మధుకర్‌ మృతదేహానికి రీపోస్ట్‌ మార్టమ్‌ పూర్తి


హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా చీఫ్‌ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కుశ పర్యవేక్షణలో మధు తల్లిదండ్రుల సమక్షంలో కేఎంసీ, ఉస్మానియాకు చెందిన నలుగురు వైద్యులు సోమవారం రీపోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోలీసు బందోబస్తు మధ్య నాలుగున్నర గంటల పాటు పోస్టు మార్టం కొనసాగింది. రీపోస్ట్ మార్టమ్‌ను వీడియో చిత్రీకరణ చేసి సీల్డ్ కవరులో జిల్లా జడ్జీకి అందజేశారు.



27 రోజులుగా మధుకర్‌ మరణంపై వస్తున్న విమర్శలు, ఆరోపణలకు రీపోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తో తెరపడనుంది. మధుకర్‌ది హత్యా? ఆత్మహత్యా? అని తేలిపోనున్న నేపధ్యంలో రీపోస్ట్ మార్టమ్ నిర్వహించిన వైద్యులు మాత్రం ఎముకలకు, తలకు ఎలాంటి గాయాలు లేవని తేల్చారు. వారం రోజుల్లో రిపోస్ట్ మార్టమ్ రిపోర్ట్, నెల రోజుల వరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే అవకాశం ఉందన్నారు డాక్టర్ కృపాల్ సింగ్.



హైకోర్టు ఆదేశం మేరకు జరిగిన రీపోస్ట్ మార్టమ్ తో న్యాయం జరుగుతుందని చెప్పిన మధు తల్లిదండ్రులు ముమ్మాటికి హత్యేనని చెప్పారు. మర్మాంగం ఉందని, కనుగుడ్డు ఒకటి కనిపించలేదని, మర్మాంగం వాపెక్కి ఉండడంతో కొట్టినట్లు భావిస్తున్నామని మధు తండ్రి ఎల్లయ్య తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 60 మందిని విచారించారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్ డాటా సేకరించారు.




కేసులో కీలకమైన ఆధారం మధు ప్రియురాలు శిరీషను సైతం పోలీసులు విచారించి కీలకమైన ఆధారాలు సేకరించారు. కేసు విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడించలేక పోతున్నామని పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఏదేమైనా పోలీసుల విచారణలో లభించిన ఆధారాలు, రీపోస్ట్ మార్టమ్‌లో తేలిన అంశాలను పరిశీలిస్తే మధుకర్‌ది ఆత్మహత్యగా తేలిపోనున్నదని స్పష్టమవుతుంది. కానీ, అధికారికంగా వెలువడడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top