పోలీసు పదోన్నతుల ఫైలు కదులుతోంది !


సాక్షి, కరీంనగర్ :

పోలీసుశాఖలో పదోన్నతులకున్న ఆటంకాలు ఒక్కటొక్కటిగా తొలగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోవడం వల్ల చాలా మంది పదోన్నతులు పొందకుండానే పదవీ విరమణ చేశారు. 1983, 1985 బ్యాచ్‌లకు చెందిన అనేక మంది 17 ఏళ్లకు పైబడి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లుగా పనిచేసి, నోషనల్‌ ఇంక్రిమెంట్లకు నోచుకోక చిట్టచివరన డీఎస్పీలుగా పదవీ విరమణ చేశారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోలీసు అధికారుల సంఘాల విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రెండు నెలల క్రితం పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది.



గత నెల 24న తెలంగాణ వ్యాప్తంగా డీఎస్పీలుగా పదోన్నతులు పొందే 121 మంది సీఐల జాబితాను ప్రకటించింది. వీరి పదోన్నతలపై ఏసీబీ కేసులు, అసంతృప్తి విచారణను కోరారు. అదే విధంగా మొత్తం ఏఎస్పీలుగా పదోన్నతి పొందే జాబితాలోని 82 మంది డీఎస్పీల జాబితాను శనివారం విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో గ్యాంగ్‌స్టర్‌ నయూమోద్దిన్‌తో సంబంధాలు, ఎక్సైజ్‌ కేసుల్లో ఇరుక్కున్న వారి పేర్లను పేర్కొనలేదు.

 

డీపీసీ ఏర్పాటే తరువాయి

పోలీసుశాఖలో పదోన్నతుల ఫైళ్లకు కదలిక రావడంతో అంతటా సందడి మొదలయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రమోషన్ల ఫైళ్లకు కదలిక వచ్చింది. డీఎస్పీలుగా పదొన్నతి పొందే సీఐలు, ఏఎస్పీల జాబితాలో ఉన్న డీఎస్పీల పేర్లను డీజీపీ ప్రకటించారు. ఈ రెండు జాబితాలకు త్వరలోనే ఏసీబీ నుంచి క్లియరెన్స్‌ రానుండగా, డిపార్టుమెంట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) ఏర్పాటే తరువాయిగా మారనుంది. డీపీసీ కూర్చుండటమే ఆలస్యం పదోన్నతుల జాబితా వెలువడనుంది. 

 

డీఎస్పీ / ఏసీపీలుగా పని చేస్తున్న 1989 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన పలువురికి ఏఎస్పీలుగా పదోన్నతి కలగనుంది. అదే విధంగా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లుగా పనిచేస్తున్న 1991 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన వారికి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు (డీఎస్పీ)లుగా పదోన్నతి లభించనుంది. ఇదే తరహాలో 1994–95 నుంచి ఎస్‌ఐలుగా పనిచేస్తున్న వారికి సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్లుగా పదోన్నతులు కలగనున్నాయి. 

 

అయితే మొదటగా రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌ సిటీ, హైదరాబాద్‌ జోన్, వరంగల్‌ రేంజ్‌లలో 1991 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన 121 మంది సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌లకు డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించే ఫైలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో వరంగల్‌ రేంజ్‌కు చెందిన 62 మంది సీఐలకు అవకాశం లభించనుండగా, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 11 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కలగనుంది.

 

డీఎస్పీల జాబితాలో 13 మంది సీఐలు...

పూర్వ కరీంనగర్‌ జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో ఎస్‌ఐ, సీఐలుగా పనిచేసి, ప్రస్తుతం వివిధ జిల్లాల్లో డీఎస్‌పీ/ఏసీపీలుగా పనిచేస్తున్న ఎనిమిది మంది ఏఎస్‌పీ పదోన్నతుల జాబితాలో ఉన్నారు. హుజూరాబాద్‌ ఏసీపీ ఎం.రవిందర్‌ రెడ్డి, కె.మోహన్‌ (డీఎస్పీ, ఎస్‌బీ, నిజామాబాద్‌), ఎ.సంజీవ్‌కుమార్‌ (ఏసీపీ, డీటీసీ, నిజామాబాద్‌), బి.రాంరెడ్డి (ఏసీపీ, సీటీసీ, కరీంనగర్‌), సి.సత్యనారాయణ రెడ్డి ( ఎసీపీ, సీటీసీ, వరంగల్‌), ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ (డీఎస్‌ఆర్‌బీ, సికింద్రాబాద్‌), పి.వేణుగోపాల్‌రావు (ఏసీపీ, ఎల్‌బీనగర్‌), ఎన్‌.సంజీవ్‌రావు (ఎసీపీ,సీసీఎస్, హైదరాబాద్‌) తదితరులు ఏఎస్పీ పదోన్నతి జాబితాలో ఉన్నారు. 

 

అయితే తెలంగాణ పోలీసు అకాడమీలో డీఎస్పీగా ఉన్న జె.అమరేందర్‌ రెడ్డి గ్యాంగ్‌స్టర్‌ నయీమోద్దిన్‌ కేసులో శాఖాపరమైన విచారణ ఎదుర్కుంటున్నందున ఆయన పేరు పదోన్నతుల జాబితాలో లేదు. కాగా కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు చెందిన 11 మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి కలిగించే ప్రక్రియ పూర్తయ్యింది. సీఐ నుంచి డీఎస్పీలుగా పదోన్నతి పొందే జాబితాలో కృష్ణగౌడ్‌ (కరీంనగర్‌ సీపీ అటాచ్డ్‌), డి కమలాకర్‌రెడ్డి( ఇంటలిజెన్స్‌ సీఐ), పి.వీరభద్రం (ఏసీబీ), ఎండీ గౌస్‌బాబా ( సీఐ, హుజురాబాద్‌ రూరల్‌), జితేందర్‌రెడ్డి (ట్రాన్స్‌కో), వెంకటరమణ (ఎస్‌బీఐ), రఘు (ఏసీబీ), కె రంగయ్య (సీటీసీ), విజయసారథి (సీపీ అటాచ్డ్‌), టి కరుణాకర్‌ (సీఐ, తిమ్మాపూర్‌), టి కృపాకర్‌లు ఉన్నారు. సర్దుబాటు, డీపీసీ తుది కసరత్తులో ఒకటీ, రెండు పేర్లు అటు ఇటుగా ఉండవచ్చని తెలుస్తోంది.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top