విద్యార్థులపై ఒక్క దెబ్బపడినా

విద్యార్థులపై ఒక్క దెబ్బపడినా - Sakshi


నిరాహార దీక్ష చేస్తా

సాక్షి, సిటీబ్యూరో: రోహిత్‌ స్థూపాన్ని సైతం జైల్లో బంధించినట్టు బంధించి, నా కొడుకుకి నేను నివాళ్లర్పించకుండా అడ్డుకోవడం ఇదెక్కడి న్యాయం అని రోహిత్‌ తల్లి రాధిక సూటిగా ప్రశ్నించారు. సెంట్రల్‌ యూనివర్సిటీలోకి ఎవరినీ అనుమతించకుండా, ఓ వైపు పోలీసులు, మరోవైపు ఫైరింజన్లు పెట్టి ఇక్కడేదో పెద్ద గొడవ జరగబోతున్నట్టు పోలీసులు చిత్రీకరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రోహిత్‌ వర్ధంతి సభను కులనిర్మూలనా దినంగా ప్రకటిస్తూ కులనిర్మూలనా పోరాట సమితి నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడారు. ఇంత నిర్బంధం మధ్య హెచ్‌సీయూ విద్యార్థులు సమానత్వం కోసం పోరాడుతున్నారు.



వారికి అండగా నేను అక్కడికే వెళ్తున్నాను. ఏ విద్యార్థిపైనైనా ఒక్క లాఠీ దెబ్బ పడినా నేను నిరాహార దీక్ష చేస్తాను అని రాధిక హెచ్చరించారు. ‘నా కొడుకు రోహిత్‌ విగ్రహానికి దండ వేసి, నివాళులర్పించే వరకు నాకు అండగా ఉండాలని’ ఆమె కోరారు. చాలా మాట్లాడాలని ఉందని, ఈ ఒత్తిడితో మాట్లాడలేకపోతున్నానని, అనారోగ్యం ఉన్నా విద్యార్థులకు, పోరాటాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలియజేయడానికే ఇక్కడికి వచ్చానని రాధిక అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ కెవై రత్నం, ప్రొఫెసర్‌ లక్ష్మినారాయణ, ప్రొఫెసర్‌ సూరేపల్లి సుజాత. ప్రొఫెసర్‌ విజయ్, సతీష్, బిజూ మాచ్యూస్‌ తదితరులు మాట్లాడారు.



దుఃఖానికి సైతం ఆంక్షలా: శేషు

అంబేడ్కర్‌ భావజాలం పునాదిగా సమసమాజాన్ని కోరుకున్న రోహిత్‌ అనంతర ఉద్యమం చారిత్రాత్మకమైందన్నారు. రోహిత్‌ తల్లి రాధికమ్మ కొడుకు మరణంలోని దుఃఖాన్ని సైతం ప్రకటించుకునే స్వేచ్ఛ ఈ దేశంలో లేదని అన్నారు. దుఃఖానికి సైతం ఆంక్షలు విధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోహిత్‌ దోషులను శిక్షించాలని యావత్‌ సమాజం కోరకుంటుంటే.. దోషులకు అవార్డులు ప్రకటించి గౌరవిస్తున్నారని, సైన్స్‌ జీనియస్‌గా కితాబులిస్తున్నారని, పరిశోధనా వ్యాసాలు కాపీ కొట్టిన వ్యక్తికి, ఓ హంతకుడికి అవార్డులా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top