సంద్రంపై త్రివర్ణ ఠీవి

సంద్రంపై త్రివర్ణ ఠీవి - Sakshi


విశాఖలో అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష నిర్వహించిన రాష్ట్రపతి

 

 సాక్షి ప్రతినిధి,విశాఖపట్నం: బంగాళాఖాతంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. భారత నౌకాదళం తన సామర్థ్యాన్ని ప్రపంచానికి మరోసారి ఘనంగా చాటింది. సముద్ర జలాల్లో  కొలువుదీరిన యుద్ధ నౌకలు.. గగనతలంలో దూసుకుపోయిన యుద్ధ విమానాలు.. మిగ్‌లు.. అబ్బురపరచిన చేతక్ హెలికాప్టర్లు.. నిశ్శబ్ద నిఘాకు ప్రతీకైన జలాంతర్గాములు.. భారత నౌకాదళం సముద్ర జలాల్లో తన పాటవాన్ని ప్రదర్శించిం ది. త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష (ఐఎఫ్‌ఆర్-2016) దీనికి వేదికగా నిలిచింది.



 గౌరవ వందనం...

 దేశ చరిత్రలో రెండోది, దేశ తూర్పుతీరంలో మొదటి అంతర్జాతీయ నౌకాదళాల సమీక్ష(ఐఎఫ్‌ఆర్-2016) ఇది. ఐఎఫ్‌ఆర్ కోసం హార్బర్ చేరుకున్న రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, అడ్మిరల్ ఆర్కే ధోవన్, వైస్ అడ్మిరల్ సతీష్‌సోనీ, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు స్వాగతం పలికారు. 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్రపతి యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రలో సమీక్షకు బయలుదేరారు. ముందుభాగంలో రాష్ట్రపతి ఆశీనులు కాగా ఆయనకు  ఇరువైపులా ప్రధాని, రక్షణ మంత్రి, అడ్మిరల్, వైస్ అడ్మిరల్ కూర్చున్నారు.



సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్, చంద్రబాబు, కేంద్ర పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు తదితరులుకూడా సుమిత్రపై ఆశీనులయ్యారు. రాష్ట్రపతిని తీసుకుని సుమిత్ర ముందుకు సాగుతుండగా..యుద్ధ నౌకలు ఐఎన్‌ఎస్ సుమేధ, ఐఎన్‌ఎస్ శౌర్య, ఐఎన్‌ఎస్ సునయన కాన్వాయ్‌గా దాన్ని అనుసరించా యి. పది నాటికల్ మైళ్ల తర్వాత సముద్ర జలాల్లో ఆరు వరుసల్లో లంగ రు వేసిన యుద్ధ నౌకల మధ్య గుండా సాగు తూ వాటిపైన ఉన్న నౌకాదళాల సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని రాష్ట్రపతి స్వీకరించారు.

 

 పాల్గొన్న యుద్ధనౌకలు


  ఐఎన్‌ఎస్ తరంగిణితో ప్రారంభమైన సమీక్ష రెండు గంటలపాటు సాగింది. సమీక్షలో క్షిపణి వాహక నౌక ఐఎన్‌ఎస్ రణ్‌వీర్, విధ్వంసక నౌకలు ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్  విరాట్, ఐఎన్‌ఎస్ శివాలిక్, ఐఎన్‌ఎస్ మైసూర్, సాగర పరిశోధక నౌక ఐఎన్‌ఎస్ మంజోషలతోపాటు ఇతర యుద్ధ నౌకలు బియాస్, ధిల్లీ, సహ్యాద్రి, సాత్పురా, సంధ్యాయక్ మొదలైనవి పాల్గొన్నాయి. భారత నౌకాదళానికి చెందిన జలాంతర్గాములు ఐఎన్‌ఎస్ సింధురాజ్, ఐఎన్‌ఎస్ సింధుకారి, ఐఎన్‌ఎస్ సింధువీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక యూకేకు చెందిన హెచ్‌ఎంఎస్ డిఫెండర్, అమెరికాకు చెందిన యూఎస్‌ఎస్ యాంటియానాలతోపాటు 24 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమీక్షలో మొత్తం 65 భారత యుద్ధ నౌకలు, 3 జలాంతర్గాములు, 2 కోస్టుగార్డు, 3 మర్చంట్ నేవీ, 24 విదేశీ యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.

 

 అబ్బురపరచిన విన్యాసాలు


 రెండు గంటలకుపైగా సాగిన నౌకాదళాల సమీక్ష సందర్భంగా భారత నౌకాదళం తన యుద్ధపాటవాన్ని ఘనంగా ప్రదర్శించింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన చేతక్, ధ్రువ్ హెలికాప్టర్ల విన్యాసాలు ఉత్కంఠరేపాయి. జాతీయ, నౌకాదళం, ఐఎఫ్‌ఆర్ పతాకాలను ఎగురవేస్తూ గాలిలో రివ్వున దూసుకుపోయాయి. అనంతరం ప్రదర్శించిన ‘ఫ్లైఫాస్ట్’ భారత నౌకాదళ తేజాన్ని చాటింది. 45 యుద్ధ విమానాలు 15 జట్లుగా విన్యాసాలు చేశాయి. తీరరక్షణలో సమర్థవంత పాత్ర పోషిస్తున్న డోర్నియర్ యుద్ధ విమానాలు, హాక్ శ్రేణికి చెందిన ఫాంటమ్స్, వైట్ టైగర్స్, బ్లాక్‌ఫాంథర్స్ యుద్ధ విమానాల విన్యాసాలు ఆశ్చర్యపరిచాయి. మిగ్ 29కె, పీ81, కేఎం-31 ఏఈడబ్లూ హెలికాప్టర్లు సత్తా చాటాయి. మరైన్ కమాండోలు మార్కోవ్స్ సాహసోపేతంగా దూసుకుపోతూ అబ్బురపరిచారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top