దారుల మూత.. నేతల నిర్బంధం

దారుల మూత.. నేతల నిర్బంధం - Sakshi


♦ ఎయిర్‌పోర్టులో రఘువీరా, చిరంజీవి అరెస్టు, విడుదల

♦ విమానాశ్రయంలోనే బొత్స, ఉమ్మారెడ్డిల నిర్బంధం

♦ హోటల్ నుంచి దాసరిని కదలనీయని పోలీసులు

 

 సాక్షి ప్రతినిధి, కాకినాడ/కిర్లంపూడి: ఆమరణ నిరాహార దీక్షలో ఉన్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు, సంఘీభావం తెలిపేందుకు కిర్లంపూడి వస్తున్న ప్రతిపక్ష నేతలను రాష్ర్టప్రభుత్వం అడుగడుగునా ఆటంకపరిచింది. తూర్పుగోదావరి జిల్లా మధురపూడి విమానాశ్రయంలో వారిని నిర్బంధించింది. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవిలను అక్కడే అరెస్టు చేసి ఆ తర్వాత విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును కూడా విమానాశ్రయంలోనే పోలీసులు నిర్బంధించారు. హైదరాబాద్ నుంచి కిర్లంపూడి వస్తున్న కేంద్ర మాజీ మంత్రి దాసరినారాయణరావును అడుగడుగునా అడ్డుకున్నారు. కిర్లంపూడికి దారితీసే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. కిర్లంపూడి వెళ్లేందుకు రాజమహేంద్రవరం వచ్చి ఓ హోటల్‌లో బస చేసిన దాసరిని పోలీసులు బయటకు రానీయలేదు. దీనిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేనేమన్నా ఉగ్రవాదినా’ అని ఆయన మీడియా వద్ద వాపోయా రు. సాయంత్రం దాసరి కిర్లంపూడిలో ముద్రగడను కలిసివెళ్లారు. ప్రభుత్వ తీరుపై చిరంజీవి తీవ్రంగా స్పందించారు. ‘మమ్మల్ని నిర్బంధిం చే హక్కు ఎవరు ఇచ్చారు’ అని ప్రశ్నించారు.



 విమానాశ్రయంలోనే ...: వైఎస్సార్‌సీపీ శాసనమండలి పక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ సీనియర్ నేత బొత్సలను విమానాశ్రయంలో పోలీసులు నిర్బంధించారు. దీనిపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ దీక్ష విరమించిన తర్వాత గానీ వారిని వదలలేదు. అక్కడ నుంచి బొత్స విజయనగరం, ఉమ్మారెడ్డి గుంటూరు బయలుదేరి వెళ్లారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top