లక్షలిస్తే సరి..!

లక్షలిస్తే సరి..! - Sakshi


సాక్షి ప్రతినిధి, ఏలూరు :  రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దిగాలంటే.. అనువైన భూమి చూసుకోవాలి. వ్యవసాయ భూమి అయితే భూ మార్పిడి చేసుకోవాలి. లే-అవుట్ చేయించి కార్పొరేషన్ పరిధిలో అయితే నగర పాలకసంస్థకు పన్ను చెల్లించాలి. గ్రామాల్లో లే-అవుట్ వేస్తే ఆయా పంచాయతీలకు పన్ను చెల్లించాలి. ఇదంతా ఎక్కడైనా జరిగేదే కానీ.. ఏలూరు పరిసర ప్రాంతాల్లో మాత్రం లే-అవుట్ వేయాలంటే మాత్రం ముందుగా ఓ టీడీపీ నాయకుడి వద్దకు వెళ్లాలి. అతని అనుమతి తీసుకోవాలి. అక్కడ సరిపడా ముడుపులు చెల్లించి తర్వాతే లే-అవుట్ పనులు మొదలుపెట్టాలి. లేదంటే కొర్రీలు పడిపోతాయి. ని‘బంధనాలు’ అడ్డొచ్చేస్తాయి. ఎక్కడా లేనివిధంగా ఒక్క ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే సాగుతున్న ఆ నేత భూ దందాతో రియల్టర్లు అల్లాడిపోతున్నారట.

 

 ‘హై’టెన్షన్

 సదరు నేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పరిధిలో జాతీయ రహదారి ఉండటంతో పెద్దసంఖ్యలో రియల్టర్లు వెంచర్లు వేసేందుకు ముందుకొస్తున్నారు. హైవే పక్క భూముల్లో వెంచర్లు వేసినా, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసినా లాభాలు దండిగా ఉంటాయని  లెక్కలు వేస్తున్నారు. అయితే సదరు నేత ఇండెంట్లు చూసి  బెంబేలెత్తిపోతున్నారు. రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయాలన్నా, పారిశ్రామిక వాడ నెలకొల్పాలన్నా తనను కలవాల్సిందేనని ఆ నేత తన అనుయాయులతో చెప్పిస్తున్నారు. తనను కలవని పక్షంలో అదేపనిగా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇటీవల వంగూరు ప్రాంతంలో  ఓ వ్యక్తి ఐదు ఎకరాల భూమిలో లే-అవుట్ వేశారు. భూమి చదును చేసి పక్కనే ఉన్న పంటకాలువలో పూడిక తీయించారు.  వినియోగదారులను ఆకట్టుకునే విధంగా ప్లాట్లను అందంగా తీర్చిదిద్దారు.

 

 ఓ రోజు ఈ రోడ్డు వెంట వెళుతూ ఆ లే-అవుట్‌ను చూసిన సదరు నేత వెంటనే రెవెన్యూ అధికారులను తన ఇంటికి పిలిపించుకున్నారు. ఆ ప్రాంతంలో పంటకాలువ ఆక్రమణకు గురైందని, తక్షణం సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఆగమేఘాల మీద వెళ్లిన అధికారులు రియల్ ఎస్టేట్ యజమాని సమక్షంలో సర్వే చేశారు. ఆ తర్వాత నాయకుడి వద్దకు వెళ్లి ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురికాలేదని స్పష్టం చేశారు. ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ‘కాలువ ఆక్రమణకు గురైందని నేను చెబితే లేదంటావా. మరోసారి వెళ్లి చూసి రా’ అంటూ గదమాయించారు. ‘పరిస్థితి’ని అర్థం చేసుకున్న భూ యజమాని ఆ నేత వద్దకు స్వయంగా వెళ్లి రూ.10 లక్షలు సమర్పించుకున్నారని తెలిసింది.

 

 పుంతరోడ్డును అడ్డం పెట్టుకుని భారీ ఇండెంట్

 దొండపాడులో రూ.కోట్లు పలుకుతున్న భూములపై కన్నేసిన సదరు నేత వ్యూహాత్మక ఎత్తుగడ వేశారు. ఏడాది క్రితం ఈ ప్రాంతంలోని ఓ పుంత రోడ్డును అభివృద్ధి చేసి పేదలకు పంపిణీ చేస్తామని ప్రకటి ంచారు. ఆ మేరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో ముళ్లపొదలు తొలగించి రోడ్డు వేశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల భూమి యజమానులు సదరు నేతను కలుసుకున్నారు. ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే రియల్‌ఎస్టేట్ బూమ్ తగ్గిపోతుందని, భూముల రేట్లు పడిపోతాయని విన్నవించుకున్నారు. తన పాచిక పారిందని భావించిన ఆ నాయకుడు గట్టిగా ఇండెంట్ వేశారట. ఆయన అడిగినంత  భారీమొత్తం ఇవ్వలేమని, కాస్త తగ్గించుకోవాలని వ్యాపారులు బేరసారాలు ఆడారట. ఇంకా బేరం తెగని ఈ వ్యవహారంతో పేదలు మాత్రం తమ చేతికి వచ్చాయనుకున్న భూములు దక్కకుండా పోతాయని ఆందోళన చెందుతున్నారట.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top