నిజాయితీ అధికారులకు బదిలీలే బహుమతులా?

నిజాయితీ అధికారులకు బదిలీలే బహుమతులా? - Sakshi


శ్రీకాకుళం అర్బన్‌: జిల్లాలో నీతి, నిజాయితీగా పనిచేస్తూ అక్రమాలపై అడ్డుకట్ట వేసే అధికారులు బదిలీలే బహుమతులు గా అందుకోవాల్సిన దుస్థితి దాపురించిందని జిల్లా సర్పంచ్‌ ల సంఘం అధ్యక్షుడు రొక్కం సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని ఎన్‌జీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ జయరామ్‌ బదిలీయే ఇందుకు నిదర్శనమన్నారు.



 రెండేళ్లుగా జిల్లాలో రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం రవాణా ఖర్చుల సొమ్మును కొందరు మిల్లర్లు దొంగ బిల్లులతో మింగేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వారిలో ప్రధానంగా కోటబొమ్మాళికి చెందిన శ్రీ సూర్యరత్న రైస్‌మిల్లు యజమాని సకలాభక్తుల వైకుంఠరావు ప్రధాన సూత్రధారి అని పలువురు వ్యాపారులు చర్చించుకుంటున్నారన్నారు. ధాన్యం రవాణా డబ్బు రూ.33.58కోట్లు ఎలాగైనా చేజిక్కించుకోవాలని, అవసరమైతే అడ్డువచ్చిన అధికారులను తొలగించుకోవాలని కొందరు మిల్లర్లు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.



గత ఖరీఫ్‌లో ప్రభుత్వానికి మిల్లర్ల నుంచి బకాయిపడ్డ రూ.12 కోట్ల బియ్యానికి ఎగనామం పెట్టినవారే పేర్లు మార్చుకుని మళ్లీ ప్రభుత్వం నుంచి ధాన్యం పొందేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్‌ స్పందించి విజిలెన్స్‌ దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాగోలు సర్పంచ్‌ యజ్జల గురుమూర్తి, కొత్తపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top