కంట‘తడి’

కంట‘తడి’ - Sakshi


- జిల్లా పర్యటనలో రక్షకతడి ఊసెత్తని సీఎం చంద్రబాబు

- ఉద్యాన రైతుల ఆశలు ఆవిరి

- పండ్ల తోటలకు పెను విపత్తు

- వేలాది ఎకరాల్లో ఎండిపోతున్న తోటలు

- తీవ్ర ఆందోళనలో అన్నదాతలు




అనంతపురం అగ్రికల్చర్‌ : రక్షకతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యాన రైతులకు చివరికి కంటతడే మిగిలింది. పండ్లతోటలను వేసవి విపత్తు నుంచి కాపాడేందుకు రక్షకతడులు ఇస్తామని ఈ నెల 20న జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు ప్రకటిస్తారని రైతులు ఎదురుచూశారు. అయితే ఆయన ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. రక్షకతడులు ఎప్పుడిస్తారంటూ రోజూ ఉద్యానశాఖ అధికారులకు ఫోన్‌ చేస్తూ వచ్చిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీరా సీఎం వచ్చాక ఆ విషయాన్నే మరచిపోయారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసి కూడా జిల్లా మంత్రులు కానీ, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఆయన వద్ద ఆ విషయాన్నే ప్రస్తావించకపోవడం రైతులతో పాటు అధికారులనూ విస్మయానికి గురి చేసింది.



పండ్ల తోటల విషయంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్య ధోరణి ఉద్యాన రైతులను అష్టకష్టాలు, తీవ్ర నష్టాల పాలు చేసే ప్రమాదముంది.  ‘ఫ్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌’గా పేరుగాంచి.. ఉద్యానహబ్‌ దిశగా అడుగులేస్తున్న ‘అనంత’లో ప్రస్తుతం పండ్లతోటల మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా జిల్లాలో 1.71 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో చీనీ, మామిడి, అరటి, దానిమ్మ, సపోటా, బొప్పాయి, జామ, ద్రాక్ష, రేగు, ఆకు, వక్క, కూరగాయలు తదితర పండ్లు, పూలు, ఔషధ తోటలు సాగులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా చీనీ 45 వేల హెక్టార్లు, మామిడి 39 వేల హెక్టార్లలో ఉన్నాయి.



26 మీటర్లకు పైగా పడిపోయిన భూగర్భజలం

ఈ ఏడాది నైరుతితో పాటు ఈశాన్య రుతుపవనాలు కూడా మొహం చాటేయడంతో వర్షం జాడ కరువైపోయింది. వర్షపాతం 42 శాతం తక్కువగా నమోదైంది. పైగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకుతున్నాయి. ఫలితంగా భూగర్భజలాల సగటు మట్టం గతంలో ఎన్నడూ లేని విధంగా  26 మీటర్లకన్నా ఎక్కువ లోతుకు పడిపోయింది. ఇప్పటికే 75 వేలకు పైగా బోరుబావులు ఎండిపోయినట్లు అంచనా. పండ్లతోటలను కాపాడుకునేందుకు కొందరు కొత్త బోర్లు వేయిస్తూ విఫలమవుతున్నారు. మరికొందరు ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నా పూర్తిస్థాయిలో రక్షించుకోలేకపోతున్నారు. అధికారికంగా ఇప్పటికే ఐదు వేల ఎకరాల్లో చీనీ తోటలు, మూడు వేల ఎకరాల్లో మామిడి తోటలు ఎండినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. అనధికారికంగా 12వేల ఎకరాల్లో చీనీ, ఏడు వేల ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే పరిస్థితి ఉండటంతో పండ్లతోటలు పెద్దఎత్తున ఎండిపోయే ప్రమాదముంది.



ఆశలు రేకెత్తించి.. ఆపై నీళ్లు చల్లారు

ఈ వేసవిలో చీనీ, మామిడి తోటలకు రక్షకతడి ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యానశాఖ అధికారులు ఆశలు రేకెత్తించారు. కనీసం 20 వేల ఎకరాలకు రక్షకతడి ఇవ్వడానికి రూ.42 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి, ఉద్యాన శాఖ కమిషనరేట్‌కు ప్రతిపాదనలు కూడా పంపారు. చీనీతోటలకైతే ఎకరాకు నెలకు రూ.6,400, మామిడికైతే రూ.3,600 ఇవ్వాలని ప్రతిపాదించారు. సీఎం జిల్లా పర్యటనలో రక్షకతడికి గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తారని అంతా భావించారు. అయితే..చివరకు చేదు అనుభవమే ఎదురైంది. పండ్లతోటల గురించి సీఎం తన ప్రసంగంలో ఎక్కడా ప్రస్తావించలేదు. అధికారుల ప్రతిపాదనలకు కూడా ఉద్యాన కమిషనరేట్‌ నుంచి సానుకూల స్పందన రాలేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top