కులంతో ప్రమేయం లేని రిజర్వేషన్లా.?

కులంతో ప్రమేయం లేని రిజర్వేషన్లా.?


జస్టిస్‌ ఈశ్వరయ్య భావాలు ఆమోద యోగ్యం కాదు

ఏపీ బీసీ సంఘం నాయకుల ఖండన




డాబాగార్డెన్స్‌ (విశాఖ దక్షిణం) : కులంతో ప్రమేయం లేని రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్‌ ఈశ్వరయ్య వెలిబుచ్చిన అభిప్రాయాలు బీసీలకు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు, ఉత్తరాంద్ర బీసీ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు తెలిపారు. నగరంలోని ఓ హాటల్లో ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. నాయకులు మాట్లాడుతూ కేవలం వృత్తి  ప్రాతిపదికగానే వెనుకబాటుతనాన్ని గుర్తించాలనడం.. రాజ్యాంగంలో పొందుపరచిన సాంఘిక, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని విస్మరించడమే అవుతుందన్నారు. నిరుద్యోగ సమస్య వల్ల పేదరికంతో రిక్షా కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇతర రంగాల్లో వేతన కూలీలుగా మారుతున్న వారికి మెరుగైన ఉపాధి కల్పించేటట్లు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలే గానీ.. సాంఘిక వెనుకబాటుతనం నెపంతో అర్హత లేని కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలనడం.. రిజర్వేషన్ల మౌలిక సూత్రాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.



కులాన్ని, వృత్తిని వేరు చేస్తే ఎలా.?

జస్టిస్‌ ఈశ్వరయ్య కులాన్ని, వృత్తిని విడదీసి.. కుల వృత్తులు ఏర్పడిన చారిత్రక నేపథ్యాన్ని నిరాకరిస్తున్నారన్నారు. కులంతో సంబంధంలేని ఇతర వృత్తులకి సాంఘిక న్యూనత లేదని, అలాంటప్పుడు నిరుద్యోగం, పేదరికం కారణంగా చేస్తున్న కూలీ పనులకి మధ్య ఉన్న సాంఘిక తేడాని ఈశ్వరయ్య వంటి న్యాయమూర్తి గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అర్హత లేని కులాలను బీసీల్లో చేర్చే అవకాశం లేకుండా కట్టుదిట్టంగా చట్టాన్ని రూపొందించాలని వారు డిమాండ్‌ చేశారు.



రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడంతో పాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కూడా పార్లమెంట్‌లో ఏకకాలంలో ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొలగాని కిషోర్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ని శ్రీనివాసరావు, విశాఖ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు బుగత నరసింగరావు, గొర్లె శ్రీనివాసనాయుడు, వాసుపల్లి రాజశేఖర్, కోలా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top