రైతన్నకు తపాలా సేవ..

రైతన్నకు తపాలా సేవ.. - Sakshi


అన్నదాతలు, కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా పోస్టల్ శాఖ

 పంటల దిగుబడి.. రైతుల వివరాలు తపాలా వెబ్‌సైట్‌లో..

 నేరుగా కొనుగోలుదారులు సంప్రదించే వెసులుబాటు

 దళారుల దందాకు చెక్ పెట్టేలా సరికొత్త ప్రయోగం

 తెలంగాణ, ఏపీల్లో ప్రయోగాత్మకంగా త్వరలో అమలు

 

 సాక్షి, హైదరాబాద్: ‘‘భగవంతునికీ.. భక్తునికీ అనుసంధానం కోసం మా అగరబత్తిలనే వాడండి..’’ ఇది ఒక వ్యాపార సంస్థ వినియోగదారులను ఆకర్షించేందుకు చేస్తున్న ప్రచారం. అచ్చు ఇదే తరహాలో రైతులకు.. కొనుగోలుదారులకు మధ్య అనుసంధానకర్తగా మారనుంది పోస్టల్ శాఖ. రైతుల నుంచే కొనుగోలుదారులు నేరుగా ఉత్పత్తులు కొనేలా మధ్యవర్తిత్వానికి సిద్ధమైంది. రైతులకు తీవ్రంగా నష్టం చేకూరుస్తున్న దళారుల దందాకు చెక్ పెట్టేలా ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది తపాలా శాఖ. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రార ంభించింది.

 

 ఏ గ్రామంలో ఏ పంట ఎంత పండుతోంది.. దిగుబడి ఎంత.. పంట ఫొటోలు.. ఆయారైతుల వివరాలు.. చిరునామా.. ఫోన్ నంబర్లు.. ఇలా అన్నింటినీ వెబ్‌సైట్‌లో పొందుపరచనుంది. వీటి ద్వారా కొనుగోలుదారులు నేరుగా రైతులను సంప్రదించవచ్చు.  రైతుల నుంచి దిగుబడి సేకరించి కొనుగోలుదారులకు చేర్చే బాధ్యత కూడా తపాలా శాఖదే. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ఏపీ, తెలంగాణల్లో కొద్దిరోజుల్లోనే ప్రారంభించబోతోంది. ఈ వివరాలను తపాలా శాఖ ఏపీ సర్కిల్(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ శనివారం కేంద్రమంత్రి దత్తాత్రే యకు వివరించారు. ఏపీ, తెలంగాణల్లో తపాలా శాఖ, బీఎస్‌ఎన్‌ఎల్ పనితీరును శనివారం దత్తాత్రేయ సమీక్షించారు. ఈ  సంస్థలు ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన తపాలా శాఖ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్, టెలికం ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ మురళీధరరావుకు సూచించారు.

 

 ఉత్పత్తుల తరలింపునకు తపాలా వాహనాలు: రైతుల నుంచి ఉత్పత్తులు కొనే సంస్థలు నేరుగా రైతులతో మాట్లాడేందుకు ఈ వెబ్‌సైట్ దోహదం చేస్తుందని సుధాకర్ పేర్కొన్నారు. ఉత్పత్తులు కొనాలని నిర్ణయిస్తే.. తపాలా శాఖ ద్వారా వాటిని కొనుగోలుదారులకు చేరుస్తామన్నారు. దీని ద్వారా తపాలాకు కమీషన్ వస్తుందన్నారు. ఈ పథకాన్ని తెలంగాణవ్యాప్తంగా అమలు చేయాలని దత్తాత్రేయ సూచించారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో ఏపీ, తెలంగాణల్లోని 22 వేల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్ వసతి కల్పిస్తామని మురళీధర్‌రావు దత్తాత్రేయ దృష్టికి తెచ్చారు. కరీంనగర్‌లో స్థలం కేటాయిస్తే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కును ఏర్పాటు చేయనున్నట్టు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా డైరక్టర్ రామ్‌ప్రసాద్ దత్తాత్రేయ దృష్టికి తెచ్చారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top