విద్యుదుత్పత్తికి సర్వం సిద్ధం

విద్యుదుత్పత్తికి  సర్వం సిద్ధం


కృష్ణానదికి ఎప్పుడు వరదొచ్చినా 474 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఏర్పాట్లు

జూరాలలో 234, లోయర్‌ జూరాలలో 240 మెగావాట్ల ఉత్పత్తి

ఒక్కో దాంట్లో ఆరు టర్బైన్ల చొప్పున మొత్తం 12 టర్బైన్లతో విద్యుదుత్పత్తి

పూర్తిస్థాయి విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉన్నాం: ఎస్‌ఈ సురేష్‌




జూరాల (గద్వాల) : రాష్ట్ర విద్యుదుత్పత్తి రంగంలో తమవంతు భాగస్వామ్యం అయ్యేలా పూర్తి స్థాయిలో జలవిద్యుత్‌ను అందించేందుకు జూరాల జలవిద్యుత్‌ కేం ద్రంలో అన్ని టర్బైన్లు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది అన్ని టర్బైన్ల పనులను పూర్తి చేసుకొని ట్రయల్‌ రన్‌లో విజయవంతమైన లోయర్‌ జూరాల జలవిద్యుత్‌ కేం ద్రంలోని ఆరు టర్బైన్లు విద్యుదుత్పత్తికి సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా కృష్ణానది వరదతో జూరాల, లోయర్‌ జూరాల జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 474 మెగావాట్ల జలవిద్యుత్‌ను మొదటి సారిగా అందించేందుకు సర్వం సిద్ధం చేశారు.



2008 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభం

స్వాతంత్య్రం అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానదిపై నడిగడ్డలో తొలి జలవిద్యుత్‌ కేంద్రంగా నిర్మితమైన జూరాల జలవిద్యుత్‌ కేంద్రం 2008 నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ ఈ ప్రాంతం అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. నాటి నుంచి నేటి వరకు 1583 మిలియన్‌ యూనిట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రగతిలో తన వంతు వాటాను జూరాల జలవిద్యుత్‌ కేంద్రం అందిస్తుంది. గత రెండేళ్లుగా ఉత్పత్తి చేస్తున్న సగం విద్యుత్‌ను కర్ణాటక రాష్ట్రానికి అందిస్తు లక్ష్యం మేరకు విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రగతిని అందుకుంటూ ముందుకు సాగుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న జూరాల జలవిద్యుత్‌ కేంద్రం ప్రస్తుతం పూర్తిస్థాయిలో జల విద్యుదుత్పత్తిని ఆరు టర్బైన్లలో అందిస్తూ వరద వస్తే చాలు పనిచేసేలా సిద్ధంగా ఉన్నాయి.



1981లో జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన

కృష్ణానదిపై ఉన్న వాటా నీటిని ఉపయోగించుకోవడంతో పాటు వర్షాభావ ప్రాంతమైన పాలమూరు జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో 1.07లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1981లో జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి 1996 ఆగస్టు 5న ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. జూరాల ప్రాజెక్టు నిర్మాణంలోనే డిజైన్‌ చేసిన విధంగా ఆరు క్రస్టుగేట్లలో విద్యుత్‌ టర్బైన్లను ఏర్పాటు చేసి సివిల్‌ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం జూరాల జలవిద్యుత్‌ కేంద్రానికి 2002లో అనుమతులు ఇ చ్చింది. ప్రాజెక్టు పనులను డిసెంబర్‌ 2014న ప్రారంభించింది. ఫిబ్రవరి 2006లో మొదటి టర్బైన్‌ను సిద్ధం చేసినప్పటికీ 2007లో రెండు టర్బైన్లను సిద్ధంచేసి ట్రయల్‌రన్‌ నిర్వహించారు. ఆగస్టు 2008లో రెండు విద్యుత్‌ టర్బైన్లతో జలవిద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అం కితం చేశారు. ఈ ప్రాజెక్టులో ఆరు బల్బు టర్బైన్లను అందించేందుకు చైనాకు సంబంధించిన సీఎంఈసీ కంపెనీకి అ ప్పగించారు.


2012 వరకు మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన లక్ష్యం ఉన్నప్పటికీ 2013 వరకు పనులు కొనసాగి పూర్తి చేశారు. ఒక్కో టర్బైన్‌ 39 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక టర్బైన్‌ పూర్తిస్థాయిలో పనిచేయడానికి 8 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం అవసరం. జూలై చివరి నుంచి సెప్టెంబర్‌ చివరి వరకు ఉండే వరద నీటితో వరద కెపాసిటీ ఆధారంగా టర్బైన్లను పని చేయిస్తారు. ఏటా 405 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణమైంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top