రక్తసిక్తం

రక్తసిక్తం - Sakshi


లారీని ఢీకొట్టిన ఆటో.. ఆరుగురి దుర్మరణం

►ఇద్దరు మహిళలపరిస్థితి విషమం

►మహబూబ్‌నగర్‌– రాయిచూర్‌ ప్రధాన రహదారిపై దుర్ఘటన

►మృతుల్లో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు

► జక్లేర్, మాదన్‌పల్లి, బొందల్‌కుంట  గ్రామాల్లో విషాదఛాయలు




దేహాలు.. తెగిపడిన శరీరభాగాలు.. రక్తసిక్తమైన రహదారి భయానకంగా మారింది. మక్తల్‌ మండలం కాచ్‌వార్‌ గ్రామ సమీపంలో రాయిచూర్‌– మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారిపై ఆదివారం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కనుమూశారు. మక్తల్‌ మండలం మాదన్‌పల్లి గ్రామానికి చెందిన చిన్నకురుమయ్య(30) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.


ఆదివారం సంతకావడంతో మక్తల్‌ నుంచి 18మంది ప్రయాణికులను ఎక్కించుకుని జక్లేర్‌ వైపునకు వస్తున్నాడు. ఇంతలో కాచ్‌వార్‌ సమీపంలో రోడ్డుపై వస్తున్న ఓ గొర్రెను తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టాడు. అతివేగంతో ఉన్న లారీ ఆటోను ఈడ్చుకెళ్లింది. ఆటోడ్రైవర్‌ చిన్నకురుమయ్యతోపాటు ఆటోలో ప్రయాణిస్తున్న మాదన్‌పల్లి గ్రామానికి చెందిన రాములు(65), హన్మంతు(50), జక్లేర్‌కు చెందిన వెంకటప్ప(50) అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.


అలాగే బొందల్‌కుంట గ్రామానికి చెందిన జయమ్మ(45), పులిమామిడికి చెందిన చంద్రమ్మ(55), దత్తుశ్రీ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బొందల్‌కుంట వాసి జయమ్మను మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో చనిపోయింది. మరో మహిళ చంద్రమ్మ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ చనిపోయింది.



కొంపముంచిన నిర్లక్ష్యం..

ఆటోలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతోపాటు ఆటోను నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని క్షతగాత్రులు, స్థానికులు చెబుతున్నారు. ఒకేరోజు మాదన్‌పల్లికి చెందిన ముగ్గురు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అలాగే మాదన్‌పల్లి, జక్లేర్, బొందల్‌కుంట గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం నిమిత్తం శవాలను మక్తల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి ప్రథమచికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్యంకోసం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించారు.



ఆ చిన్నారి మృత్యుంజయురాలు

ఈ సంఘటనలో జక్లేర్‌కు చెందిన చిన్నారి భానుప్రియ మృత్యుంజయురాలిగా బతికిబయటపడింది. ఆమె తల్లి అనూష మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్‌లో చికిత్సపొందుతోంది. తీవ్రంగా గాయపడినవారిలో దత్తుశ్రీ, నీరటి జయమ్మ అనే ఇద్దరు మహిళలను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.మక్తల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  మృతదేహాలను మక్తల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  ఒకేరోజు ఆరుగురు మృత్యువాతపడడంతో మక్తల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో రోదనలు మిన్నంటాయి. మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు.



రెక్కాడితే డొక్కాడని బతుకులు

ప్రమాదంలో చనిపోయినవారంతా రోజువారీగా కూలీపనులు చేసుకునేవారు. ఆదివారం కావడంతో నిత్యావసరాలను కొనుగోలుచేసేందుకు మక్తల్‌ సంతకు వచ్చారు. మాదన్‌పల్లి గ్రామానికి చెందిన మృతుడు హన్మంతుకు భార్యాపిల్లలు ఉన్నారు. మరో మృతుడు రాములుకు భార్య అనంతమ్మతో పాటు కొడుకులు ఉన్నారు. మృతుడు ఆటోడ్రైవర్‌ చిన్నకుర్మన్నకు భార్య మహేశ్వరి ఉంది. జక్లేర్‌కు చెందిన జోగు వెంకటప్పకు భార్య మణెమ్మ ఉంది.


బొందల్‌కుంట గ్రామానికి చెందిన మృతురాలు జయమ్మకు భర్త తిమ్మారెడ్డి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. మరో మృతురాలు ఊట్కూర్‌ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన చంద్రమ్మకు భర్త కాలప్ప, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మరో అరగంటలో సొంతిళ్ల చేరుకునేలోగా మృతువు లారీ రూపంలో కబళించడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సంతలో తెచ్చిన వస్తువులను చూసి ఆనందం పడే సమయంలోనే తమవారిని విగతజీవులుగా చూసి కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు.  

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top