డబుల్‌ చూపులు!

డబుల్‌ చూపులు! - Sakshi


డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకోసం పేదలు ఎదురుచూస్తున్నారు. హౌసింగ్‌ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలు పూర్తి చేయడంతో పరిపాలన అనుమతులు వచ్చిన కొన్నిచోట్ల, పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల స్థలాల సేకరణే పూర్తికాలేదు. ఇదిలా ఉండగా ఇల్లు ఎప్పుడిస్తారు సారూ.. అంటూ పేదలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు.



జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌) : జిల్లాకేంద్రంలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మొదలైంది. దీంతో ఇళ్ల నిర్మాణానికి తొలిఅడుగు పడ్డట్లు అయ్యింది. ఉమ్మడి జిల్లాలో 8300ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలా విభజన అనంతరం ప్రస్తుత మహబూబ్‌నగర్‌ జిల్లాకు 4440ఇళ్లు మంజూరవగా ఇందులో 3560 ఇళ్లకు పరిపాలన అనుమతులు లభించాయి. జిల్లా కేంద్రానికి సీఎం స్కీం కింద 2300ఇళ్లు మంజూరయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలుచేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 5.4లక్షలకు పైగా ఖర్చుతో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి లబ్ధిదారునికి ఇవ్వనుండటంతో లబ్ధిదారులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని 14నియోజకవర్గాలకు 5600ఇళ్లు, స్టేట్‌ రిజర్వ్‌ కోటా కింద నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గానికి అదనంగా మరో 400వందల ఇళ్లు మంజూరయ్యాయి. దీంతో నాగర్‌కర్నూల్‌కు అదనంగా మరో 400ఇళ్లు మంజూరైనట్లయ్యింది.



స్థలపరిశీలన పూర్తి

జిల్లాలో డబుల్‌ బెడ్రూం ఇళ్లను నిర్మించేందుకు హౌసింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాల పరిశీలన ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేశారు. దేవరకద్ర, నారాయణపేట్, జడ్చర్ల నియోజకవర్గాల్లో ఇప్పటికే టెండర్లను ఆహ్వానించారు. జిల్లాల విభజన అనంతరం రంగారెడ్డి జిల్లాలోని పరిగి నియోజకవర్గంలోని గండీడ్‌ మండలం మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలిసింది. దీంతో పరిగి నియోజకవర్గానికి 400ఇళ్ల కాగా గండీడ్‌ మండలానికి 140ఇళ్లు వచ్చాయి. ఈ ఇళ్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే వికారాబాద్‌లోకి వెళ్లిన కొడంగల్‌ నియోజకవర్గంలో జిల్లాలో మిగిలిన మండలాలకు 160ఇళ్లు వచ్చాయి. ఈ ఇళ్లకు పరిపాలన అనుమతులు రావాల్సిఉంది. మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ కాకుండా నియోజవర్గానికి 400ఇళ్లు మంజూరయ్యాయి. ఈ ఇళ్లకూ, మఖ్తల్‌లోని కొన్నిగ్రామాలు ఇతర జిల్లాలోకి వెళ్లగా 320ఇళ్లు వస్తున్నాయి. వీటికి కూడా పరిపాలన అనుమతులు రావాల్సి ఉంది.



జిల్లాలో 4440ఇళ్లు మంజూరు

మహబూబ్‌నగర్‌ జిల్లాకు 4440ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 3560ఇళ్లకు పరిపాలన అనుమతులు వచ్చాయి. జిల్లా కేంద్రంలోని 1334 క్రిష్టియన్‌పల్లి, దివిటిపల్లిలో నిర్మిస్తున్నారు. క్రిష్టియన్పల్లిలో నిర్మిస్తున్న ఇళ్ల త్వరలోనే లబ్ధిదారులకు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి నాటికి లబ్ధిదారులకు ఇవ్వాలని ఇటీవల ఆ ఇళ్లను పరిశీలించేందుకు వచ్చిన హౌసింగ్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రరామచంద్రన్‌ అధికారులు ఆదేశించారు. వీరన్నపేటలో 660, పాతపాలమూర్‌లో 258, పాతతోటలో 48ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జడ్చర్లకు 400ఇళ్లు, గండీడ్‌లో 140,  దేవరకద్ర 320 ఇళ్ల, నారాయణపేట్‌ 400 ఇళ్లకు టెండర్లు పిలిచారు. కొడంగల్‌లోని 160ఇళ్లకు పరిపాలన అనుమతులు రావాల్సి ఉంది.



జిల్లా మంత్రి చైర్మన్‌గా కమిటీ

ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా ఎంపిక చేయనున్నారు. దీనికోసం గ్రామస్థాయిలో కమిటీలు వేయనున్నారు. జిల్లాకు చెందిన మంత్రి చైర్మన్‌గా, కలెక్టర్‌ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు జీఓ 12ను ప్రభుత్వం జారీ చేసింది.



జీఓ 12ను విడుదల

పట్టణాల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల 30వేలు యూనిట్‌ కాస్టు కాగా రూ.75వేలు మౌలిక వసుతుల కల్పన కోసం కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 5లక్షల 4వేలు యూనిట్‌ కాస్టు కాగా రూ.లక్షా 25వేలు మౌలిక వసుతుల కల్పన కోసం నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి 400ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ 12ను విడుదల చేసింది. ఇందులో స్థానిక ఎమ్మెల్యేకు 200ఇళ్లు, జిల్లా మంత్రికి 200ఇళ్లు కేటాయించారు.



ముందుగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం

ముందుగా ఇళ్లను నిర్మిస్తున్నాం. ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ప్రస్తుతం గ్రామానికి 20ఇళ్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మార్చి నాటికి లబ్ధిదారులకు ఇళ్లను అప్పజెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు పనులు చేపడుతున్నాం.

– రమణారావు, హౌసింగ్‌ పీడీ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top