ప్రాజెక్టులకు ప్రాణదాత వైఎస్‌ఆర్‌

ప్రాజెక్టులకు ప్రాణదాత వైఎస్‌ఆర్‌ - Sakshi


– ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

పులివెందుల : రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ప్రాణదాత దివంగత మహానేత వైఎస్‌రాజశేఖరరెడ్డి అని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం భాకరాపురంలోని వైఎస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన జలయజ్ఞం ఫలితంగా ఎన్నో ప్రాజెక్టులు ప్రాణం పోసుకున్నాయన్నారు. గాలేరు – నగరి సుజల స్రవంతి పథకంలో ముందు గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం లేదన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక పులివెందుల ప్రాంతానికి తాగు, సాగునీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందన్నారు. పైడిపాలెం ప్రాజెక్టులో 6టీఎంసీల నీరు నింపి తొండూరు, సింహాద్రిపురం, కొండాపురం మండలాల్లోని చెరువులను నింపి 47,500ఎకరాలకు సాగునీటితో పాటు పీబీసీ కింద 41వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, పలు గ్రామాలకు తాగునీరు అందించాలనేది ఆ మహానేత వైఎస్‌ఆర్‌ ముఖ్య ఉద్దేశమన్నారు.పైడిపాలెం ప్రాజెక్టు అంచనా విలువ రూ.727కోట్లలో ఆయన మరణించే నాటికి రూ.667కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. వైఎస్‌ఆర్‌ గండికోట లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను శరవేగంగా చేయించడంవల్లే పైడిపాలెం ప్రాజెక్టు సాధ్యపడిన మాట టీడీపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ ఐదేళ్ల కాలంలో గాలేరు – నగరి కోసం రూ.3916 కోట్లు ఖర్చు చేశారన్నారు. మొదటి దశలో భాగమైన అవుకు నుంచి గండికోటకు వరద కాలువ, గండికోట రిజర్వాయర్, టన్నెల్, వామికొండ, సర్వరాయ సాగర్‌ పనులు 85శాతం పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ నాయకులు గండికోట ముంపు వాసులకు పునరావాస ప్యాకేజీ ఇవ్వకుండానే నీళ్లు  ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించారు.




 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top