ఎరువు.. జీఎస్టీ బరువు

ఎరువు.. జీఎస్టీ బరువు


పెరగనున్న ఎరువుల ధరలు

జిల్లా రైతులపై రూ.36 కోట్లకు పైగా భారం

పురుగు మందులు మరింత ప్రియం




చేజర్ల (ఆత్మకూరు):   వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ప్ర«భావంతో ఎరువులు, పురుగు మందుల ధరలకు రెక్కలొస్తున్నాయి. జూలై 1నుంచి కొత్త పన్నుల విధానం అమలు కానున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో యూరియా సహా రసాయన ఎరువుల ధరలు ఎంత పెరగవచ్చనే విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవంగా ఎరువుల ధరలు కొన్ని నెలల క్రితమే కొంతమేర తగ్గాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో అన్ని రకాల ఎరువులపై వ్యాట్‌ 5 శాతం మాత్రమే ఉంది. జీఎస్టీ అమలైతే ఈ పన్ను 12 శాతానికి పెరుగుతుంది. అంటే పన్నుభారం అన్నదాతపై అదనంగా 7 శాతం పడనుంది. యూరియా బస్తాపై దాదాపు రూ.18, మిగిలిన ఎరువులపై బస్తాకు రూ.60 నుంచి  రూ.100 వరకు పెరిగే అవకాశం ఉంది.



యూరియా భారం రూ.4.10 కోట్లు

ఖరీఫ్‌ సీజన్‌కు జిల్లాలో 3,40,077 టన్నుల రసాయన ఎరువులు అవసరమవుతాయి. అన్నిరకాల ఎరువుల ధరలు పెరుగుతున్నా ఇప్పటివరకు యూరియా ధర మాత్రం పెరగలేదు. ఇది రైతులకు కాస్త ఊరట కలిగిచింది. ప్రస్తుతం యూరియా 50 కిలోల బస్తా ధర రూ.298 ఉంది. జీఎస్టీ కారణంగా రూ.316కు పెరగనుంది. అంటే బస్తాపై రూ.18 అదనపు భారం పడనుంది. జిల్లాకు 1,13,312 టన్నుల యూరియా ప్రతి ఏడాది అవసరమవుతోంది. టన్నుపై రూ.360 పెరగనుంది. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో రైతులపై రూ.4.10 కోట్ల పైగా భారం పడే అవకాశం ఉంది.



ఇతర ఎరువుల ధరలు సైతం..

జిల్లాకు డీఏపీ 65,600 టన్నులు, ఎంఓపీ 16,432 టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 1,42,733 టన్నులు అవసరమవుతున్నాయి. 50 కిలోల బస్తాపై గరిష్టంగా రూ.70 వరకు ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఎరువుల కంపెనీల ప్రతినిధులు జిల్లాలోని డీలర్లకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనినిబట్టి చూస్తే రైతులపై జీఎస్టీ భారం ఎక్కువగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతులు ఎక్కువగా వినియోగించే ఎరువుల్లో డైఅమోనియా సల్ఫేట్‌ (డీఏపీ) ముఖ్యమైనది. ప్రస్తుతం దీనిధర గరిష్టంగా బస్తా రూ.1,155 వరకు ఉంది. భవిష్యత్‌లో రూ.1,221కి చేరే అవకాశం ఉంది. జిల్లాకు డీఏపీ 66,600 టన్నులు అవసరమవుతుండగా, రైతులపై రూ.8.50 కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం 28.28.0 రకం ఎరువు 50 కిలోల బస్తా ధర రూ.1,134 ఉంది. ఇది రూ.1,200 దాటే అవకాశం ఉంది. 10.26.26, 14.35.14 ఇలా అన్ని రకాల ఎరువుల ధరలు పెరగనున్నాయి.



భారం కానున్న పురుగుమందుల ధరలు

రైతులకు పురుగు మందులు సైతం రానున్న రోజుల్లో భారం కానున్నాయి. జిల్లాలో ఏటా దాదాపు 52 వేల టన్నుల పురుగు మందులు అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిపై భవిష్యత్‌లో 18 శాతం వరకు జీఎస్టీ వర్తించే అవకాశం ఉంది. వీటితో వివిధ కంపెనీలు బయో ఉత్పత్తులను పెంచే అవకాశం ఉంది. ఓ వైపు పండిన పంటలు గిట్టుబాటు ధరలు లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే.. కేంద్రం అమల్లోకి తెస్తున్న జీఎస్టీ మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అవుతుంది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top