తాయిలాల గాలం

తాయిలాల గాలం

విద్యార్థుల వేటలో ప్రైవేటు స్కూళ్లు

విద్యాసంవత్సరం ముగియకుండానే అడ్మిషన్ల హడావుడి

 ఫీజుల్లో రాయితీలంటూ వల

రాయవరం (మండపేట) : విద్యాసంవత్సరం పూర్తవకుండానే ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల వేటలో పడ్డాయి. అనేక రాయితీలు ప్రకటిస్తూ చిన్నారుల తల్లిదండ్రులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడంతో విద్యా సంవత్సరం ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు గాలం వేస్తున్నాయి. గతంలో పరీక్షల అనంతరం వేసవి సెలవుల్లో విద్యార్థుల వేట ప్రారంభించేవి. ఈ ఏడాది జనవరి నుంచే ఈ కార్యక్రమం మొదలైంది. గతేడాది అక్టోబరులోనే సేకరించిన విద్యార్థుల జాబితా ఆధారంగా పీఆర్వోలు తల్లిదండ్రులను కలిసి తమ పాఠశాలల్లో అమలు చేస్తున్న విద్యా కార్యక్రమాలను వివరిస్తూ వారిని ఆకట్టుకునే పనిలో పడ్డారు.  

రాయితీలు..ఫ్రీలు..

విద్యా సంవత్సరం ముందుగానే మా పాఠశాలలో చేర్పిస్తే ఫీజులో 10 శాతం రాయితీ ఇస్తున్నామని కార్పొరేట్‌ పాఠశాలలు చెబుతున్నాయి. ముందుగా కొంత సొమ్ము చెల్లించి సీటు రిజర్వు చేసుకోవాలని తల్లిదండ్రులపై పీఆర్వోలు ఒత్తిడి చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఎల్‌కేజీలో ఇప్పుడే చేర్పిస్తే ఈ నాలుగు నెలలు ఫీజులు చెల్లించనక్కర లేదని చెబుతున్నారు. దీని వల్ల అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం మార్చితోనే ముగియనుంది. ఈ పరిస్థితుల్లో ముందుగానే విద్యార్థులను చేర్చుకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో తమ పాఠశాల వదిలి వెళ్లరనే ముందస్తు ఆలోచనతో కార్పొరేట్‌,ప్రైవేటు పాఠశాలల ఆలోచన చేస్తున్నాయి. 

మేల్కొనకుంటే నష్టమే..

ఇంగ్లిషు మీడియం మోజులో తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితి ప్రభుత్వ పాఠశాలల ఎన్‌రోల్‌మెంట్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. విద్యా సంవత్సరం ముగియకుండానే ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఎన్‌రోల్‌మెంట్‌పై దృష్టి సారించాల్సి ఉంది. లేకుంటే వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థుల చేరికలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు ఏటేటా తగ్గుతున్నాయి. 

‘మన బడి’కి ఆదరణ లభించేనా!

మన ఊరు - మన బడి కార్యక్రమానికి ఈ ఏడాది ఆశించినంతగా ఆదరణ లభిస్తుందా? అనే సందేహాన్ని ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖ ఫిబ్రవరి నుంచే విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టి ఉంటే సత్ఫలితాలు ఉండేవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గతేడాది 36,200 మంది చిన్నారులను చేర్చుకున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది 40 వేల మంది చిన్నారులను చేర్చుకోవడం లక్ష్యంగా చెబుతున్నా అది ఏ మేరకు సఫలీకృతమవుతుందన్నది వేచి చూడాల్సిందే. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top