ప్రమాదంలో ప్రజారోగ్యం


పుట్టపర్తి అర్బన్‌: ప్రజల ఆరోగ్యాన్ని అధికారులు విస్మరించారు.  మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావుల్లో నీళ్లు నిల్వ ఉండి విషం చిమ్ముతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎటువంటి పారిశుద్ధ్య చర్యలు తీసుకోకపోవడంతో దోమలు పెరిగి వ్యాధులు ప్రబలుతున్నాయని వాపోతున్నారు. వర్షాకాలంలో వాన నీటితో నిండిన పాడుబావులు చెత్తాచెదారంతో కుళ్లి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. ముఖ్యంగా అటవీ గ్రామాలైన సాతార్లపల్లి, దిగువచెర్లోపల్లి, వెంగళమ్మచెరువు, వెంకటగారిపల్లి కాలనీలలో పాడుబడిన బావులతో పాటు గతంలో తాగునీళ్లు అందించిన చేదబావులు సైతం చెత్తాచెదారం నిండి దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. దీంతో అనారోగ్యాలతో ఒళ్లు గుల్లవుతోందని ఆర్థిక పరిస్థితి దిగజారుతోందని వారు వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నీరు–చెట్టు కార్యక్రమంలో చెరువుల్లోని మట్టి తోలి పలు బావులు, గుంతలను మూసివేసింది. దీంతో ఆయా స్థలాలు అందుబాటులోకి వచ్చాయి. పాడుబడిన బావులతో అనారోగ్యమే గాక చిన్న పిల్లలకు ప్రమాదకరంగా మారాయి. ఇళ్ల మధ్య ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి ఎక్కడ పడిపోతారోనన్న ఆందోళన కూడా ప్రజల్లో నెలకొని ఉంది. ఇటీవల దిగువచెర్లోపల్లి గ్రామంలో రోడ్డు పక్కనే పాడుబావి ఉండడంతో ట్రాక్టర్‌ అదుపుతప్పి బావిలో పడి దెబ్బతింది. అదృష్టవశాత్తు డ్రైవర్‌ తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు స్పందించి గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉన్న పాడుబడిన బావులను గుర్తించి మట్టితో మూసి వేయాలని గ్రామీణులు కోరుతున్నారు. 

గ్రామస్తులు ముందుకు 

రావాలి

పాడుబడిన బావులు, నిరుపయోగంగా ఉన్న గుంతలు గ్రామాల్లో ఉంటే గ్రామస్తులు రాత పూర్వకంగా ఇస్తే పూడ్చి వేయడానికి చర్యలు తీసుకుంటాం. చాలా గ్రామాల్లో అటువంటివి ప్రమాదకరంగా ఉన్నాయి. 

– జమునాబాయి, ఇరిగేషన్‌ జేఈ 

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top