'జీవో రాకపోతే.. ఆత్మహత్య చేసుకుంటా'


హైదరాబాద్: గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో  సమ్మెకు దిగిన అర్చకులు.. ప్రభుత్వ చర్చల అనంతరం సమ్మె విరమణ నిర్ణయంపై సానుకూలంగా స్పందించారు. అయితే అర్చక ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తుది నిర్ణయం చెప్పకపోవడంపై సంఘ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. అర్హులైన అర్చకులకు డబుల్ బెడ్ రూంలు ఇస్తామని మంత్రి పేర్కొన్నా... అర్చక ఉద్యోగుల సమస్యలపై ఈనెల 15 లోగా తుది నిర్ణయం తీసుకుంటామనడంపై రాష్ట్ర అర్చకుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భానుమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఆ తేదీలోపు ప్రభుత్వం నుంచి జీవో రాకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.



తమకు ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలన్న ప్రధాన డిమాండుతో పాటు మరికొన్ని డిమాండ్లతో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులు, ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అర్చకుల సమ్మె కారణంగా అసలు చాలావరకు దేవాలయాల తలుపులే తెరుచుకోలేదు. దేవుడికి హారతులు, నిత్య ధూప దీప నైవేద్యాలు కూడా కరువయ్యాయి.



గత జూన్‌లో సమ్మె చేసిన సమయంలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ల పరిశీలనకు ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వకపోవడంతో అర్చకులు, ఉద్యోగుల జేఏసీ సమ్మెను తీవ్రతరం చేసింది. అయితే సమ్మె తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో అర్చకులతో ప్రభుత్వం చర్చలు జరిపింది.  శుక్రవారం జరిగిన చర్చల అనంతరం తెలంగాణ అర్చకులు సమ్మె విరమించడానికి సన్నద్ధమయ్యారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top