ఇస్కా మాయ ఇంతింత కాదయా

ఇస్కా మాయ ఇంతింత కాదయా


► ఏడు నెలలకే  నాణ్యత బట్టబయలు

►కుంగిపోయిన ఫుట్‌పాత్‌లు, ఫ్లోరింగ్‌

► రాళ్లు లేచిన తారు రోడ్లు,

► మూలన పడ్డ ఆర్‌ఓ ప్లాంట్లు

► కోట్ల నిధులు దుర్వినియోగం

► అధికారులు, కాంట్రాక్టర్లు ఖుషీ ఖుషీ

►  వెల్లువెత్తిన విమర్శలు




ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ నిర్వహణ కోసం ఏడు నెలల కిందట తిరుపతిలో చేపట్టిన కోట్లాది రూపాయల పనుల్లో నాసిరకం బట్టబయలైంది. నాణ్యత లేని పనులు నగర వాసులను వెక్కిరిస్తున్నాయి. లేచిపోయిన తారు, పగిలిపోయిన ఫుట్‌పాత్‌ టైల్స్, కుంగిపోయిన ఫ్లోరింగ్‌లు, ఊడిపోయిన కుళాయిలు, దెబ్బతిన్న విద్యుత్‌ వైర్లు, ఎండిపోయిన పూలమొక్కల వంటివన్నీ ఇస్కా పనుల్లో  జరిగిన మస్కాకు సాక్షీభూతంగా నిలిచా యి. ఇస్కా పనుల్లో అడ్డగోలు దోపిడీకి తెరలేపారన్న విషయం తేటతెల్లమవుతోంది. రూ. 10 కోట్ల మేర ని«ధులు దుర్వినియోగమయ్యాయన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.



సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ కేంద్రంగా జనవరి 3 నుంచి 7వ తేదీ వరకూ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సభలు జరిగాయి. దేశ విదేశాల నుంచి పేరున్న సైంటిస్టులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ను ప్రారంభించారు. సైన్స్‌ కాంగ్రెస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం రూ.175 కోట్లను కేటాయించింది. డిసెంబర్‌ రెండో వారం నుంచే సివిల్, ఇంజినీరింగ్‌ పనులు మొదలయ్యాయి.


జాతీయ రహదారులు, మున్సిపల్‌ రోడ్ల  సుందరీకరణ, పార్కుల నిర్మాణం, కూడళ్ల సుందరీకరణ, డివైడర్లు, ఫుట్‌పాతలకు రిపేర్లు...వంటి పనులన్నీ చేపట్టారు. వర్సిటీ హాస్టళ్ల రిపేర్లు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులూ వేగంగా జరిగాయి. యూనివర్సిటీలోని సెమినార్‌ హాళ్లు, హెచ్‌ఓడీల చాంబర్లు కొత్తగా ముస్తాబయ్యాయి. ఆడిటోరియంలు, పార్కులు రంగులతో మెరిసిపోయాయి. అన్ని రకాల పనుల కోసం రూ.160 కోట్ల దాకా ఖర్చు చేశారు. ఇందులో రూ.100 కోట్ల వరకూ పైన పేర్కొన్న పనులకు కేటాయిం చారు. మిగతా నిధులు వేదికల నిర్మాణం, షామియానాలు, భోజనాలు, వసతులు, కార్లు, హోటళ్ల అద్దెలు ఇతరత్రా వాటికి వినియోగించారు. అయితే సమయం తక్కువన్న కారణంతో నాణ్యతకు తిలోదకాలిచ్చి హడావుడి పనులతో కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు.



ఏర్పాట్లకు సంబంధించిన పనులతో పాటు రోడ్లు, సెమినార్‌హాళ్లు, ఆడిటోరియంలు, ఫుట్‌పాత్‌లు, డివైడర్ల రిపేర్ల వంటి మేజర్‌ పనులన్నింటినీ అధికార పార్టీ నాయకులు దక్కించుకున్నారు. సీఎం పేరు చెప్పి కొందరు, మంత్రి నారాయణ పేరు చెప్పి మరికొందరు టెండర్లలో పాల్గొన్నారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు అధికార పార్టీ నాయకుల ఆశీస్సులతో అందినకాడికి దండుకున్నారు. పలుకుబడితో పనులు దక్కించుకున్న టీడీపీ నేతలు,  వారివెనుకనున్న బినామీ కాంట్రాక్టర్లు లక్షల్లో వెనుకేసుకున్నారు. పనులన్నీ నాసిరకంగా చేసి బిల్లులు పొందారు.



పనుల్లో మాయాజాలం...

ఎయిర్‌పోర్టు జంక్షన్‌ నుంచి కేఎల్‌ఎం ఆస్పత్రి వరకూ జాతీయ రహదారి సుందరీకరణ పనులు జరిపారు. తారురోడ్డు పనులు హడావుడిగా చేయడం వల్ల అక్కడక్కడా తారు లేచిపోయి రాళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఎస్వీయూ క్యాంపస్‌లో ఫుట్‌పాత్‌ల నిర్మాణ పనుల్లోనూ నాసిరకం తొంగిచూస్తోంది. పనులు జరిగిన రోజుల్లో ఉదయం సిమెంట్‌ పనులు చేసి మధ్యాహ్నం టైల్స్‌ అతికించారు. క్యూరింగ్‌ లేని కారణంగా చాలా చోట్ల టైల్స్‌ జారిపోయాయి.



ఇస్కా సదస్సులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లలో భాగంగా 8 చోట్ల ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల ప్లాంట్లు మూలన పడ్డాయి. శ్రీనివాసా ఆడిటోరియంలోని ఆర్‌ఓ ప్లాంటుకు ఏర్పాటు చేసిన నీళ్ల కొళాయి ఊడిపోవడంతో నెల రోజులుగా దీన్ని వాడటం లేదు. పనులన్నింటిలోనూ మాయాజాలం కనిపిస్తోంది. నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లంతా కలిసి ని«ధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.



పలు చోట్ల దెబ్బతిన్న టైల్స్‌ ...

ఎస్వీ యూనివర్సిటీలో చాలా చోట్ల ఫుట్‌పాత్‌ టైల్స్‌ దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల పగిలిపోగా, మరికొన్ని చోట్ల కుంగిపోయాయి. ఇంకొన్ని చోట్ల మట్టితో కలిసి కొట్టుకుపోయాయి. ఎస్వీ ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లే దారిలో ఆహ్లాదంగా కనిపించే చెట్ల పక్కన ఫుట్‌పాత్‌ టైల్స్‌ పగిలిపోయాయి. సుమారు పది చోట్ల టైల్స్‌ దెబ్బతిన్నాయి.  సిమెంట్‌ టైల్స్‌తో హడావుడిగా చేసిన పనులన్నీ చాలా చోట్ల నాసిరకంగా కనిపిస్తున్నాయి.



పూలతోటలో ఎండిన మొక్కలు...

సైన్స్‌ కాంగ్రెస్‌కు వారం ముందు శ్రీనివాసా ఆడిటోరియం పూలతోటలో రకరకాల పూలమొక్కలను అమర్చారు. గార్డెన్‌ డెవలప్‌మెంట్‌ కోసం వేల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఇక్కడ పెట్టిన పూలమొక్కలు ఎండిపోయాయి. కొన్ని చోట్ల మొక్కలే కానరావడం లేదు. ఆడిటోరియానికి దగ్గరలో  క్యాంటీన్‌కు ఎదురుగా రోడ్డు పక్కనున్న గార్డెన్‌ డివైడర్‌ రాళ్లు పూర్తిగా ఒరిగిపోయా యి. దీంతో మట్టి జారిపోయి ఇక్కడున్న మొక్కలన్నీ దెబ్బతింటున్నాయి. శ్రీనివాసా ఆడిటోరియం వెలుపల వేసిన సిమెంట్‌ టైల్స్‌ చాలా చోట్ల కుంగిపోయాయి

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top