కేసీఆర్.. నీ తాత దిగొచ్చినా..

కేసీఆర్.. నీ తాత దిగొచ్చినా.. - Sakshi


- టీడీపీని ఏం చేయలేవ్: రేవంత్‌రెడ్డి

- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 99 స్థానాలు టీడీపీవే



 సాక్షి ప్రతినిధి, తిరుపతి: ‘‘బిడ్డా... చంద్రశేఖర్‌రావ్.. నీ తాత దిగొచ్చినా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఏం చేయలేవ్. టీడీపీని గోకిన వారెవ్వరూ బతికి బట్టకట్టలేదు. మా పార్టీతో పెట్టుకున్న మహా నాయకులంతా గాల్లో కలిశారు’’ అని టీడీపీ శాసన సభాపక్ష నేత  రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో జరుగుతున్న 35వ మహానాడులో పాల్గొన్న ఆయన ఆదివారం ఉదయం ‘తెలంగాణ ప్రభుత్వ పథకాలు, మితిమీరిన అవినీతి’ అంశంపై తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రసంగించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. గొర్రె కసాయిని నమ్మినట్లు తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మి గెలిపించారన్నారు.



అయితే కేసీఆర్ మాత్రం ప్రజలను విస్మరించి కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఎర్రబెల్లి దయాకరరావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, తీగల కృష్ణారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి వంటివారు కార్యకర్తల స్వేదాన్ని తాకట్టు పెట్టి టీఆర్‌ఎస్‌తో చేతులు కలిపారన్నారు. ‘‘అయ్యా కేసీఆర్... బంగారు తెలంగాణ సంగతెలా ఉన్నా సరైన ఆరోగ్య భద్రత లేక చనిపోయిన 89 మంది పాత్రికేయుల కుటుంబాలకు న్యాయం చేయడం మీ బాధ్యత . తెలంగాణ సాధనలో ఆత్మబలిదానం చేసుకున్న 1,569 మంది అమరవీరుల ఆత్మశాంతి కోసం ఇంటికో ఉద్యోగం, ఐదెకరాల భూమి ఇచ్చేందుకు శాసనసభలో తీర్మానం చేసి తీరా 588 మందినే గుర్తించారు. ఇది అన్యాయం కాదా?’’ అని రేవంత్ ప్రశ్నించారు. సమగ్ర సర్వే పేరిట 12 గంటల్లో 4 కోట్ల మంది అడ్రస్‌లు గుర్తించిన కేసీఆర్‌కు... తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అడ్రస్‌లు దొరకలేదంటే జనం నమ్మరన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 99 అసెంబ్లీ స్థానాలు గెలిచి తీరతామన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top