ట్యాంపరింగ్‌ కింగ్‌పై చర్యలకు సిఫార్సు


విజయనగరం కంటోన్మెంట్‌: ట్యాంపరింగ్‌ కింగ్‌గా ఇటీవల ప్రాచుర్యం పొందిన పార్వతీపురం డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే గణేశ్వరరావుపై చర్యలకు జిల్లా కలెక్టర్‌ లేఖ రాయనున్నట్టు తెల్సింది. విశాఖ భూ కుంభకోణాల్లో కీలక పాత్రధారిగా ప్రభుత్వ భూములను ట్యాంపరింగ్‌ చేసి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ఘనాపాటిగా సిట్‌ అధికారులు తేల్చిన ఈ అంశంలో జిల్లా కలెక్టర్‌ స్వయంగా ఆరా తీసినట్టు తెలిసింది. సాక్షి దినపత్రికలో వరుసగా వచ్చిన కథనాలకు స్పందించిన ఆయన ఆ శాఖ ఏడీ ఎం.గోపాలరావును నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.



గణేశ్వరరావు కార్యాలయానికి వస్తున్నారా? బయోమెట్రిక్‌ వేస్తున్నారా? హాజరు శాతం, ఆయనకు సెలవు ఎవరు మంజూరు చేశారు? అన్నాళ్లు మంజూరు ఎలా చేశారన్న విషయాలను ఆయన నివేదికలో పొందుపరచమన్నట్టు భోగట్టా! దీంతో ఏడీ గోపాలరావు ఓ నివేదికను తయారు చేశారు. ఫీల్డ్‌ బాధ్యతల కారణంగా బయోమెట్రిక్‌ విషయంలో ఎక్కడయినా ఆయన వేసుకునే వెసులుబాటు ఉందని నివేదికలో పొందుపరిచినట్టు తెల్సింది. అలాగే సెలవు మంజూరు విషయంలో ఆయన ఎప్పుడూ సెలవు పెట్టేవారు కాదని పేర్కొన్నట్టు సమాచారం.



ఇటీవలే సిట్‌ అధికారుల దర్యాప్తు నేపథ్యంలోనే సెలవు పెట్టినట్టు తెలిసింది. ఈ విషయమే ఏడీ నివేదించినట్టు సమాచారం. అయితే ఏడీ ఇచ్చిన నివేదికను పరిశీలించి సర్వే శాఖ కమిషనర్‌కు జిల్లా యంత్రాంగం లేఖ రాయనుంది. ఆయనపై చర్యలు తీసుకోవాలనే కోణంలో ఓ నివేదికను లేఖ రూపంలో సర్వే శాఖ కమిషనర్‌కు పంపించనున్నట్టు ఏడీ గోపాలరావు తెలిపారు. మరో పక్క గణేశ్వరరావు విచ్చలవిడిగా తన పనులు చేసుకునేందుకు ఏడీ ఫ్రీ హ్యాండ్‌ ఇవ్వడమే కారణమన్న సాక్షి కథనంతో జిల్లాలో కలకలం రేగింది. గణేశ్వరరావు లీలలపై ఎప్పుడు ఏ కథనాలు వస్తాయో? ఎవరి కొంప మునుగుతుందోనన్న ఆందోళన ఆ శాఖ సిబ్బందిలో కలుగుతున్నట్టు జోరుగా చర్చలు సాగుతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top