నీళ్లున్నా.. నిట్టూర్పే!

నీటితో కళకళలాడుతున్న రామన్‌పాడు రిజర్వాయర్‌

  •  రామన్‌పాడుకు జలకళ.. తాగునీటి పథకాలు విలవిల

  •  4నెలలుగా నిలిచిన అచ్చంపేట రక్షిత తాగునీటి పథకం

  •  కొనసా..గుతున్న పైపుల పునరుద్ధరణ పనులు

  •  వర్షాకాలంలోనూ 120 గ్రామాలకు అందని నీళ్లు

  •   

    – రామన్‌పాడు ప్రస్తుతం నీటిమట్టం: 1022

    – అచ్చంపేట పథకానికి అవసరమయ్యే నీళ్లు(రోజుకు): 18ఎంఎల్‌డీ

    – నీటి సరఫరా నిలిచిన నియోజకవర్గాలు: 3

     

    గోపాల్‌పేట: నీటి వనరులు కళకళడుతున్నా తాగునీటికి నిట్టూర్పే..! వర్షాకాలంలోనూ గుక్కెడు నీళ్ల కోసం అర్రులు చాచాల్సిందే..

    ప్రధాన తాగునీటి వనరు రామన్‌పాడు రిజర్వాయర్‌లో పుష్కలంగా నీళ్లున్నా వాడుకోలేని దుస్థితి. కారణం పైప్‌లైన్లు తరచూ పగిలిపోవడమే.. పైపుల మరమ్మతు పనులు ఇంకా కొనసా.. గుతూనే ఉన్నాయి. వేసవిలో రామన్‌పాడు రిజర్వాయర్‌ ఎండిపోవడంతో నీళ్లు లేక నాలుగు నెలలుగా పూర్తిస్థాయిలో అచ్చంపేట రక్షిత తాగునీటి పథకం నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని 120 గ్రామాలకు నీళ్లందడం లేదు. ఇదిలాఉండగా, ఇటీవల కురిసిన వర్షాలతో పాటు జూరాల నుంచి దిగువకు వదిలిన నీటితో రామన్‌పాడు రిజర్వాయర్‌ నిండింది. ప్రస్తుతం రిజర్వాయర్‌ జలకళను సంతరించుకుంది. అయినప్పటికీ అచ్చంపేట రక్షిత మంచినీటి పథకం నీటి సరఫరాను పునరుద్ధరించడం లేదు. ప్రస్తుతం రామన్‌పాడు నుంచి వనపర్తి, మహబూబ్‌నగర్‌ పట్టణాలకు మాత్రమే తాగునీరు సరఫరా అవుతోంది. 

     

    తరచూ పైప్‌లైన్లకు మరమ్మతులు

    రామన్‌పాడు తాగునీటి పథకానికి గతంలో నాసిరకం పైపులు వాడడంతో తరచూ అవి పగిలిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట లీకేజీలు ఏర్పడుతున్నాయి. ఆలస్యంగానైనా స్పందించిన ప్రభుత్వం పైపులను మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం రూ.15కోట్లు విడుదల చేసిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి ఇటీవల తెలిపారు. వేసవిలో రిజర్వాయర్‌ అడుగంటిన క్రమంలో పైపుల పునరుద్ధరణ ప్రక్రియకు ఉపక్రమించారు. దీంతో మార్చి 25 నుంచి రామన్‌పాడు హెడ్‌వర్క్స్, గోపాల్‌పేట పంప్‌హౌస్‌లో మోటార్లు నిలిచిపోయాయి. పగిలిపోయిన జీఆర్పీ, ఎంఎస్‌ పైపుల స్థానంలో డీఐ పైపులను బిగిస్తున్నారు. ఇంకా వనపర్తి, కొత్తకోట మండలాల్లో మరమ్మతు పనులు నత్తనడకన సాగుతుండడంతో తాగునీటి సరఫరాకు ఆటంకం కలుగుతోంది. అయితే ఈ పథకం ద్వారా నీళ్లను సరఫరా చేస్తుందోలేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

      

    గ్రామాల్లో నీటిఎద్దడి 

    గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది వేసవిలో గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. అంతవరకు రామన్‌పాడు నీటిపైనే ఆధారపడిన ప్రజలు రామన్‌పాడు రిజర్వాయర్‌ నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో నీళ్లు దొరక్క నానాకష్టాలు పడ్డారు. లీజు బోర్ల ద్వారా నీటి అవసరాలను తీర్చలేక అధికారులు, సర్పంచ్‌లు అవస్థలు ఎదుర్కొన్నారు. చాలా గ్రామాల్లో వాటర్‌ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. గోపాల్‌పేట మండలంలో 71లీజుకు బోర్లు తీసుకున్నారు. 92స్కీం బోర్లు పనిచేస్తున్నప్పటికీ తక్కువనీళ్లు వస్తున్నాయి. 324 చేతిపంపులకు 20మాత్రమే పని చేస్తున్నాయి.

     

    ఇదీ పథకం లక్ష్యం

    గ్రామీణ ప్రజలకు సురక్షితమైన కృష్ణాజలాలను అందించాలనే సంకల్పంతో 2003లో రామన్‌పాడు తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో రూ.61కోట్లతో 136 గ్రామాలకు ఈ నీళ్లను అందించాలని ప్రణాళికలు రూపొందించారు. కానీ ముందుగా నిర్దేశించిన పథకం ప్రకారం కల్వకుర్తి నియోజకవర్గానికి నీళ్లు అందించాలన్న లక్ష్యం నెరవేరలేదు. ఈ పథకం వ్యయం ఇప్పటివరకు రూ.90కోట్లపైగా చేరింది. ఈ పథకం ద్వారా వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్‌ నియోజకవర్గాల్లో 120 గ్రామాలకు రామన్‌పాడు నీళ్లు అందిస్తున్నారు. 

      

    10రోజుల్లో సరఫరా పునరుద్ధరణ

    రామన్‌పాడు రిజర్వాయర్‌లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. దెబ్బతిన్న జీఆర్‌పీ, ఎంఎస్‌ పైపుల స్థానంలో డీఐ పైపులను అమర్చుతున్నాం. 8 ప్యాకేజీల పనులూ చివరిదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం వనపర్తి మండలం రాజనగరం వద్ద ఓ రైతు పొలంలో జీఆర్‌పీ పైపుల స్థానంలో డీఐ పైపుల ఏర్పాటుకు ఆటంకం ఏర్పడింది. దీంతో పాటు కొత్తకోట మండలంలో ఎంఎస్‌ స్థానంలో డీఐ పైపుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి మరో పదిరోజుల్లో నీటి సరఫరాను ప్రారంభించారు. 

     – మేఘారెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top