సం‘క్షామ’ వసతిగృహాలు

సం‘క్షామ’ వసతిగృహాలు

చింతూరు : 

నిర్వహణ సరిగా లేకపోవడం, తమను సరిగా పట్టించుకోవడం లేదంటూ స్థానిక ఎస్సీ వసతిగృహం విద్యార్థులు ఇంటిబాట పడుతున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ హాస్టల్లో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాలకు చెందిన విద్యార్థులు ఆశ్రయం పొందుతూ పక్కనే ఉన్న జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ఈ ఏడాది 60 మంది విద్యార్థులు వసతిగృహంలో ఉంటున్నట్టు సిబ్బంది తెలిపారు. వార్డెన్‌ సరిగా ఉండటం లేదని, తమకు జ్వరాలు వచ్చినా పట్టించుకోవడం లేదని, ఇలాగైతే తాము ఇక్కడ ఉండలేమంటూ ఎటపాక మండలం సీతాపురం గ్రామానికి చెందిన నలుగురు విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయినట్టు వారు తెలిపారు. 

విలేకరులు ఆదివారం వసతిగృహాన్ని సందర్శించగా వెళ్లిపోయిన విద్యార్థులు మినహా, 55 మంది ఉండాల్సి ఉండగా కేవలం 15 మంది మాత్రమే ఉన్నారు. జ్వరాలు రావడంతో 40 మంది వరకు విద్యార్థులు ఇళ్లకు వెళ్లినట్టు మిగతా విద్యార్థులు తెలిపారు. నాలుగు రోజులుగా వార్డెన్‌ రావడం లేదని సిబ్బందితో పాటు విద్యార్థులు తెలిపారు. హాస్టల్లో మిగిలిన 15 మందిలో చింతూరు మండలం తుమ్మల గ్రామానికి చెందిన విజయ్‌ అనే విద్యార్థి జ్వరంతో బాధపడుతూ ఇంటికి వెళ్లేందుకు పయనమయ్యాడు. ఆదివారం ఉదయమే కూనవరం మండలం పెదార్కూరుకు చెందిన శివాజీ అనే విద్యార్థి కూడా జ్వరంతో బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయినట్లు విద్యార్థులు తెలిపారు. వార్డెన్‌ లేకపోవడంతో వాచ్‌మెన్, వంటమనిషి మిగతా విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందిస్తున్నారు.

 

జ్వరం తగ్గడం లేదు

రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. వార్డెన్‌ లేకపోవడంతో ఇంటికి వెళ్లిపోతున్నాను.

 -విజయ్, 8వ తరగతి, తుమ్మల

పరిశీలించి వివరాలు సేకరిస్తా

విద్యార్థులు హాస్టల్‌ వీడుతున్న వైనంపై సిబ్బందిని అడిగి తెలుసుకుంటా. వివరాలు సేకరించి ఏంచేయాలనే దానిపై నిర్ణయం తీసుకుంటా.

– డేవిడ్‌రాజు, ఏఎస్‌డబ్లు్యవో

Election 2024

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top