ఆర్టీసీ బస్సులో ఉన్మాది ఘాతుకం

ఆర్టీసీ బస్సులో ఉన్మాది ఘాతుకం - Sakshi

ఐదుగురు ప్రయాణికులకు గాయాలు

దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగింత

కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తోన్న ఐదుగురిపై ఒక ఉన్మాది ఇనుప ఉలితో దాడికి యత్నించడంతో బస్సులోని వారు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులు, త్రీటౌన్‌ పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడకు చెందిన ఓలేటి సుబ్రహ్మణ్యం, రాణి, చేబ్రోలుకు చెందిన దొండపాటి అర్జునరావు, విశాఖ జిల్లా కేడీపేటకు చెందిన పొలమూరు మోహన్‌రావు, పెనుగుదురుకు చెందిన సోమశేఖర్‌ వ్యక్తిగత పనులపై ఏలేశ్వరం వెళ్లారు. తిరిగి బుధవారం సాయంత్రం కాకినాడ వచ్చేందుకు ఏలేశ్వరంలో ఆర్టీసీ బస్సు ఎక్కారు. 

బస్సుల్లోంచి అర్తనాదాలు

రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రి దాటి అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం సమీపానున్న పెట్రోలు బంకు వద్దకొచ్చేసరికి బస్సులోంచి ఆర్తనాదాలు వినిపించాయి. బస్సును ఆపిన డ్రైవర్‌ ఏమైందో తెలుసుకునేలోగా ఓ ఉన్మాది విచక్షణా రహితంగా బస్సులో వెనకాల కూర్చున్న ఐదుగురిపై ఇనుప ఉలితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన వారిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచాడు. మిగిలిన ప్రయాణికులు, స్థానికులునా ఉన్మాదిని పట్టుకుని దేహశుద్ధి చేసి త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించారు. గాయపడిన బాధితులను స్థానికులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. 

తమతోపాటు బస్సు ఎక్కాడు..

తమతో పాటు ఉన్మాది ఏలేశ్వరంలో బస్సు ఎక్కాడని, వెనుక కూర్చున అతడు తనలో ఏదో మాట్లాడుకుంటూ కనిపించాడని బాధితులు తెలిపారు. స్థానిక పాత బస్టాండ్‌ వద్ద బస్టాండ్‌కు వెళ్లేందుకు బస్సు ఎక్కానని, బస్సెక్కిన ఐదు నిమిషాల్లోనే ఉన్మాది చేతిలో దాడికి గురయ్యానని చేబ్రోలుకు చెందిన దొండపాటి అర్జునరావు ఆందోళన వ్యక్తం చేశాడు. ఉన్మాదిని ప్రశ్నిస్తున్నామని త్రీటౌన్‌ సీఐ దుర్గారావు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top