కాళేశ్వరానికి రూ.75,667 కోట్లు

కాళేశ్వరానికి రూ.75,667 కోట్లు - Sakshi


ప్రాణహిత-చేవెళ్ల రీడిజైన్ నేపథ్యంలో పెరిగిన వ్యయం

రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, కొత్త రిజర్వాయర్ల ఏర్పాటు

ఒక్క కాళేశ్వరానికి రూ.71,436 కోట్లు.. ప్రాణహితకు రూ.4,231 కోట్లు

ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఖర్చు రూ.9 వేల కోట్లు.. చేయాల్సిన వ్యయం 67 వేల కోట్లు

ఏటా రూ. 8 వేల కోట్లు కేటాయించినా ప్రాజెక్టు పూర్తయ్యేందుకు తొమ్మిదేళ్లు

మేడిగడ్డ-ఎల్లంపల్లి కొత్త అలైన్‌మెంట్‌కే రూ. 12 వేల కోట్లు

సిద్దిపేటలోని తడ్కపల్లికి రూ.5,700 కోట్లు, గజ్వేల్‌లోని పాములపర్తికి రూ.3,060 కోట్లు

ఆరో ప్యాకేజీ నుంచి మారుతున్న అంచనాలు


 

సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కాళేశ్వరం’ ఎత్తిపోతల పథకానికి రూ.76 వేల కోట్లు ఖర్చు కానున్నది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నుంచి మరింత మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు రీడిజైనింగ్ చేపట్టడంతో అంచనా వ్యయం భారీగా పెరిగింది. ఇందులో భాగంగా ప్రతిపాదిత రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు, పలు కొత్త రిజర్వాయర్ల నిర్మాణం.. వీటికి అనుగుణంగా కాల్వల సామర్థ్యం పెంపు, మరిన్ని పంపుల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు. భారీ వ్యయం కానున్న నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోదీని కలసిన సీఎం  కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కేంద్రం నుంచి తగినంత ఆర్థిక సహాయం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తయి లక్ష్యం మేరకు 16 లక్షల ఎకరాలకు సాగునీరు పారాలంటే ఏటా బడ్జెట్‌లో భారీగా నిధులు ఇవ్వాల్సి ఉండనుంది. ఏటా రూ.8వేల కోట్ల వరకు కేటాయించినా తొమ్మిదేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది.

 

 ఏడు జిల్లాలకు వరం

 ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మించడం ద్వారా 160 టీఎంసీల నీటిని మళ్లించి.. ఏడు జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాలకు సాగునీటి అందించేందుకు ‘ప్రాణహిత-చేవెళ్ల’ ప్రాజెక్టును 2007లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై వ్యాప్కోస్ సంస్థ సర్వే చేసి 2007లో నివేదిక అందించగా... 2008లో ప్రభుత్వం రూ.38,500 కోట్లతో పరిపాలనా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు రూ.9 వేల కోట్ల విలువైన పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టుకు నీటి లభ్యతపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రీడిజైనింగ్‌కు పూనుకుంది.

 

 రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు..

 ప్రాణహిత వాస్తవ డీపీఆర్ మేరకు తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్లకు నీటి మళ్లించే క్రమంలో మొత్తంగా 10 రిజర్వాయర్లను 16 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని నిర్ణయించారు. కానీ నిర్ణీత మళ్లింపు నీటిని నిల్వ చేసేందుకు ఇవేమాత్రం సరిపోవనే ఉద్దేశంతో తాజాగా సిద్ధిపేట నియోజకవర్గంలోని మల్లన్నసాగర్ (తడ్కపల్లి) రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ (పాములపర్తి)ని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు, నల్లగొండ జిల్లాలోని బస్వాపూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 11 టీఎంసీలకు పెంచారు. ఇక కొత్తగా గంధమల్లలో 10 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించారు. పాములపర్తి నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దివాగు ద్వారా నిజాంసాగర్‌కు నీటిని మళ్లించే క్రమంలో... కామారెడ్డి నియోజకవర్గంలో 4, ఎల్లారెడ్డిలో 3 రిజర్వాయర్లను కొత్తగా ప్రతిపాదించారు. కొత్తగా మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య బ్యారేజీలతో కలిపి మొత్తంగా నీటి నిల్వలను 139 టీఎంసీలకు పెంచేలా ప్రణాళిక రూపొందించారు. రిజర్వాయర్ల సామర్థ్యం పెరిగిన నేపథ్యంలో భూసేకరణ, పునరవాస పరిహారం, అదనపు పంప్‌హౌజ్‌ల నిర్మాణం, ఇతర వ్యయాలు భారీగా పెరిగాయి.

 

 ప్యాకేజీల్లో మార్పులు

 ప్యాకేజీ-1 నుంచి 5 వరకు తుమ్మిడిహెట్టి బ్యారేజీ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా... ప్రస్తుతం మరో లక్ష ఎకరాలకు అదనంగా నీరివ్వాలని నిర్ణయించారు. దీని భారం రూ.4,231కోట్లుగా ఉంటుందని తేల్చారు. ఎల్లంపల్లి దిగువన ఉన్న 6వ ప్యాకేజీ నుంచి 28వ ప్యాకేజీ వరకు అన్ని ప్యాకేజీల అంచనాలు గణనీయంగా పెరిగాయి. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకున్న 6, 7, 8 ప్యాకేజీలకు మొత్తంగా 9,249 కోట్లు... 10 నుంచి 14 ప్యాకేజీలకు రూ.7,542.14కోట్లు ఖర్చవుతుందని లెక్కించారు. ప్రస్తుతం ఆరు ప్యాకేజీల వ్యయం రూ.25వేల కోట్లకు పెరిగింది. ప్యాకేజీ-9లో మిడ్‌మానేరు, అప్పర్ మానేరు మధ్య ఉన్న మలక్‌పేట బ్యారేజీ సామర్థ్యాన్ని 0.35 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచారు. ఈ పనులకు రూ.714.96కోట్ల అంచనాతో పనులు చేపట్టగా.. రూ.62కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. సామర్థ్యం పెంపుతో వ్యయం మరో రూ.300కోట్ల మేర పెరిగే అవకాశముంది. ప్యాకేజీ-11ను రూ.2,500కోట్లతో చేపట్టగా... ఇందులోని ఇమామాబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 0.8 టీఎంసీకి తగ్గించారు.

 

 తర్వాతి ప్యాకేజీలో ఉండే మల్లన్నసాగర్ సామర్థ్యాన్ని 1.5 నుంచి 50 టీఎంసీలకు పెంచారు. దీనికి అనుగుణంగా కాల్వల సామర్థ్యాన్ని పెంచి, అదనంగా పంపులను ఏర్పాటు చేయనున్నారు. ప్యాకేజీ-12లో 9.18 కిలోమీటర్ల టన్నెల్ ఉండగా అది మరో 7 కిలోమీటర్లు మేర పెరిగి 16.18 కిలోమీటర్లకు చేరింది. మొత్తంగా టన్నెల్, కాల్వల వెడల్పు, అదనపు పంపులకు కలిపి మొత్తంగా రూ.1,520కోట్ల మేర వ్యయం పెరుగుతోంది. దీనికితోడు తడ్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో రూ.2వేల కోట్ల అంచనా వేయగా... అది ప్రస్తుతం రూ.5,700కోట్లకు పెరిగింది. ప్యాకేజీ-14లో ఉన్న పాములపర్తి రిజర్వాయర్ వ్యయం సైతం రూ.659కోట్ల నుంచి రూ.3,060కోట్లకు పెరిగింది.

 

 ‘మేడిగడ్డ-ఎల్లంపల్లి’కి రూ.12వేల కోట్లు

మారిన డిజైన్ మేరకు మేడిగడ్డ-ఎల్లంపల్లి మధ్య మూడు బ్యారేజీలు సహా పనులకు ఏకంగా రూ.12వేల కోట్ల మేర వ్యయం కానుంది. నిజానికి ఈ బ్యారేజీల నిర్మాణానికి వ్యాప్కోస్ రూ.4,743 కోట్ల వ్యయ అంచనా వేయగా... తాజాగా అధికారులు వేసిన అంచనాతో అది రూ.6,481.72 కోట్లకు పెరిగింది. ఇక పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి వ్యాప్కోస్ 2007-08 ధరల ప్రకారం రూ.5,270 కోట్లుగా అంచనా వేయగా... 2015-16 రేట్ల ప్రకారం అది రూ.5,560 కోట్లుగా లెక్కగట్టారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top