ఇక ప్రైవేటు యూనివర్సిటీలు

ఇక ప్రైవేటు యూనివర్సిటీలు - Sakshi


ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన

విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపరిచేందుకు దోహదం

దీనిపై డిప్యూటీ సీఎం శ్రీహరితో మాట్లాడినట్లు వెల్లడి

కొత్త గురుకులాల్లో బాలికలకే అధిక సీట్లు: కడియం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. దీనిపై బిల్లు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో మాట్లాడానని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభను మెరుగుపర్చడానికి, యూనివర్సిటీల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు వీలుగా ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం హైదరాబాద్ కోకాపేటలో రాక్‌వెల్ ఇంటర్నేషనల్ స్కూల్ కొత్త క్యాంపస్‌ను కడియం శ్రీహరితో కలసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.

 

ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటుచేయాలని యువ విద్యావేత్త, రాక్‌వెల్ స్కూల్స్ సీఎండీ మహేష్ బిగాలను కోరినట్లు చెప్పారు. మేహ ష్ దేశవిదేశాల్లో విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రతిభను చాటుతున్నారని కొనియాడారు. ప్రస్తుతం తల్లిదండ్రులు ఇతరత్రా ఖర్చులు తగ్గించుకుని, సుఖాలను త్యాగం చేసుకుని తమ పిల్లలను ఉత్తమ పాఠశాలల్లో చదివించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. సమాజంలో ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటికే చాలా పాఠశాలలు ఉన్నాయని, ఇంకెన్ని వచ్చినా విజయవంతంగా కొనసాగే పరిస్థితులు ఉన్నాయన్నారు.

 

బాలికలకు అధిక ప్రాధాన్యత

పాఠశాలలు, గురుకుల విద్యాలయాల విద్యలో బాలికలు వెనకబడి ఉన్నారని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చెప్పారు. అంతేగాక మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. బాలికల నమోదు శాతం పెంచేందుకు, నిరంతరాయంగా చదువులు కొనసాగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకోసం కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఎక్కువ శాతం సీట్లు బాలికలకే కేటాయిస్తామన్నారు. పాఠశాలలు, గురుకులాల్లో ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించనున్నామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు పచ్చజెండా ఊపినందుకు సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్ రావు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల, రాక్‌వెల్ స్కూల్స్ సీఎండీ మహేష్ బిగాల, ఆస్ట్రేలియాలోని ఫెడరేషన్ వర్సిటీ డిప్యూటీ వైస్ చాన్స్‌లర్ టాడ్ వాకర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top