ఆరుద్ర వచ్చినా .. అర ఇంచు తేమలేదు!

ఆరుద్ర వచ్చినా .. అర ఇంచు తేమలేదు! - Sakshi


ఊరిస్తున్న మేఘాలు

తరిమేస్తున్న గాలులు

చిరుజల్లులతో సరిపెడుతున్న వరుణుడు

వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులు




రుతుపవనాల ఆరంభంలో మురిపించిన వర్షాలు...  అసలు సమయంలో ముసుగేశాయి.  కారుమబ్బులు కమ్ముకొస్తున్నాయే తప్ప.. చినుకు జాడ లేకుండా పోయింది. కోటి ఆశలతో ఖరీఫ్‌ పంట సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలను మేఘాలు ఊరిస్తున్నాయే కానీ.. ఊరటనివ్వడం లేదు. బలంగా వీస్తున్న గాలుల ప్రభావానికి చిరు జల్లులతోనే వరుణుడు సరిపెడుతున్నాడు.  మృగశిర వెళ్లి గురువారం ఆరుద్రకార్తె వచ్చినా పొలాల్లో అర ఇంచు తేమలేని పరిస్థితి నెలకొంది.

- గుమ్మఘట్ట (రాయదుర్గం)



ఈ ఏడాది రుతుపవనాల ప్రభావంతో సకాలంలో వర్షాలు మొదలైనప్పటికీ పంట విత్తు సమయానికి ముఖం చాటేశాయి. వారం పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఊరిస్తున్న మేఘాలు చిరుజల్లులకే పరిమితమయ్యాయి. గాలి వేగం తగ్గకపోతే ఆరుద్ర కార్తెలోనూ విత్తనం వేయడం కష్టమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



వరుణుడి కోసం ఎదురుచూపు

వర్షాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్నా.. ఇప్పటి  వరకూ పదును వర్షం ఒక్కసారి మాత్రమే కురిసింది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో భూములను రైతులు దుక్కి చేసి విత్తు వేయడానికి సిద్ధమయ్యారు. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 57 వేల హెక్టార్లలో వేరుశనగ విత్తుకునేందుకు రైతులు సర్వమూ సిద్ధం చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో వర్షం కురవకపోతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత ఖరీఫ్‌ చేదు అనుభవాలను గుర్తు చేసుకుని ఈ సారి పంట సాగుకు భయపడుతున్నారు. అదను దాటకముందే వర్షం కురవాలని దేవుళ్లను మొక్కుకుంటున్నారు.  ఈ సారి పంటలు పండితే తప్ప.. కోలుకోలేని పరిస్థితి ఉండడంతో జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో వర్షాల కోసం చేయని పూజలు, హోమాలు అంటూ లేవు. మూఢ నమ్మకాలతో కప్పల ఊరేగింపు.. గాడిదల పెళ్లిలూ చేస్తున్నారు.



విత్తుకు సర్వం సిద్దం చేశాం

ఆరు ఎకరాల పొలాన్ని దుక్కి, చేసి విత్తుకు సిద్ధం చేశాం. ఆరుద్ర కార్తెలో విత్తితే ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందనే నమ్మకం. నాలుగు పల్లాల విత్తనాలు, ఎరువులు కొనిపెట్టాను. విత్తనం వేయక ముందే ఎకరాకు రూ.15 వేలు ఖర్చు వచ్చింది. రోజూ వర్షం వస్తుందని ఆశంగా ఆకాశం వైపు చూస్తున్నాం. గాలి జోరుగా ఉండడంతో మేఘాలు చెల్లాచెదరైపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

– నాగిరెడ్డి, రైతు, కోనాపురం

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top