ఆర్టీసీలో సీసీఎస్‌ ఎన్నికల హోరు!


రాజంపేట: రాజంపేట ఆర్టీసీ డిపోలో సీసీఎస్‌(ఆర్టీసీ ఉద్యోగులపరపతి సహకార సంఘం) ఎన్నికల హోరు శుక్రవారం నుంచి ఆరంభమైంది. తొలిరోజు నాలుగు నామినేషన్లు దాఖలు అయ్యాయి.  2 నుంచి8 లోపు నామినేషన్లను స్వీకరించనున్నారు. 13న నామినేషన్ల  ఉపసంహరణ  చేపట్టనున్నారు. ఆర్టీసీలో ఎన్నికల హడావిడి మొదలైంది. డిసెంబరు 16న పోలింగ్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. రాజంపేట డిపో పరిధిలో 481 మంది కార్మికులు, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. ఈ డిపో పరిధిలో ఇద్దరు సీసీఎస్‌ డెలిగేట్లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ఎన్నికల్లో యూనియన్ల గుర్తులు ఉండవు. కేవలం అభ్యర్థుల పేర్లు మాత్రమే బ్యాలెట్‌ ఉంటుంది.

ఒంటరిగానే ఎన్‌ఎంయూ

డిపోలో రెండు డెలిగేట్‌ స్థానాలకు ఎన్‌ఎంయు ఒంటరిగానే బరిలోకి దిగింది. ఎన్‌ఎంయు తరపున శివయ్య, విశ్వనాధరెడ్డిలను బరిలోకి దించింది. ఈ మేరకు ఆర్టీసీ బస్టాండుపై అంతస్తులో ఎన్‌ఎంయు సమావేశం నిర్వహించింది. సమావేశానికి స్టేట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ పీవీశివారెడ్డి హాజరై మాట్లాడుతూ ఎన్‌ఎంయూ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు చేసిన మేలును గుర్తుచేశారు. ప్రతిపక్ష కార్మిక సంఘాల వైఫల్యాలను ఎత్తిచూపారు. ఎన్నికలలో గెలిస్తే కార్మికులకు ఏ విధంగా మేలు చేస్తామో వివరిస్తూ హామీలు గుప్పించారు. సమావేశంలో రీజనల్‌ కార్యదర్శి పీ.సుధాకర్, డిపోప్రెసిడెంట్‌ ఎన్‌ఎస్‌ శంకర్, డిపో కార్యదర్శి ఎం.వీఎస్‌రెడ్డి, వైఎస్‌ప్రెసిడెంట్‌ కె.శివయ్య, డిపో కన్వీనరు టీ.రంగనాథంలు పాల్గొన్నారు. అనంతరం డిపో మేనేజరు ఎంవీకృష్ణారెడ్డి వద్దకు వెళ్లి తమ అభ్యర్థులతో నామినేషన్లను దాఖాలు చేయించారు.

ఈయూ, వైఎస్సార్‌ఎంయూ మధ్య కుదిరిన  పొత్తు..

డిపోకు కేటాయించబడిన రెండు సీసీఎస్‌ డెలిగేట్లకు  ఈయూ, వైఎస్సార్‌ఆర్టీసీ ఎంయూల మధ్య పొత్తు కుదిరింది. ఈ మేరకు శుక్రవారం ఆర్టీసీ బస్టాండులో ఈయూ, వైఎస్సార్‌ఎంయూలు నేతల సమన్వయ కమిటీ సమావేశమైంది. సమావేశంలో   ఈయూ నుంచి నారాయణ పేరు తెరపైకి తీసుకొచ్చారు. వైఎస్సార్‌ఎంయూ తరపున ఇంకా పరిశీలిస్తున్నారు. సమన్వయ కమిటీ సమావేశంలో ఈయూ తరపున చల్లా వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌ఎంయూ తరపున సుబ్బారెడ్డిలు పాల్గొన్నారు. కలిసికట్టుగా డిపోలో రెండు స్థానాలను కైవసం చేసుకుంటామని వారు ధీమాను వ్యక్తంచేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top