‘ప్రాథమికం'.. అయోమయం!

‘ప్రాథమికం'.. అయోమయం! - Sakshi


ప్రాథమిక విద్యను బలోపేతం చేసి పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన సర్వశిక్షా అభియాన్ ప్రస్తుతం సంకటంలో పడింది. కేంద్రం ఏటా నిధులు కోత పెడుతుండడంతో క్రమంగా ఉనికి కోల్పోతున్న ఎస్‌ఎస్‌ఏకు తాజాగా రాష్ట్ర ప్రాజెక్టు కార్యాలయం షాకిచ్చింది. జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో పనిచే స్తున్న సెక్టోరియల్, సహాయ సెక్టోరియల్, క్లరికల్ సిబ్బందిని ఒక్కసారిగా తొలగిం చింది. డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న వీరిని వెంటనే సొంత శాఖకు పంపించాలని స్పష్టం చేసింది. దీంతో జిల్లా ఎస్‌ఎస్‌ఏలో కీలక విభాగాల్లో పనిచేస్తున్న వారు ఒకట్రెండు రోజుల్లో రిలీవ్ కానున్నారు. ఇక.. ఆ కుర్చీలన్నీ ఖాళీ కావడంతో ప్రాజెక్టు కార్యక్రమాల అమలు అగమ్యగోచరంగా మారనుంది.

 

* మూకుమ్మడిగా సెక్టోరియల్, సహాయకుల తొలగింపు

* గడువు ముగిసిందంటూ డిప్యుటేషన్లు రద్దు

* ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్

* కొత్త నియామకాలపై స్పష్టత కరువు

* అటకెక్కనున్న విద్యా కార్యక్రమాలు

* సంకటంలో సర్వశిక్షా అభియాన్

సాక్షి, రంగారెడ్డి జిల్లా:
సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో విద్యాశాఖకు సంబంధించిన పలువురు అధికారులు డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. హోదాకు తగినట్లు వారికి బాధ్యతలు అప్పగించారు.



కమ్యునిటీ మొబిలైజేషన్ ఆఫీసర్, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్, బాలికావిద్య విభాగాలకు ముగ్గురు గెజిటెడ్ ఉపాధ్యాయులు సెక్టోరియల్ అధికారులుగా పనిచేస్తున్నారు. అదే విధంగా సహాయ గణాంక అధికారి, సహాయ ప్లానింగ్ అధికారి, సహాయ పర్యవేక్షణ అధికారులుగా స్కూల్ అసిస్టెంట్లు కొనసాగుతున్నారు. ఇదే విభాగంలో నలుగు జూనియర్ అసిస్టెంట్లుగా విద్యాశాఖకు చెందిన వారున్నారు. తాజాగా వారి డిప్యుటేషన్ రద్దు చేస్తూ ఎస్‌పీడీ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు కొత్త వారిని నియమించొద్దని స్పష్టం చేశారు. టీచర్లంతా బడిలోనే పనిచేయాలనే ఆర్టీఈ నిబంధనలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. కొత్తగా ఔట్‌సోర్సింగ్ వాళ్లకు ఈ బాధ్యతలు అప్పగించేలా ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీ యోచిస్తున్నట్లు సమాచారం.

 

కార్యక్రమాలు సాగేదెలా..?

ఎస్‌ఎస్‌ఏలో కీలక విభాగాల అధికారుల తొలగింపుతో పలు కార్యక్రమాలపై సందిగ్ధత నెలకొంది. పాఠశాల యాజమాన్యాల ఏర్పాటు, బడిబాట, పిల్లల హక్కులు, స్కూల్ డ్రస్సులకు సంబంధించి కార్యక్రమాల పురోగతి అయోమయంలో పడింది. ప్రస్తుతం పాఠశాలల్లో పిల్లలకు యూనిఫాం ఇవ్వాల్సి ఉంది. బాలికా విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కూడా నిలిచిపోనున్నాయి. వార్షిక ప్రణాళిక తయారీ, అమలు, పాఠశాలల వారీగా గణాంకాల సేకరణ.. తదుపరి కార్యచరణ.. పాఠశాలల పర్యవేక్షణ.... ఇలా ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సంబంధించిన కార్యక్రమాలు ప్రశ్నార్థకం కానున్నాయి. కొత్తగా ఔట్‌సోర్సింగ్ వాళ్లను నియమించే చర్యలు తీసుకున్నా.. అందుకు మరింత సమయం పడుతుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top