు వాహనాలు సీజ్‌

  • పోలీసుల అదుపులో సూత్రధారి సహా నలుగురు వ్యక్తులు

  • ఇప్పటివరకూ ఏజెన్సీ నుంచి తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, రాజానగరం, గోకవరం తదితర మండలాల మీదుగా గంజాయి రవాణా జరిగేది. ఇక్కడ పదేపదే దాడులు జరుగుతూండడమో.. మరే కారణమో కానీ.. గంజాయి స్మగ్లర్లు రూటు మార్చినట్టున్నారు. గుట్టు చప్పుడు కాకుండా గుట్టుగా గంజాయిని అనపర్తి ప్రాంతానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి రవాణా చేస్తున్నారు. ఆదివారం జేగురుపాడువద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుబడిన వైనాన్ని చూస్తే.. ఈ విషయం నిజమనిపించకమానదు.

     

    కడియం :

    మండలంలోని జేగురుపాడు ఆడదాని రేవు వద్ద ఆదివారం ఉదయం భారీగా గంజాయి పట్టుబడింది. ముందుగా అందిన సమాచారం మేరకు పోలీసులు ఈ సరుకును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నందున పూర్తి వివరాలు చెప్పేందుకు వారు నిరాకరిస్తున్నారు.

    విశ్వసనీయ సమాచారం మేరకు అనపర్తి సమీపంలోని ఒక రైసుమిల్లు గోడౌన్‌ నుంచి ఒక లారీ, మరో ఐషర్‌ వ్యాన్‌లో గంజాయిని తరలిస్తున్నారు. వీటికి మరో ఖాళీ ఐషర్‌ వ్యాన్, రెండు కార్లు ఎస్కార్టుగా అనుసరించాయని చెబుతున్నారు. అనపర్తిలోని తవుడు గోడౌన్‌లో నిల్వ ఉంచిన గంజాయిని ఒక్కొక్కటి 24 కేజీల చొప్పున కట్టిన 162 బస్తాల్లో ప్యాకింగ్‌ చేశారు. వీటిని లారీలో తవుడు బస్తాల మధ్య, వ్యాన్‌లో పుచ్చకాయల లోడు మధ్య ఉంచి గుంటూరుకు తరలిస్తున్నారు. అప్పటికే మాటు వేసిన పోలీసులు ఈ వాహనాలను తనిఖీ చేయడంతో గుట్టు రట్టయింది. పట్టుబడిన గంజాయి విలువ రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. రవాణాకు ఉపయోగించిన ఐదు వాహనాలను స్వాధీనం చేసుకుని, మొత్తం నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అనపర్తికి చెందిన ప్రధాన సూత్రధారి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

    గంజాయి రవాణాలో సూత్రధారిగా భావిస్తున్న వ్యక్తి కొంతకాలంగా ఇదే వ్యాపారం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల కారణంగా గతంలో మహారాష్ట్ర పోలీసు అధికారులు సైతం ఇతడిపై దర్యాప్తు చేపట్టేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే అప్పట్లో అతడు ఇంట్లో కుక్కలను విడిచిపెట్టి, వెనుకవైపు నుంచి పరారైనట్లు చెబుతున్నారు. అతడు ఇటీవలే అనపర్తి సమీపంలోని పొలమూరులో బంధువులకు చెందిన రైస్‌మిల్లును లీజుకు నడుపుతున్నట్టు కూడా అంటున్నారు.

    స్వాధీనం చేసుకున్న గంజాయి ప్యాకెట్లను రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌ జిలిఆ్ల దక్షిణ మండలం డీఎస్పీ పి.నారాయణరావు పరిశీలించారు. అనంతరం ఆయన నేతృత్వంలో ప్రత్యేక బృందాలు అనపర్తిలో పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్టు తెలిసింది. 

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top