రోశయ్యకు హైకోర్టులో ఊరట


ఏసీబీ కోర్టు ఉత్తర్వులు కొట్టివేత

 

 సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమీర్‌పేట భూముల వ్యవహారంలో తమిళనాడు గవర్నర్ రోశయ్యకు హైకోర్టులో ఊరట లభిం చింది. రోశయ్యపై అభియోగాలు మోపుతూ న్యాయవాది మోహన్‌లాల్ దాఖలు చేసిన ఫిర్యాదును విచారణకు స్వీకరిస్తూ హైదరాబాద్ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానం 2012, జూన్ 18న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ వ్యవహారంతో సంబంధమున్న ప్రైవేటు వ్యక్తులను విచారించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతూ ఏసీబీ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ మోహన్‌లాల్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను సైతం హైకోర్టు తోసిపుచ్చింది.



ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో మంగళవారం తీర్పు వెలువరించారు. అమీర్‌పేట్‌లో దాదాపు రూ. 300 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని టీడీపీ నేత డాక్టర్ జి.ఎన్ నాయుడు తదితరులకు కట్టబెడుతూ రోశయ్య నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం 2010లో జీవో 288 జారీ చేసింది. ఈ జీవో వెనుక అక్రమాలు జరిగాయని న్యాయవాది మోహన్‌లాల్ చేసిన ఫిర్యాదు మేరకు ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం, దీనిపై విచారణ జరపాలని ఏసీబీ డెరైక్టర్ జనరల్‌ను ఆదేశించింది. విచారణ జరిపిన ఏసీబీ అధికారులు రోశయ్యకు క్లీన్‌చిట్ ఇస్తూ కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదిక సరిగా లేదని, కేసును పునః సమీక్షించాలని మోహన్‌లాల్ కోరగా ప్రత్యేక కోర్టు అంగీకరించింది. 



ప్రైవేటు వ్యక్తుల్ని విచారించాలంటూ  చేసిన అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. రోశయ్యతో పాటు పలువురి వ్యక్తిగత హాజరుకు సమన్లు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రోశయ్య హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. మోహన్‌లాల్ రివిజన్ పిటిషన్ వేశారు. ఈ 2 వ్యాజ్యాలను న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇళంగో విచారించారు. రోశయ్య వ్యక్తిగత హాజరుకు ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి మంగళవారం తుది తీర్పు ఇచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top