ప్రగతిపథం

ప్రగతిపథం


పెద్దపల్లి: ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథను చేపట్టినట్లు శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో రూ.190 కోట్లతో ఇంట్రావిలేజ్‌ కింద 443 పనులు మంజూరయ్యాయని, డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేస్తామన్నారు. అలాగే జిల్లాలోని 443 ఆవాస ప్రాంతాలకు తాగునీరందించేందుకు ఇప్పటివరకు 831.18 కి.మీ పరిధిలో పైప్‌లైన్ల నిర్మాణం పూర్తి చేశామని, మిగిలిన 172.55 కి.మీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ మొదటి విడుతలో రూ.50.5 కోట్లతో 120 చెరువులకు గాను, 116 చెరువుల పనులు చేపట్టామని, అందులో 113  పూర్తయ్యాయన్నారు. మిగతా చెరువుల పనులు తుదిదశలో ఉన్నాయన్నారు. రెండోవిడుతలో రూ.78.91 కోట్లతో 235 చెరువులకు గాను 97  పూర్తయ్యాయన్నారు. మూడోవిడుతలో 104 చెరువులను ఆమోదం కోసం పంపించామన్నారు.



జూన్‌ నాటికి కాళేశ్వర అనుబంధ నిర్మాణాలు పూర్తి

సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని, అందులో భాగంగా కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో రూ. 1248.27 కోట్లతో సుందిల్ల బ్యారేజీ, రూ.1737.56 కోట్లతో సుందిల్ల పంప్‌హౌజ్, రూ. 1669.23 కోట్లతో అన్నారం లిఫ్ట్‌ సిస్టం నిర్మాణాలను వచ్చే జూన్‌లోగా పూర్తి చేస్తామన్నారు.  స్వచ్ఛ భార™Œ లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు రూ.4.4కోట్ల అంచనాలతో 36,640 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు కాగా, 15,000 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేశామన్నారు. 5,101 మరుగుదొడ్ల నిర్మాణం వివిధ దశలో ఉన్నాయన్నారు. 80శాతం ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు.



విత్తనభండాగారంగా జిల్లా..: జిల్లాలో వరి విత్తనోత్పత్తికి అనువైన పరిస్థితులు ఉన్నందున వ్యవసాయ శాఖ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తనోత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసి, జిల్లాను తెలంగాణ విత్తన భాండాగారంగా చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. ఖరీఫ్‌కు 42,554 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం కాగా,  34,961 మెట్రిక్‌ టన్నుల వివిధ ఎరువులు నిల్వ ఉంచామన్నారు. ఈ వానాకాలం పంటకి రూ. 990 కోట్లు రాయితీపై రైతులకు 10,499 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సరఫరా చేశామన్నారు. రైతు సమగ్ర సర్వే ద్వారా 1,01,725 రైతుల వివరాలు సేకరించడం జరిగిందని,  సాగు సాయం కింద ఎకరాకు రూ.8వేలు రెండు పంటలకు కలిపి అందించే పథకానికి ఏర్పాట్లు చేశామన్నారు. సేకరించిన రైతు వివరాల ద్వారా రైతు వేదికల నిర్మాణానికి రూ. 15లక్షలతో ప్రతిపాదనలు చేశామని, 47 రైతు వేదికలను నిర్మిస్తామన్నారు.



ఉద్యానవన శాఖ ద్వారా బిందు, తుంపర్ల సేద్య పరికరాలకై గత ఆర్థిక సంవత్సరంలో 536.97 హెక్టార్లకు రూ. 4.5కోట్ల సబ్సిడీ ఇచ్చామన్నారు. ఈ ఏడాది 1043 హెక్టార్లకు రూ. 921.81 లక్షల ఆర్థిక లక్ష్యం నిర్ధేశించామని, గ్రీన్‌హౌస్‌ నిర్మాణానికి 75శాతం రాయితీ ఇస్తామన్నారు.  2016–17లో డీ–83, డీ–86 ద్వారా యాసంగి సీజన్‌లో 1.15లక్షల ఎకరాలకు సాగునీరందించామన్నారు. దీనితో జిల్లాలో అత్యధికంగా 3,83,110 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యం దిగుబడి సాధించామన్నారు. రైతులకు సాయిల్‌ హెల్త్‌కార్డులు అందిస్తామన్నారు. 77,281 మంది రైతులకు ఆఖరి విడత విడుదలతో కలిపి మొత్తం రూ.365కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. గత సంవత్సరం వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.కోటితో 16 పెద్ద, 11 చిన్న ట్రాక్టర్లను రైతులకు అందించామని, ఈ ఏడాది రూ.7కోట్లతో ఈ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.



58,755 మంది రైతులు సాదాబైనామా దరఖాస్తు చేసుకోగా, 54,735 దరఖాస్తులను పరిశీలించి, 43,208 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారన్నారు. 11,489 దరఖాస్తులను ఆమోదించి 7,964 దరఖాస్తులను ముటేషన్‌ కోసం ఉత్తర్వులు జారీ చేశామన్నారు. గొర్రెల యూనిట్ల పంపిణీ పథకంలో 10,556 మంది లబ్ధిదారులు ఎంపిక కాగా,ఇప్పటివరకు రూ. 5.71 కోట్ల వ్యయంతో 474 మందికి 9,933 గొర్రెలను పంపిణీ చేశామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10,510 లబ్ధిదారులను ఎంపిక చేసి, గొర్రెల యూనిట్లను అందిస్తామన్నారు. మత్స్య అభివృద్ధి సంస్థ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని నీటి వనరులలో 1.14 కోట్ల చేప పిల్లలను వంద శాతం రాయితీతో విడుదల చేయడం కోసం ఏర్పాట్లు చేశామన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రూ. 29.12 కోట్లు కేటాయించామన్నారు.



785 కేసీఆర్‌ కిట్స్‌ పంపిణీ: జిల్లాలో ఇప్పటివరకు 785 కేసీఆర్‌ కిట్స్‌ పంపిణి చేశామన్నారు. జూన్‌ 3న ప్రారంభించిన ఈ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణిగా నమోదు చేసుకున్న మహిళలకు మగ శిశువు జన్మిస్తే రూ. 12వేలు, ఆడపిల్ల పుడితే రూ. 13వేలు వాయిదా పద్దతులతో పాటు 15 వస్తువులు గల కేసీఆర్‌ కిట్‌ని అందిస్తున్నామన్నారు.

పారిశ్రామిక ప్రగతి: యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన టీఎస్‌ ఐపాస్‌ పాలసీ ద్వారా జిల్లాలో రూ. 925.34 కోట్ల పెట్టుబడితో 90 యూనిట్లకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. వీటి ద్వారా 828 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. వీటిలో 53 యూనిట్లు వాటి కార్యకలాపాలు ప్రారంభించాయని, 17 యూనిట్లు ప్రారంభదశలో ఉన్నాయన్నారు.



 జిల్లాలో 1,99,825 కుటుంబాలకు ఆహార భద్రతకార్డులు, 12,418  కుటుంబాలకు అంత్యోదయ ఆహారభద్రతకార్డులు, 184 కుటుంబాలకు అన్నపూర్ణ కార్డులున్న మొత్తం 2,12,427 కుటుంబాలకు రేషన్‌ బియ్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున అంత్యోదయ, ఆహారభద్రతకార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 35 కిలోల బియ్యాన్ని రూపాయికే సరఫరా చేస్తున్నామన్నారు. అన్నపూర్ణ కార్డు కలిగి ఉన్న కుటుంబానికి పది కిలోల చొప్పున ఉచితంగా మొత్తం 39,730.92 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయడం జరుగుతుందన్నారు.



ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు మూడు కేజీబీవీ, ఒక అర్బన్‌ రెసిడెన్షియల్, 2 బీసీ రెసిడెన్షియల్,ఒకæ మైనార్టీ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలను ప్రారంభించామన్నారు. జిల్లాలోని 9,574 విద్యార్థిని, విద్యార్థులకు రూ. 9.8 కోట్ల ఉపకార వేతనాలు, మరియు ట్యూషన్‌ ఫీజులను మంజూరు చేయడమైనది. జిల్లాలోని 63 ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని 8,470 మంది విద్యార్థులకు, 735 మధ్యాహ్న భోజన వసతున్న పాఠశాలల్లోని 40,168 మంది విద్యార్థులకు ప్రతి నెల 2081 క్వింటాళ్ల సన్నరకం బీపీటీ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 15,837 దీపం కనెక్షన్లు అందచేశామన్నారు.ఎస్సీ సబ్‌ప్లాన్‌ ద్వారా జీవనోపాధి కోసం ఇప్పటివరకు 103 ఎస్సీ సభ్యులకు రూ. 71.50 లక్షలు పంపిణీ చేయడం జరిగింది.



స్వశక్తి సంఘాలకు రూ.21.69 కోట్ల రుణం: 2017–18లో 9,625 స్వశక్తి సంఘాలకు రూ. 210.82 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 604 సంఘాలకు రూ. 21.69 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించామన్నారు. స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల సభ్యులకు రూ. 53.09 కోట్ల లక్ష్యం కాగా, నేటి వరకు 1,076 స్వశక్తి సంఘాలకు రూ. 8.24కోట్ల స్త్రీనిధి రుణాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1996 మంది ఒంటరి మహిళలకు రూ. వెయ్యి చొప్పున ఆసరా పింఛన్లు అందించామని, 83,351 మందికి రూ. 8.75 కోట్ల పెన్షన్‌ ఇస్తున్నామని వివరించారు. అలాగే 3,296 మంది దివ్యాంగులకు సదరం క్యాంపు ద్వారా పరీక్షలు నిర్వహించామని, సర్టిఫికెట్లు అందిస్తామన్నారు.



8 గ్రామాలతో కలిపి పెద్దపల్లి మున్సిపాల్టీ: పెద్దపల్లి నగర పంచాయతీకి ఎనిమిది గ్రామాలను కలుపుకొని మున్సిపాల్టీగా మార్చేందుకు జిల్లా టౌన్‌ప్లానింగ్‌ శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపించామన్నారు. ఆరు జంక్షన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. వందశాతం పన్నులు వసూలు చేసిన నగర పంచాయతీకి అభినందనలు తెలిపారు. పురపాలక కార్యాలయ భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంఖుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎంపీ, స్థానిక ఎమ్మెల్యే నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడమైనది.



రూ.4.25 కోట్లతో మినీస్టేడియాలు

జిల్లాలో రూ.4.25 కోట్లతో మినీస్టేడియాల నిర్మాణం చేపట్టామన్నారు. సుల్తానాబాద్‌లో రూ. 1.60 కోట్లతో , రామగుండలంలో రూ. 2.65 కోట్లతో మినీ స్టేడియానికి టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. జిల్లా స్థాయి స్పోర్ట్స్‌ స్కూల్‌ సెలక్షన్‌ పోటీల ద్వారా 30 మంది విద్యార్థులను రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించామని తెలిపారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో 24,100 మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో మొత్తం 19 గోదాములున్నాయని, మరో నాలుగు గోదాములు రూ. 9కోట్లతో నిర్మించేందుకు, వీటికి అదనంగా రూ. 3 కోట్లతో మరో 5వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందన్నారు.



ఓడీఎఫ్‌గా కార్పొరేషన్‌

వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకొన్న రామగుండం కార్పోరేషన్‌ను బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌) పాంతంగా ప్రకటించారు. రామగుండం నగర అభివృద్ధి కోసం రూ. 100 కోట్ల గ్రాంట్, ఈ బడ్జెట్‌లో అదనంగా మరో రూ. 100 కోట్లు కేటాయించామన్నారు. రూ. 3.50 కోట్లతో పార్కుల అభివృద్ధి చేస్తున్నామన్నారు. 10,363 ఎల్‌ఈడీ బల్బులను అమర్చడం జరిగిందని, ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చేందుకు రూ. 89.60 కోట్లు కేంద్ర ప్రభుత్వ అమృత్‌ కింద విడుదలయ్యాయన్నారు. రూ. 20.34 కోట్ల నిధులను బ్యాంకు లింకేజీ కింద 467 స్వయం సహాయక సంఘాలకు అందించామని, రూ. 44లక్షల అంచనా వ్యయంతో మూడు నైట్‌ షెల్టర్‌లు మంజూరయ్యాయన్నారు. రామగుండం కార్పోరేషన్‌ కాగిత రహిత పాలనలోకి వచ్చిందన్నారు.



రూ.590 కోట్లతో ప్రతిపాదనలు: జిల్లా సమగ్రాభివృద్ధికి 590 కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వం అనుమతి కోసం పంపించామని వెల్లడించారు. చెత్త నుంచి విద్యుత్‌ తీసే కేంద్రాన్ని రామగుండంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం పంపించామన్నారు. అలాగే బసంత్‌నగర్‌లో ఎయిర్‌పోర్టు నిర్మాణం, జిల్లా కేంద్రంలో 500 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామన్నారు. గోదావరిఖని, పెద్దపల్లి, మంథని ప్రభుత్వ ఆస్పత్రులను ప్రత్యేక ఆస్పత్రులుగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్‌ ఎస్‌.ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, డీసీపీ విజయేంద్రరెడ్డి, ఏసీపీ సింధుశర్మ, నగరపంచాయతీ చైర్మన్‌ ఎల్‌.రాజయ్య పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top