అనంతపురానికి రెయిన్‌ గన్స్‌

అనంతపురానికి రెయిన్‌ గన్స్‌ - Sakshi

గుంటూరు వెస్ట్‌ : అనంతపురం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నుంచి 754 రెయిన్‌గన్స్‌ను తరలిస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తెలిపారు. నగరంలోని ఆర్‌ అండ్‌ బీ ఇన్‌స్పెక్షన్‌ బంగ్లాలో స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుతో సోమవారం సమావేశమైన కలెక్టర్‌ అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 24, 25, 26 తేదీల్లో కురిసిన వర్షాల వల్ల జిల్లాలోని 51 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కావడంతో పంటలకు ఉపయోగకరంగా మారాయని చెప్పారు. మాచర్ల, వెల్దుర్తి, పెదకూరపాడు తదితర పల్నాడు ప్రాంత మండలాల్లో అక్కడక్కడా తక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల రెయిన్‌గన్స్‌తో పంటలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 

 

స్పెషలాఫీసర్‌గా నాగలక్ష్మి...

అనంతపురం జిల్లాలో వర్షాభావ ప్రాంతాలలో అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్‌ ఎస్‌.నాగలక్ష్మిని స్పెషలాఫీసర్‌గా నియమించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా నుంచి రెయిన్‌గన్స్, స్ప్రింక్లర్లు, ఆయిల్‌ ఇంజన్లను అనంతపురం జిల్లాకు తరలించి అక్కడి పంటలను కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. సుమారు 150 నీటి ట్యాంకర్లను కూడా ఇక్కడినుంచి పంపిస్తున్నట్లు కలెక్టర్‌ చెప్పారు. 

 

అధికారులతో కోడెల సమావేశం..

స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్, ఆర్‌డబ్లు్యఎస్‌ ఎస్‌ఈ పి.భానువీరప్రసాద్, సత్తెనపల్లి, నరసరా>వుపేట నియోజకవర్గాలకు చెందిన డీఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించి మంచినీటి సరఫరా స్కీమ్‌ల నిర్వహణపై చర్చించారు. వనం– మనం మొక్కల పెంపకాన్ని వేగవంతం చేయాలని జిల్లా అటవీ శాఖాధికారులు కె.మోహనరావు, పి.రామమోహనరావు, డ్వామా పీడీ పులి శ్రీనివాసులును కోరారు. 

 

754 రెయిన్‌గన్స్‌ తరలింపు : జేడీఏ కృపాదాసు

కొరిటె పాడు (గుంటూరు): జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన 754 రెయిన్‌గన్స్, 754 స్ప్రింక్లర్లను అనంతపురం జిల్లాకు తరలిస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుడు వి.డి.వి.కృపాదాసు చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌ ఆవరణలోని జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో కరువు తాండవిస్తుండడంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వాటిని అక్కడకు పంపుతున్నామన్నారు. జిల్లాలో గత ఐదు రోజులుగా 157.7 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 47 శాతం మాత్రమే పంటలు సాగు చేశారని, ఈ వర్షాలకు మిగిలిన రైతులు కూడా సాగు చేసుకునే అవకాశం వుందని తెలిపారు. ప్రతి రైతు తన పొలంలో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top