అమ్మో ఎండలు..

అమ్మో ఎండలు..


► 44.5 డిగ్రీలుగా నమోదు..

►  ఈ ఏడాది ఇదే అత్యధికం

►  రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

► హడలెత్తిస్తున్న వేసవి తాపం

► ఇబ్బందులు పడుతున్న జనం




ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. రికార్డు స్థాయి ఎండలతో ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం 6 గంటలు దాటినా వేడి తగ్గడం లేదు. శుక్రవారం 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది ఇదే అత్యధికం కావడం గమనార్మం. వేడి, ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు.


మధ్యాహ్నం ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ఎండల బారి నుంచి రక్షణ పొందాలంటే అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఆదిలాబాద్‌లో భిన్న వాతావరణం ఉంటోంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. అదేవిధంగా చలి తీవ్రత కూడా ఎక్కువగా నమోదైంది. ఎండలు కూడా ఆదే తరహలు ఉంటున్నాయి.



చల్లని పానీయాలకు పెరిగిన గిరాకీ..

ప్రజలు ఎండల తీవ్రతకు అల్లాడి పోతున్నారు. వేడి తీవ్రత నుంచి ఉపశమనానికి కొబ్బరి నీళ్లు, తర్బుజా, పండ్ల రసాలు, ఇతర పానీయాలు తాగుతున్నారు. ఎండలు మండుతుండడంతో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో కుల్‌డ్రింక్‌ షాపులు, జ్యూస్‌ సెంటర్లు వెలిశాయి. ఎండలో తిరిగే వాహనదారులు, కార్యాలయాల్లో పని చేసేవారు, ఫీల్డ్‌ వర్క్‌ చేసేవారు వేడిమికి తట్టుకోలేక కాసేపు సేద తీరి వాటి రుచిని ఆస్వాదిస్తున్నారు.



వడదెబ్బతో జాగ్రత్త..

వడదెబ్బతో ప్రజలు ప్రతి ఏడాది అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 20 మంది వరకు వడదెబ్బకు గురై చనిపోయారు. శరీర ఉష్ణోగ్రత 106 డిగ్రీ ఫారెన్‌హీట్‌ దాటితే వదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కళ్లు తిరగడం తీవ్రమైన తలనొప్పి, గుండె దడ, చెమట ఎక్కువగా రావడం, కిడ్నీ చెడిపోవడం, పిట్స్‌ రావడం తదితర లక్షణాలు బయటపడుతాయి. ఒక్కోసారి కోమాలోకి సైతం వెళ్లొచ్చు. శరీర ఉషోగ్రత మామూలు స్థితిలో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులకు వేడిగాలులు తగిలినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.



తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఎండల తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా వదులైన కాటన్‌ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌ అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. బయట ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీరు వెంట తీసుకెళ్లాలి. వడదెబ్బకు గురైన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.



రక్షణ చర్యలు తీసుకోవాలి – డాక్టర్‌ సాధన, డిప్యూటీ డీఎంహెచ్‌వో

ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వడదెబ్బ బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎండలో బయటకు వెళ్లవద్దు. ఎక్కువగా నీరు తాగాలి. వడదెబ్బకు గురైతే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లాలి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top