చీకట్లో కేజీహెచ్

చీకట్లో కేజీహెచ్ - Sakshi


ఆరుబయట నిద్రిస్తున్న వీరిని చూసి.. ఎక్కడినుంచో వచ్చిన కాందిశీకులో.. గూడు లేని పక్షులో అనుకునేరు!.. వారంతా రోగులు.. వారికి సహాయంగా వచ్చిన బంధువులు... ఆ ఆవరణ.. ఉత్తరాంధ్రకే పెద్దాస్పత్రిగా పేరుగాంచిన కింగ్‌ జార్జి ఆస్పత్రి(కేజీహెచ్‌).. మరి ఏమిటీ దుస్థితి.. హాయిగా ఆస్పత్రిలోనే వార్డుల్లో.. ఫ్యాన్ల కింద సేదదీరవచ్చుగా?!.. అన్న అనుమానం రావచ్చు.. సేదదీరవచ్చు.. కానీ కరెంటు ఉంటే కదా.. అది లేకే ఈ అగచాట్లు.. ఇంతకూ విషయమేమిటంటే.. కేజీహెచ్‌ మార్చురీ సమీపంలో జరుగుతున్న నిర్మాణపనుల్లో పొక్లెయిన్‌ ధాటికి అండర్‌గ్రౌండ్‌ కేబుల్స్‌ పూర్తిగా కట్‌ అయిపోయాయి. దీంతో ఆస్పత్రి మొత్తానికి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.



సాయంత్రం ఐదు గంటలకు గానీ అధికారులకు ఈ విషయం తెలియలేదు.. తెలిసిన వెంటనే ఉరుకులు.. పరుగుల మీద పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. సుమారు ఏడు గంటల నరకయాతన అనంతరం విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ కావడంతో రోగులు

ఊపిరిపీల్చుకున్నారు.




విశాఖపట్నం : పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో అంధకారం అలముకుంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు నరకం చూశారు. గంటల తరబడి విద్యుత్‌ పునరుద్ధరణ జరగకపోవడంతో రోగులు రోడ్డున పడ్డారు. మార్చురీ సమీపంలో ఉన్న సులభ్‌ కాంప్లెక్స్‌కు నీరు సరఫరా రాకపోవడంతో భూగర్భం నుంచి వెళ్తున్న హైటెన్షన్‌ వైరును యూజీడీ పనులు చేస్తున్న పొక్లెయిన్‌తో తవ్వించడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే విద్యుత్‌ నిలిచిపోయినప్పటికీ దాదాపు రెండు గంటల పాటు ఈ విషయం కేజీహెచ్‌ అధికారులకు తెలియనీయలేదు. సాయంత్రం ఐదు గంటలకు విద్యుత్‌ సరఫరా లేదన్న సంగతిని తెలుసుకుని విద్యుత్‌ అధికారులను అప్రమత్తం చేశారు.



పొక్లెయిన్‌తో తవ్వడంతో వైర్లు బాగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న వైర్ల స్థానంలో కొత్తవి వేశారు. దీనికంతటికీ దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది. దీంతో కేజీహెచ్‌లో ప్రధానంగా గైనిక్, భావనగర్, రాజేంద్రప్రసాద్, చిన్నపిల్లల వార్డుల్లో రోగులు అవస్థలు పడ్డారు. వెంట వచ్చిన సహాయకులు తమ రోగులను మంచాలపై నుంచి బయటకు తీసుకొచ్చి సపర్యలు చేశారు. తీవ్ర అస్వస్థతతో ఉండి మంచాలపై నుంచి కదిల్చే వీలు లేని వారిని అక్కడే ఉంచేశారు. ఒకట్రెండు వార్డుల్లో జనరేటర్‌తో విద్యుత్‌ సదుపాయం కలిగించినా అవి అత్యవసర సేవలకే పరిమితమైంది. దాదాపు ఆరున్నర గంటల తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో ఎట్టకేలకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.



విచారణకు ఆదేశించాం

కేజీహెచ్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంపై విచారణకు ఆదేశించాం. ఎవరో ఉద్దేశపూర్వకంగానే పొక్లెయిన్‌తో కేబుళ్ల ను తవ్వించి ఉంటారని అనుమానిస్తున్నాం. దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఒక ఏఈ, మరొక డీఈలతో కమిటీని ఏర్పాటు చేశాం. అత్యవసర విభాగాల్లో రోగులకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ఆయా వార్డుల్లో జనరేటర్‌తో విద్యుత్‌ సరఫరా ఇచ్చాం.                       – జి.అర్జున, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top