నష్టాల్లో రాజంపేట ఆర్టీసీ

నష్టాల్లో రాజంపేట ఆర్టీసీ


రాజంపేట: రాజంపేట ఆర్టీసీ డిపో రూ.10.80కోట్ల నష్టానికి చేరుకుంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకు సంబంధించి రాజంపేటలో ఆర్టీసీ డిపో ఉంది. కిలోమీటరకు రూ.27.11 ఆదాయం వస్తున్నప్పటికి ఖర్చు రూ.35.78 వస్తోంది. దీన్ని బట్టి కిలోమీటరకు రూ.8.67 నష్టం వస్తోంది. ఈ విధమైన రీతిలో రాజంపేట డిపో ఆర్టీసీ నడుస్తోంది.



తెలుగువెలుగుకు ఆటోల తాకిడి..: రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పరిధిలో చాలా ప్రాంతాలకు నడిచే తెలుగువెలుగు బస్సులకు ఆటోల తాకిడి అధికమైంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం క్రమక్రమంగా నైట్‌హాల్ట్‌ బస్సులతో పాటు కొన్ని బస్సులను రద్దు చేసుకుంది. ఉదాహరణకు తొగురుపేట, నందలూరు ఆర్‌ఎస్‌ బస్సులు ఉన్నాయి.  మారుమూల గ్రామాలకు ఆటోల తాకిడితో ఈ బస్సులను ఆర్టీసీ నడపడం మానేసింది.



తగ్గిపోతున్న సర్వీసులు..: రాజంపేట డిపోలో ఒకప్పుడు 124 సర్వీసులకుపైగా ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 80కి చేరింది. అద్దెబస్సులు 30 వరకు నడుస్తున్నాయి. నష్టాలు వస్తున్నాయని ఆర్టీసీ యాజమాన్యం బస్సులను ఉపసంహరించుకుంటోంది. సర్వీసులు తగ్గిపోతున్న క్రమంలో ఉన్న కార్మికులకు డ్యూటీ చార్ట్‌లో విధులకన్నా..విశ్రాంతి అధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి.



కోట్లు విలువచేసే స్థలం ఉన్నా..: డిపోకు కోట్ల రూపాయలు విలువజేసే రెండు ఎకరాలకు పైగా నిరుపయోగంగా ఉంది. ఈ ఆస్తులను వాడకంలోకి తెచ్చి ఆర్టీసీ డిపో లాభాల బాటలో పయనించేందుకు ప్రయత్నాలు సాగించింది. ఖాళీ స్థలంలో సర్వే నిర్వహించి ప్లాట్స్‌కూడా వేసింది. ఇప్పుడున్న స్థలంలో ఒకే ఒక షాపు మాత్రం ఏర్పాటైంది. మిగిలిన ప్లాట్స్‌ ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.



కనుమరుగవుతున్న ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు...: రాజంపేట డిపో పరిధిలో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు కననుమరుగవుతున్నాయి. కలెక్షన్‌ రావ డం లేదనే సాకుతో నెల్లూరు, విజయవాడ, చెన్నై ప్రాంతాలకు నడిచే బస్సులను నిలిపివేశారు. కడప–రాజంపేట పాతబస్టాండు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును కూడా ఎత్తివేశారు. ప్రస్తుతం కేవలం విజయవాడ, బెంగళూరు, హైదరాబాదుకు నడుస్తున్నాయి. విజయవాడకు అద్దెబస్సును నడిపిస్తున్నారు.



30మంది రాయచోటికి బదిలీ..: రాజంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న 30 మందిని రాయచోటి డిపోకు బదిలీ అయినట్లుగా  సమాచారం. ఈ బదిలీకి ప్రధానంగా ఈ డిపోలో సర్వీసులు తగ్గిపోవడమేనని కార్మికవర్గాలు వాపోతున్నాయి. నడుస్తున్న సర్వీసుల కన్నా అధికంగా సిబ్బంది ఉండటం వల్లనే బదిలీకి ఆర్టీసీ ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. కాగా ఇటీవల ఈడీ కూడా డిపోకు వచ్చి ఆర్టీస్టీ పురోగతికి సంబంధించి పలు అంశాలపై ఆరా తీశారు. అధికారులతో చర్చించారు.



కేఎంపీఎల్‌ సాధించడంలో జోన్‌లో అగ్రస్థానం..: డిపో నష్టాల్లో నడుస్తున్నప్పటికీ కేఎంపీఎల్‌ సాధించడంలో ఆర్టీసీ జోన్‌లోని అగ్ర స్థానంలో ఉంది. రాజంపేట డిపో మేనేజరుగా ఎంవీకృష్ణారెడ్డి బాధ్యతలు తీసుకన్నప్పటి నుంచి ఆర్టీసీని లాభాలబాటలో నడిపించాలని విశేష కృషి సలుపుతున్నారు. డిపోలో తొలిసారిగా కెఎంపీఎల్‌ సాధించడంలో సఫలీకృతులయ్యారు. ఇటీవల డిపో నష్టాలను తగ్గించుకునేందుకు అనేక ఆదాయమార్గాలను అన్వేషించుకుంటున్నారు. ఆర్టీసీ ఆలయాల దర్శనం, ముఖ్యమైన ఉత్సవాలకు బస్సులను నడిపించడంలో కార్మికుల సహకారంతో ముందుకెళుతున్నారు.



డిపో నష్టాల్లో నడుస్తోంది..: రాజంపేట డిపో నష్టం పది కోట్ల రూపాయలకు చేరుకుంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా వస్తోంది. నష్టాల నంచి బయటపడేందుకు కార్మికులు, ఉద్యోగుల సహకారంతో కృషి చేస్తున్నాం. చాలా రూట్లలో కలెక్షన్‌ రాకపోవడం వల్ల బస్సులను తిప్పలేకపోయే పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. --- ఎంవీ కృష్ణారెడ్డి, మేనేజరు, రాజంపేట డిపో

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top