హైదరాబాద్‌లో ఆర్‌సీఐ సృష్టికర్త

గతంలో రాష్ట్రపతి హోదాలో హైదరాబాద్ కు వచ్చిన కలాంకు అప్పటి గవర్నర్ సుశీల్ కుమార్ షిండే,సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్వాగతం చెబుతున్న దృశ్యం - Sakshi


హైదరాబాద్: దేశం గర్వించదగ్గ గొప్ప క్షిపణి శాస్త్రవేత్త, దివంగత మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాంకు హైదరాబాద్ నగరంతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన ఎనభయ్యో దశకంలో ఒకవైపు డీఆర్‌డీఎల్ (డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ లేబొరేటరీ) సారథ్య బాధ్యతలను నిర్వహిస్తున్న సమయంలోనే హైదరాబాద్ శివార్లలోని మల్లాపూర్‌లో క్షిపణి ప్రయోగాలకు సంబంధించి రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) కు సృష్టికర్తగా నిలిచారు. కలాం ప్రతిభను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆర్‌సీఐ ప్రారంభ డెరైక్టర్‌గా ఆయనను నియమించింది. ఆయన మార్గదర్శకత్వంలో అగ్ని,ఆకాశ్ క్షిపణుల ప్రయోగ పరీక్షల్లో పాల్గొన్నట్లు ప్రస్తుతం ఆర్‌సీఐలో అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న మూర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఆయనతో తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఆర్‌సీఐ బాధ్యతలు చేపట్టిన కలాం అందరితో కలివిడిగా,స్నేహపూర్వకంగా ఉండేవారని,హోదా రీత్యా ఏనాడూ గర్వంగా వ్యవహరించలేదన్నారు.


 


తాను ఎంతో కష్టపడి పనిచేయడంతోపాటు ప్రయోగ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడూ మొక్కవోని దీక్ష,పట్టుదలతో వ్యవహరించి ఆ సమస్యను పరిష్కరించే వరకూ అక్కడి నుంచి వెనుదిరిగే వారు కాదని గుర్తుచేసుకున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు అర్థరాత్రి రెండు గంటల సమయం అయినా తమతోనే ఉండేవారన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో అందరినీ పరిశోధనల దిశగా ప్రోత్సహించేవారని,ఉత్తేజపూరితంగా పనిచేసేవారన్నారు. మా అందరిలో స్ఫూర్తిని నింపిన ఆయన లేని లోటు తీరనిదన్నారు. క్షిపణి ప్రయోగాల్లో ఆయన సృష్టించిన సాంకేతికతే నేటికీ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. భారతదేశ ఖ్యాతి దశదిశలా వ్యాపింపజేసిన ‘ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం’కు ఆయనే సారథి అని కొనియాడారు. ఆర్‌సీఐ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు ల్యాబ్‌లో పనిచేస్తున్నవారు ఎంత చిన్నవారైనా వారిని నేరుగా తనతో మాట్లాడేందుకు అనుమతించడం ఆయన సమున్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు.

 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top