అంగన్‌వాడీల సమస్యలపై సీఎం సానుకూలం


నల్లగొండ టూటౌన్‌ : అంగన్‌వాడీల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రూపొందించిన 2017 క్యాలెండర్‌ ఆవిష్కరణ సభ ఆదివారం స్థానిక ఎన్‌ఆర్‌ గార్డెన్‌లో నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట అంగన్‌వాడీల సమస్యలు తెలుసుకొని కొన్నింటిని పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అంగన్‌వాడీలది న్యాయమైన డిమాండ్‌ అని, వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందన్నారు.



 సీఎం వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, రైతులు కార్లు కొనుక్కొని తిరిగే రోజులు వచ్చేలా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దీని తర్వాత విద్య, వైద్యరంగాలపై దృష్టి సారిస్తారని, ఆసమయంలో అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పిల్లల్ని తీర్చిదిద్దేది అంగన్‌వాడీలేనని పేర్కొన్నారు. కేజీ విద్యలో మిమ్మల్ని తీసుకోవడం కోరడం న్యాయమైనదేనని, ఆకోరిక తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సీఎం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు భారతదేశమే తెలంగాణ వైపు చూస్తుందన్నారు.



సీఎం ముందు చూపుతో రాష్ట్రంలో కరెంట్‌ సమస్య రాలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనమండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు ఎన్‌. భాస్కర్‌రావు, వేముల వీరేశం, గాదరి కిషోర్‌కుమార్, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, తిప్పర్తి ఎంపీపీ పాశం రాంరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు భిక్షపమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నామిరెడ్డి నిర్మల, రాష్ట్ర కార్యదర్శి సుమాంజలి, జిల్లా అధ్యక్షురాలు జొన్నలగడ్డ వెంకటరమణ, జిల్లా కార్యదర్శి మజ్జిగపు సునీత, అనంత ఈశ్వరమ్మ, ఖుర్షుద్, విజయలక్ష్మి, రోజ, సైదమ్మ, శోభ, మమత, అండాలు, పద్మ, శైలజ తదితరులు పాల్గొన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top