అతలాకుతలం గాలివాన బీభత్సం

అతలాకుతలం గాలివాన బీభత్సం - Sakshi


ఈదురు గాలులకు కూలిన పెంకుటిళ్లు,

చెట్లు, విద్యుత్ స్తంభాలు

సిర్గాపూర్‌లో పిడుగుపాటుకు రైతు మృతి

పలుచోట్ల వడగళ్ల వాన


 జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలులు, వడగళ్ల వానకు అపార నష్టం జరిగింది. గజ్వేల్, తొగుట, దౌల్తాబాద్, మిరుదొడ్డి, సంగారెడ్డి, నారాయణఖేడ్, కంగ్టి, కల్హేర్ మండలాల్లో మంగళవారం సాయంత్రం వర్షం కురిసింది. పలుచోట్ల పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలగా... వరి పంట నేలవాలింది. అక్కడక్కడా విద్యుత్ తీగలు తెగిపోవడంతో అంధకారం నెలకొంది. కల్హేర్ మండలం సిర్గాపూర్‌లో పిడుగుపాటుకు రైతు మృతి చెందగా నారాయణఖేడ్‌లో పెంకుటిల్లు కూలడంతో చిన్నారితోపాటు వృద్ధురాలి గాయాలయ్యాయి. కంగ్టి మండలం నాగన్‌పల్లిలో తొమ్మిది పశువులు మృత్యువాత పడ్డాయి. దౌల్తాబాద్‌లో వడగళ్ల వానకు పలు సబ్‌స్టేషన్లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  - సాక్షి నెట్‌వర్క్


నారాయణఖేడ్‌లో

నారాయణఖేడ్‌లోని మంగల్‌పేట్‌లో మంగళవారం భారీ వర్షానికి గంగాధర్‌కు చెందిన పాత పెంకుటిల్లు ఒక్కసారిగా కూలిపోయింది. ఇంట్లో అద్దె కు ఉంటున్న మల్లవ్వ (65), అమ్ము లు(5)కు స్వల్ప గాయాలయ్యాయి. మల్లవ్వ అంధురాలు కావడంతో కూతురు సుజాత తన ఐదేళ్ల పాపను ఇంట్లో పెట్టి సుజాత తాళం వేసి బయటకు వెళ్లింది. కొద్దిసేపటికి ఇల్లు కూలిపోయింది. స్థానికులు గమనించి ఇంటికి వేసిన తాళం పగులగొట్టి గాయపడిన వృద్ధురాలు, బాలికను 108లో నారాయణఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


 తొగుటలో

తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం కురిసిన గాలి వానకు దళితవాడలో చెట్లు విరిగి విద్యుత్ వైర్లపై పడ్డాయి. భారీ వృక్షం ఇంటిపై పడడంతో పాక్షికంగా దెబ్బతింది. పంటలకు తీవ్ర నష్టం కలిగింది. వెంకట్రావ్‌పేట, పల్లెపహడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామా ల్లో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.


 గజ్వేల్‌లో

గజ్వేల్ నియోజకవర్గంలో మంగళవారం భారీ వర్షం పడింది. గాలి తీవ్రతకు విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కొన్ని గ్రామాల్లో అంధకారం నెలకొంది. గజ్వేల్ మార్కెట్‌యార్డులో ధాన్యం తడిసిపోయింది. పట్టణంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద చెట్టు విరిగిపడింది. ప్రజ్ఞాపూర్‌లో హోర్డింగ్‌లు నేల కూలింది. పలు గ్రామాల్లో రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు దెబ్బతిన్నాయి


 దౌల్తాబాద్‌లో

దౌల్తాబాద్ మండలంలో వడగళ్ల వాన పడింది. మంగళవారం సాయంత్రం కురిసిన వానకు పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. పంటలు దెబ్బతిన్నాయి. తిమ్మక్కపల్లి, అనాజీపూర్, మంతూరు గ్రామాల్లో వరి పంట దెబ్బతింది. మంతూరులో చెట్లు నేలకొరిగాయి. అనాజీపూర్, రాయపోలు, దొమ్మాట, ముబారస్‌పూర్, దౌల్తాబాద్, మహ్మద్‌షాపూర్ 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలకు సరఫరా నిలిచిపోయింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top