ఇదేనా..‘శిశు’ వికాసం..!

ఇదేనా..‘శిశు’ వికాసం..!

మూడు నెలలుగా నిలిచిన ‘రోటా’ వైరస్‌ వ్యాక్సిన్‌

వ్యాధి నిరోధక టీకా కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

14 నెలల లోపు చిన్నారులు జిల్లాలో 9,970 మంది 

 

కలుషిత నీరు తాగినా.. కలుషిత ఆహారం తీసుకున్నవారు డయేరియా బారిన పడుతుంటారు. డయేరియా అంటేనే నీళ్ల విరేచనాలు. డయేరియా బారిన పడిన వారికి వాంతులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధితో మత్యువాత పడుతున్న వారిలో ఎక్కువ మంది ఏడాది లోపు చిన్నారులే ఉంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘రోటా’ వైరస్‌ వ్యాక్సిన్‌ మూడు నెలలుగా నిలిచి పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. - రాయవరం 

 

శిశు వికాసమే ధ్యేయంగా రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ గతేడాది ప్రవేశ పెట్టారు. సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల్లో భాగంగా ప్రస్తుతం ఇస్తున్న పోలియో, హెపటైటిస్, కోరింత దగ్గు, ధనుర్వాతం, తట్టు, అమ్మవారు, మెదడు వాపు తదితర టీకాలకు తోడుగా పెంటావాలెంట్‌ టీకాను కూడా చిన్నారులకు ఇస్తున్నారు. ఇదే కాకుండా రోటా వైరస్‌ మందును సార్వత్రిక టీకాల కార్యక్రమంలో చేర్చారు. దీన్ని తొలుత ఆంధ్రప్రదేశ్, హర్యానా, హిమాచలప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో ప్రారంభించి దశల వారీగా మిగిలిన రాష్ట్రాల్లో అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.  

6,10,14 వారాల్లో వాక్సిన్‌ ..

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వచ్చే ఈ వ్యాధి నుంచి పిల్లలను కాపాడడంలో భాగంగా రోటా వైరస్‌ వాక్సిన్‌ మంచి ఫలితాలు ఇస్తుంది. మరణాలను తగ్గించేందుకు శిశువుకు 6,10,14 వారాల్లో దీన్ని వేస్తారు. పోలియో చుక్కలు రెండు వేస్తే, రోటా వైరస్‌ వాక్సిన్‌ ఐదు చుక్కలు చిన్నారుల నోట్లో వేస్తారు.  

మూడు నెలలుగా..

రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ మూడు నెలలుగా సరఫరా కావడం లేదు. రోటావైరస్‌ వ్యాక్సిన్‌ మొదటి విడత వేయించుకున్న వారు, అసలు వేయించుకోని వారు జిల్లాలో 9,970 మంది వరకు ఉన్నారు. మూడు నెలలుగా రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ పీహెచ్‌సీల్లో అందుబాటులో లేక పోవడంతో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఆస్పత్రులకు చిన్నారులను తీసుకుని వస్తున్న వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆస్పత్రి సిబ్బంది ఇదిగో వస్తుంది..అదిగో వస్తుందని చెబుతున్నారని చిన్నారుల తల్లిదండ్రులు అంటున్నారు.  

త్వరలోనే పంపిణీ చేస్తాం..

రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ నిండుకున్న విషయం వాస్తవమే. ఈ వారంలోనే రోటా వైరస్‌ వ్యాక్సిన్‌ జిల్లాకు చేరుకునే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ వచ్చిన వెంటనే ఆస్పత్రులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. 

- డాక్టర్‌ అనిత, జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారిణి, కాకినాడ
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top