నాలుగు లేన్ల రహదారికి ప్రతిపాదనలు

దెబ్బతిన్న చెక్‌పోస్టు–సఫా కళాశాల రహదారి

– నంద్యాల చెక్‌ పోస్టు నుంచి సఫా కాలేజీ వరకు

– రూ. 22.5 కోట్లతో నివేదిక

– మరికొన్ని రహదారులకు ప్రతిపాదనలు

 

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరంలోని నంద్యాల చెక్‌ పోస్టు నుంచి సఫా ఇంజినీరింగ్‌ కళాశాల వరకు ఉన్న నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి అర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రహదారి తీవ్రంగా దెబ్బదినడంతో ప్రమాదాలకు నిలయమైంది. పలుమార్లు ప్యాచ్‌ వర్కులు చేపట్టారు. అయినా రహదారి పరిస్థితి అధ్వానంగా ఉండడంతో శాశ్వత ప్రతిపాదికన నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు అర్‌అండ్‌బీ అధికారులు నంద్యాల చెక్‌ పోస్టు నుంచి సఫా కళాశాల వరకు మొత్తం 6.5 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని రూ. 22.5 కోట్లతో చేపట్టేందుకు ప్రతిపాదలను సిద్ధం చేశారు. ఇందుకు ఈఎన్‌సీ(ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌) ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించారు. త్వరలోనే ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసే అవకాశం అధికంగా ఉందని అసిస్టెంటు ఇంజినీరు ఫణిరాము తెలిపారు.

 

మరికొన్ని  రహదారుల కోసం ప్రతిపాదనలు..

ఉల్చాల–రేమట–కొత్తకోట రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా ఏళ్ల నుంచి రహదారి పరిస్థితి మారకపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. ఈ నేపథ్యంలో  రహదారి బాగా దెబ్బతిన్న ప్రదేశాల్లో మొత్తం ఏడు కిలోమీటర్ల మేర నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు.

 

– కర్నూలు–లక్ష్మీపురం రహదారిలో రెండు కిలోమీటర్లు, అనుగొండ–లక్ష్మీపురంలో రహదారిలో రెండు కిలోమీటర్లు, ఓర్వకల్లు–గుంబాయ్‌తండా రహదారిలో నాలుగు కిలోమీటర్లు, ఓర్వకల్లు–చింతలపల్లి రహదారిలో దెబ్బతిన్న 6 కిలోమీటర్ల వ్యవధిలో నూతన రహదారుల నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఏఈ వివరించారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top