చార్జీల మోత

చార్జీల మోత - Sakshi


జిల్లా ప్రజలపై నెలవారీ భారం 3.25 కోట్లు!

‘పల్లె వెలుగు’లో 30 కి.మీ.లకు రూ.1 పెంపు

డీలక్స్, ఏసీ బస్సుల్లో 10 శాతం పెరుగుదల

బస్సు పాసులపైనా పడనున్న ప్రభావం


జిల్లాలో పట్టణ ప్రాంత డిపోలు 11. వీటి పరిధిలో 1,250పైగా సర్వీసులున్నాయి. ప్రస్తుతం ఈ డిపోల నుంచి రోజువారీ ఆదాయం సగటున రూ.2.5 లక్షలు.


గ్రామీణ ప్రాంతంలో ఆరు డిపోలున్నాయి. ఈ డిపోలకు అనుసంధానంగా 750 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వీటి పరిధిలో రోజువారీ ఆదాయం రూ.75లక్షలు.


మొత్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రయాణికులపై నెలకు రూ.3.25 కోట్ల భారం పడనుంది. అదేవిధంగా చార్జీల పెంపు ఆధారంగా నెలవారీ బస్‌పాసుల రుసుము సైతం పెరగనుంది.


ప్రగతి రథంలో ప్రయాణం మరింత భారంకానుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చార్జీల మోత మోగించింది. నష్టాలను సాకుగా చూపుతూ సగటు ప్రయాణికుడిపై  ఆర్థిక భారాన్ని మోపింది. దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ఆర్టీసీ ప్రయాణ చార్జీలు పెంచింది. పెరిగిన బస్ చార్జీలు ఈనెల 27నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. డీలక్స్, ఏసీ బస్సు చార్జీలపై పది శాతం, పల్లెవెలుగు బస్సుల్లో ప్రతి 30 కి.మీ.కు రూ.1 చార్జీ పెరుగుతుందన్నారు. సిటీ బస్సుల్లో మాత్రం స్టేజీల వారీగా చార్జీలు పెరుగుతాయి. ప్రతి టిక్కెట్ల్లపైనా ధరలను హెచ్చించడంతో ఈ ప్రభావం అన్నివర్గాలపైనా పడనుంది.  - సాక్షి, రంగారెడ్డి జిల్లా


సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఆరు గ్రామీణ బస్ డిపోలున్నాయి. తాండూరు, వికారాబాద్, పరిగి, హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, పికెట్ డిపోల పరిధిలో 750 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. రైల్వే లైన్లు అన్ని  ప్రాంతాలకు లేకపోవడం.. సమయానుకూలంగా రైళ్లు లేనందున బస్సు ప్రయాణాన్నే నమ్ముకునే వారు ఎక్కువ. కేవలం హైదరాబాద్ నగరంవైపు కాకుండా అటు పూణే, ముంబై ప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం గ్రామీణ డిపోల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఆరు డిపోల పరిధిలో రోజువారీ ఆదాయం రూ.75లక్షలకు పైమాటే. తాజాగా చార్జీలను పది శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు సగటున రూ.2.25 కోట్ల భారం(కేవలం రూరల్ పరిధిలో) ప్రయాణికులపై పడనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటివరకు సమాచారం అందలేదు. దీంతో పెంపుపై ఆర్టీసీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.


 పట్టణ డిపోల్లో ‘ప్రత్యేకం’

గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఆరు గ్రామీణ డిపోలు మినహాయిస్తే మిగతా 11 డిపోలు పట్టణ ప్రాంతానికి చెందినవే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్‌నగర్ 1, హయత్‌నగర్ 2, ఉప్పల్, చెంగిచెర్ల, మేడ్చల్, హకీంపేట్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్ డిపోల పరిధిలో 1,250పైగా సర్వీసులున్నాయి. వీటిద్వారా నిత్యం రెండు లక్షల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఈ డిపోల్లో రోజువారీ ఆదాయం సగటున రూ.2.5 లక్షలు. ప్రభుత్వం ప్రకటించిన చార్జీలకు భిన్నంగా సిటీబస్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. స్టేజీల సంఖ్యను బట్టి వీటి చార్జీలు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా శుక్రవారం సాయంత్రానికి సిటీ బస్సు చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. మొత్తంగా సిటీ డిపోల పరిధిలో నెలవారీగా ప్రయాణికులపై రూ.కోటి వరకు భారం పడనుంది. మొత్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రయాణికులపై నెలకు రూ.3.25 కోట్ల భారం పడనుంది. అదేవిధంగా చార్జీల పెంపు ఆధారంగా నెలవారీ బస్‌పాసుల రుసుము సైతం పెరగనుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top