రూ.10 నాణేలపై ఆగని వదంతులు

రూ.10 నాణేలపై ఆగని వదంతులు


కడప అగ్రికల్చర్‌: పది రూపాయల నాణేలు (బిళ్లలు) చెల్లవనే వదంతులు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. నెల రోజులుగా ఈ పరిస్థితి ఉన్నా... వారం రోజులుగా మరీ ఘోరంగా తయారైంది. అయితే పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని ఎలాంటి భయం, అనుమానం అవసరం లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజలకు ఉన్న అనుమానాలు నివృత్తి చేసేందుకు రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు లేఖ రాశానని, అది రాగానే జిల్లా ప్రజలకు వివరణ ఇస్తామని జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ లేవాకు రఘునా««థ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

నోట్ల రద్దు నుంచి.. కష్టాలే:

గతేడాది నవంబర్‌ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసింది. దీంతో ప్రజలు తీవ్రమైన కరెన్సీ కష్టాలను ఎదుర్కొన్నారు. దాదాపు 135 రోజులుగా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇప్పటికీ నగదు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల బిళ్లలు చెల్లవని ఆటోవాలాలు, చిల్లర అంగళ్లవారు, పండ్లు, కూరగాయలు, పాల పాకెట్‌ల విక్రయదారులు ఇలా ఒకరేమిటి దుకాణాల వారందరూ తిరస్కరిస్తుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రూ.10 బిళ్లలు వచ్చిన కొత్తలో, ఆ తరువాత కూడా చాలా మంది వీటిని సేకరించి దాచుకోవడానికి ఆసక్తి చూపారు. చాలా మంది వ్యాపారులు మూటలు కట్టి ఇళ్లలో పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితిలో పది రూపాయల నాణేలు చెల్లవనే ప్రచారం జరుగుతుండటంతో ఇన్నాళ్లూ దాచుకున్న వాటిని వదిలించుకోవడానికి బయటకు తీస్తున్నారు. దీంతో చాలా మంది వ్యాపారులు వీటిని తీసుకోవడానికి ఇష్టపడడం లేదు సరి కదా.. తమ వద్ద ఉన్న వాటిని వినియోగదారులకు అంటగట్టడానికి చూస్తున్నారు. దీనివల్ల చిన్న చిన్న తగాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే వారికి చిల్లరగా కండక్టర్లు 10 రూపాయల నాణేలు ఇస్తే ప్రయాణికులు తీసుకోవడానికి ఇష్టపడడం లేదు.

అపోహలు వద్దు:

పది రూపాయల నాణేలు చెల్లవనే అపోహలను ప్రజలు, వ్యాపారులు  పెట్టుకోవద్దని బ్యాంకు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన పలు సమావేశాల్లో కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు 10 రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని చెప్పారు. ఈ సమస్య ఒక్క వైఎస్సార్‌ జిల్లాలో మాత్రమే ఉందని, మరే ఇతర జిల్లాల్లో లేదని అధికారులు చెబుతున్నారు. వినియోగదారులు, ప్రజలు, వ్యాపారులకు 10 రూపాయల నాణేలపై ఉన్న అపోహలు తొలగించేందుకు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ రాశానని, అక్కడి నుంచి సమాధానం రాగానే వివరణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు. అంత వరకు లేనిపోని అపోహలు వద్దని అన్నారు. పది రూపాయల నాణేలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయలేదని అన్నారు. భవిష్యత్తులో కూడా రద్దు కావన్నారు. ప్రజలు సందేహాలు, అపోహలకు పోవద్దన్నారు. పది రూపాయల బిళ్లలు తీసుకోకపోతే వారిపై కేసులు పెట్టవచ్చని కలెక్టర్‌ ప్రకటించిన విషయం విదితమే.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top